శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం


వైకుంఠ ద్వారం గుండా వారంతా గడచి పాలసంద్రపు మధ్యనే త్లెటి శేషపానుపుపై విలాసుడై పవళించిన జగత్ప్రభువు శ్రీమన్నారాయణుని చెంతకు చేరుకున్నారు. దేవజనులు .. ఋషిపుంగవులూ కట్టగట్టుకొని తన వద్దకు రావడాన్ని గాంచిన లోకేశుడు మెత్తగా మందహాసం చేసాడు.. ఆ నవ్వు కోటి పున్నమి చంద్రుల సాటి  చలువ కాంతులను వెదజల్లగా ఆ సజ్జన మానసములన్నీ పరవశించాయి. 

ప్రభో వైకుంఠవాసా... పాహి పరమేశ్వరా... నమోస్తు లోకేశ్వరా... అంటూ వారందరూ ఎలుగెత్తి స్తుతించారు.  

ఏమిటి నారదా దేవప్రముఖును, సాధుసత్తమునూ అందరినీ ఒకేసారి ఇలా తీసుకువచ్చావు? ఏదైనా విశేషమా లేక నీ వినోదమా? 

లోకేశ్వరుడైన మహావిష్ణువు చిద్విలాస వదనుడై ఇలా ప్రశ్నించడంతో అందరూ మహోల్లాస భరితుయ్యారు.

నారదుడు ఒకింత చిన్నబుచ్చుకున్నట్లుగా అభినయిస్తూ పలికాడు.

అదేమిటయ్యా నారదా! నిత్యా వినోదివి... గడసరివి! నీ హృదయమున బాధా..! అదెందు చేతనో? మహావిష్ణువు పలుకులు విన్నంతనే.. నారదుడు తన మనసులోని బాధను ఇలా విశదం చేసాడు...

స్వామీ! లోకేశ్వరేశ్వరా! త్రికరణశుద్ధిగా నీ నామస్మరణము తప్ప,నీ ధ్యానము వినా వేరొకటి ఎఱుగనివాడను నేనన్న సంగతి నీకు తెలియనిది కాదు. ఈ లోకాలోకములన్నీ నీ క్రీడావేదికలే అన్న విషయమూ నాకు తెలుసనే ఇంతకాలమూ అనిపించేది. అందుచేతనే జగన్నాటక సూత్రధారివైన నీవు ఎప్పుడు ఏ రూపంలో ఏ చిద్విలాసం ప్రదర్శించినా ఆయా లీలావినోదములను గాంచి పరవశించుటయే గాని ఖేదపడి ఎఱుగని వాడను నేను. నీ అంతటి వాడవు నీవు. నీవే సంకల్పించినావంటే ఎదో ఒక విషయమూ, విశేషమూ ఉండకుండునా అనే నేను సదా విశ్వసించాను. ఘటనాఘటన సమర్థుడవైన నీవు ఏ పని చేసినా, ఏ లీల చూపినా, ఏ అవతారము దాల్చినా అందు అత్యద్భుతాలను గాంచి అనితరమూ ఆనంద పరవశుడనే అయ్యాను తప్ప ఇంతవరకూ ఏనాడూ కించిత్ బాధపడి ఎఱుగనయ్యా!  

కానీ ఈనాడు.. ఎందుచేతనో ఈ హృదయం ఆవేదనాభరితమైనది మహాత్మా! ఈ పాల్కడలి యందు పవళించిన సర్వేశరుడవు నీవు. నీవే సర్వలోక కర్తవు. నీకే సమస్తమూ తెలియును. నేవ్వే సకాలానికీ భర్తవు, కర్తవు. అట్టి నీవు వహించిన ఏ సంకల్పమూ నిష్ప్రయోజనము కాదు.  అంతే కాక అది జగదోద్ధారకము కూడా కాగలదని నేను గ్రహించిన విషయమే. అయినప్పటికీ ఈ క్షణాన మా అందరి హృదయ పరితాపమునూ యేలినవాడవైన నీకు నివేదించుట ఉత్తమమని భావించాను పరంధామా! 

