• .

1. ఆ.వె.

స్వేచ్ఛగా జనమును బెంచుకుంటిమి గాని

స్వచ్ఛమైన ఇంటినుంచమైతి

మందుకే మనకు మందు లేనటువంటి

రోగబాధ కలిగె రూఢి గాను

2. ఆ.వె.

స్వచ్ఛ భారతమును నిచ్ఛతో జేయగ

గాంధి యెపుడొ చెప్పె నదియు మరచి

గాంధి శిల్పములకు ఘనముగా దండలు

వేసి జయమనుచును వీడినాము

3. ఆ.వె.

మనదు భారతమును మన కుటుంబమనుచు

గాంధి మోడి వంటి ఘనులు తలచి

స్వచ్ఛభారతమును తెచ్చిరయ్య నిజము

దీనినాచరించి మనగ మనము 

4. ఆ.వె.

స్వచ్ఛభారతమును నిచ్ఛతో జేయగ

మన ప్రధాని మోడి మనకు దెచ్చె

మోడి ఇంట జరుగు పెండ్లి కాదిదియయ్య !

భరతభూమి శుభ్రపరచునయ్య !

5. ఆ.వె.

స్వచ్ఛత యనునదియె సంస్కృతి చిహ్నము

స్వచ్ఛతున్న యెడల సంపదదియె

స్వచ్ఛత కఱవైన స్వేచ్ఛ యెందుకు తండ్రి !

స్వచ్ఛ భారతాన స్వస్థుడగును !

6. ఆ.వె.

స్వచ్ఛభారతమని శ్రద్ధగా పెద్దలు

వచ్చి సేవ జేయ వరము గాదు

మనకు మనమె స్వచ్ఛమైన సంస్కృతి తోడ

శుభ్రపరచుకొనిన శుభము కలుగు

 - శిష్టు శాస్త్రి (కొంతమూరు, రాజమహేంద్రవరం)

మమకార మధురిమలు పొంగు

మధుర సుధాభరిత

ఆత్మీయతకు ప్రతిరూపమైన

నిశ్చల విమల చరిత

ఎల్లలెరుగని మధురోహలకు

పొంతన కూర్చు కవిత

చిలిపిదనపు పరవళ్ళలో

కాంచవచ్చు గోదావరి తుళ్ళింత

రస హృదయాలకు లేదు చింత

ఈ పడతి నవరస భావనల సంత

పసిడి అందాల ఈ భరిణె చెంత

యువహృదయాలకు తప్పదు గిలిగింత

ఆప్యాయతానుబంధాల చందన భరిత

అందాల సిరిగంధాల పూత...

ఆత్మ సౌందర్యపు కలనేత..

నైతిక విలువల కలబోత

ఆధునికతకు ప్రతీక, 

స్వేచ్చకు ఎత్తిన పతాక

ఈమె ఒక పరిపూర్ణ వనిత

                                  -దీక్షిత్

ప్రియతమా...

చిరునవ్వులు కురిపిస్తావని...

బిగి కౌగిట బంధిస్తావని...

నులివెచ్చని ముద్దిస్తావని...

నీ ఒడిలో చోటిస్తావని...

ఎంతగానో ఆశించాను....

కానీ నువ్విలా...

కరుణ లేని రాయిలా

నన్ను వీడి వెళతావని

కలలో కూడా అనుకోలేదు... ఆ కలలో కూడా

ఈ బాధను భరించలేను

నువ్వు లేని ఈ చోటు

నాకొక నరకంలా ఉంది

నీకోసం వెదికి వేసారిన కళ్ళు

తడి ఇంకిన ఎడారి బయళ్ళు

నీ పలకరింపు కోసం

తపిస్తున్న నా హృదయం

దహిస్తున్న పెనుగాయం

నీ ఆత్మీయత

నీ అనురాగం

నీ స్పర్శలోని సాంత్వన

అన్నీ కావాలి....

నీ నవ్వు కావాలి

నీ సాన్నిధ్యం కావాలి

నాకు నువ్వు కావాలి

అవును నువ్వే కావాలి ....

                    -దీక్షిత్

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836