మా మదిలో నెలకొన్నది అజ్ఞానాంధకారమో, మా ఆలోచనలను అలముకొన్నది అవిద్యయో తెలియకున్నది కానీ..నేడెందుచేతనో  నీ చిత్తమే మహోత్తమమని మాత్రము నాకు తోచుటలేదు మహాప్రభూ! ఇంతకు మించిన రహస్యమైనందు ఉన్నచో అది నీవే తెలిపి తరింపజేయాలి అనంతా! అంటూ ఆవేదనాంతరంగుడై పలికాడు నారద మహర్షి! 

(సశేషం) 

శ్రీమద్భాగవత, మహాభారతాంతర్గతమైన శ్రీకృష్ణ చరితం 

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం


దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే తన అవతార లక్ష్య సాధనలో ఆ మహనీయుడు ఎంచుకున్న మార్గం అనితరం కాదూ! ఆహా... ఎన్నెన్ని రీతుల శిష్టులను సంతోషభరితును చేశాడు. ఎంత గొప్పగా ఆశ్రితులను ఉద్ధరించాడు. సజ్జన మధ్యంలోనే తాను ఉంటానని చెప్పిన ఆ మహాపురుషుడు తన చుట్టూ ఉన్న సర్వాన్ని ఎంతగా మార్చేశాడు. అది నందవ్రజమైనా, బృందావనమైనా... మధుర అయినా... ద్వారక అయినా... ఎక్కడ తానున్నా సర్వం ఆనందసాగరమే! అందరికీ తానున్నానని అనుక్షణం ఆయన కల్పించిన విశ్వాసం... ఆయన ఇచ్చిన ధైర్యం అనన్యసాధ్యం. అనితరమూ ఆ మాటను నిబెట్టుకుంటూనే ఇంతకామూ భూమిపై చరించాడు ఆ దివ్యపురుషుడు.

ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు... ఎంతెంత ఆప్యాయత పంచాడు... ఎంతమందిని తరింపజేశాడు.. ఎంత గొప్పగా మార్చేశాడు భూమిని...! 

ఈ కృష్ణుడనేవాడు భూమిపై సంచరించినంతకాం తమకు ఆ భూలోకం ఓ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఎప్పుడూ కృష్ణుడి ధ్యాసే... ఎప్పుడూ ఆ నీలమేఘశ్యామునిపై మనసే! అనుకుంటున్నారు దేవజనులందరూ!

అవును నిజమే... అసలు భూమిని మించిన ఉత్తమలోకాలు ఉంటాయని... తమకు అక్కడికి వెళ్ళడమే జీవన లక్ష్యమని కూడా ఈ కృష్ణుని చూసిన సంతోషంలో మరచిపోయామని ఋషులు వంతపాడారు. ఎప్పుడూ కృష్ణుని చూస్తూ ఉండాలని, ఆయన మాటలు వింటూ ఉండిపోవాలని .. ఆయన లీలలు తనివిదీరా కథలుగా చెప్పుకోవాలని... అలుపెరుగని తపనే తప్ప వైకుంఠం, పరంధామం, సత్యలోకం అనే లక్ష్యాల వైపే మనసు పోయేది కాదని ఒక ముని అంటున్నాడు....

ఆ మాటలు వినడంతోనే మహాజ్ఞానప్రకాశంతో ముఖసీమ మెగొందుతున్న ఓ ఋషి ఇలా జవాబిచ్చాడు!


‘అవును సాధుజనులారా... మీరంటున్నది సంపూర్ణసత్యం! అయితే ఇందు విపరీతమేమున్నది? ఆ శ్రీమన్నారాయణుడు తన సర్వశక్తులతో సంపూర్ణ తత్వంతో ఇలకు దిగివచ్చాడు. ఆ దివ్యతేజమే శ్రీకృష్ణావతారం! ఇక్కడ వైకుంఠంలో నారాయణుడు ఎంతో.. అక్కడ భూలోకంలో ఆ కృష్ణుడూ అంతే! ఇరువురూ సమానులైనప్పుడు మన ధ్యాస, మన ఆశ అంతా ఎవరు భక్తసులభులైతే వారిపైనే కేంద్రీకృతం కావడంలో తప్పేమున్నది? ’

లెస్స పలికావు మహాశయా అంటూ అందరూ అతడిని అభినందించారు. 

కృష్ణుడు ఎక్కడ ఉంటే అదే వైకుంఠమని భావించడం నాకూ సముచితంగానే ఉన్నది... నాకెంతగానో నచ్చినది కూడా ! కానీ ఇది ఆ దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పట్ల అవిధేయత అవదా? కించిత్‌ అపరాధ భావనతో పలికాడు ఇంద్రుడు. 

ఇది విన్న నారదుడు మందహాసం గావించాడు. ఆపైన ఇంద్రుని సందేహానికి సమాధానం చెబుతూ ఇలా పలికాడు.

"దేవేంద్రా! శ్రీమన్నారాయణుని పట్ల నీకు గల స్థిరభక్తి మెచ్చదగినది. నీవు ఇట్లు సందేహం వ్యక్తపరుచుటలో విచిత్రం ఏమీ లేదు. నిజానికి నేను మొదట వ్యక్తం చేసిన అభిప్రాయమే ఇది! అయితే సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే తన కృష్ణ తత్వాన్ని చూసుకొని మురిసిపోయాడు.. ఇక మనమెంత!"

ఈ మాటలు అందరినీ చకితుల్ని చేశాయి.. 

ఏమిటి దేవర్షీ ... ఏమంటున్నావు నీవు! విష్ణువు కూడా కృష్ణ మాయకు లోబడినాడా? అందరి నోటా ఇదే ప్రశ్న వెలువడింది. 

నారాయణ... నారాయణ.. అందరూ కలిసి నన్ను గొప్ప ఇరకాటంలో పెడుతున్నారు! తన అవతారాన్ని చూసి తాతగారు తానే మురిసి పోయారని అన్నాను గానీ. మాయకు లోబడినారని నేనన్నానా? అయినా నాకెందుకు ఈ గొడవంతా!! అంత సందేహంగా ఉంటే మీరే వెళ్లి స్వామిని అడగండి. ఆయన మనసులో ఏముందో ఆ నోటితోనే విందురు... అమాయకంగా చెబుతున్న నారదుడిని గాంచి మహర్షి ఏదో ప్రణాళికతోనే ఇదంతా మాట్లాడుతున్నారని గ్రహించారు ఋషులు.

సరి.. ఇంకేం మరి! పదండి అంటూ అందరూ శ్రీమన్నారాయణుని చెంతకు నడిచారు.. 

వైకుంఠ ద్వారం గుండా వారంతా పాలసంద్రపు మధ్యనే తెల్లటి శేషపానుపుపై విలాసుఁడై పవళించిన జగత్ప్రభువు శ్రీమన్నారాయణుని చేరుకున్నారు దేవజనులు.. ఋషిపుంగవులూ.

వారి రాకను గాంచిన లోకేశుడు మెత్తగా మందహాసం చేసాడు.. ఆ నవ్వు కోటి పున్నమి చంద్రుల పాటి చలువ కాంతులను వెదజల్లగా మునిమానసములన్నీ పరవశించాయి. 

ప్రభో వైకుంఠవాసా... పాహి పరమేశ్వరా... నమోస్తు లోకేశ్వరా... అంటూ వారందరూ ఎలుగెత్తి స్తుతించారు.

(సశేషం) 

(శ్రీమద్భాగవత, మహా భారతాంతర్గత శ్రీ కృష్ణ చరితామృతం)

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

ఆహా.. ఆనాడు నేను స్పర్థ పూని నా శక్తిని ప్రదర్శించబోయినది సాక్షాత్తు జగత్పాలకునితోనే కదా! చిన్ని కృష్ణునిగా ఆ స్వామి గోకులాన వర్ధ్లిల్లుతుండగా... నేనీ ఇంద్రపదవిని చూసుకొని మిడిసిపడినాను ఆనాడు. అందాలు చిందే ఆ దివ్యబాలకుడు అంతే అందంగా నాకు గుణపాఠం నేర్పినాడు కదా ఆరోజున! ఆహా.. నా ఓటమి కూడా ఆనాడు ఎంత ఆనందాన్ని కలిగించిందో కదా!  ముచ్చటగొలిపే ఆ చిన్నారి కృష్ణుడు చిటికెనవేలిపై అంతపెద్ద మహాపర్వతాన్ని మోయటమా...! భయానకమైన మెరుపులు, దారుణమైన ఉరుములు, పిడుగులతో కూడిన కుంభవృష్టి నుంచి, మహా ప్రకృతి విపత్తు నుంచి కూడా చిద్విలాసవదనుడై యావత్‌ యాదవులనూ రక్షించిన ఆ అద్భుత సన్నివేశం మహామహిమాన్వితం కాదూ...! ఇలా అనుకుంటూ ఇంద్రుడు మురిసిపోతున్నాడు. ‘చూశావా ఇంద్రా... ఆనాటి ఆ మధురానుభూతుల పరవశంలో మునిగి మా ఉనికినే మరచిపోయావు!’ నారదుడి చమత్కారంతో తన పరధ్యానంలోనుంచి బయటపడ్డాడు దేవేంద్రుడు. నారదుడు ఏ ముహూర్తాన కృష్ణమాయకు తెరతీశాడో గానీ.. అక్కడున్న ఋషులు, దేవప్రముఖులు అందరి ఆలోచనలూ దానిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఎవరికి వారే విష్ణుమాయను కూడా ఛేదించుకొని కృష్ణమాయాబద్ధులైపోయారు. వారందరి ఆలోచనల్లోనూ ఆ కృష్ణుడే!  అవును నిజమే కదా! మోహాలకు అతీతులమయ్యామనే కదా తమకీ ఉత్తమ గతులు. దేవతలంటే ఆనందస్వరూపులని, వారి స్వర్గమే ఆనందనిలయమని లోకాలాన్నీ కొనియాడతాయి. ఇక్కడికి రావాలని లోకాల్లోని వారంతా తహతహలాడతారు. కానీ ఈ కృష్ణుడు ఆ లోకగతినే మార్చేశాడు! తానున్న తావునే స్వర్గాధికం చేశాడు. తాను ఎక్కడ కాలు మోపితే అక్కడ దివ్యానందాన్ని ప్రతిష్ఠించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వైకుంఠాన్నే భూమికి దించేశాడు ఈ నల్లవాడు. బహు గడసరి అయిన ఈ కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తినే మరిపించి సర్వులనూ మురిపించాడు. భూజనులనే కాదు సురాసురులను, సర్వసంగ పరిత్యాగులు, మహాజ్ఞానులు అయిన ఋషులను కూడా మహా సమ్మోహనంలో ముంచేశాడు. పండితపామరజనభేదం లేకుండా అందరికీ ఆప్తుడయ్యాడు. భూమిపై పరిపూర్ణ భగవదవతారుడై కాలిడినది మొదలు తిరిగి నేడు వైకుంఠానికి వచ్చే వరకూ ప్రతిక్షణం ఎంతగా అలరించాడు.. ఎంతెంత లాలించాడు.. ఎంత గొప్పగా పాలించాడు! దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే తన అవతార లక్ష్య సాధనలో ఆ మహనీయుడు ఎంచుకున్న మార్గం అనితరం కాదూ! ఆహా... ఎన్నెన్ని రీతులలో శిష్టులను సంతోషభరితులను చేశాడు. ఎంత గొప్పగా వారిని ఉద్ధరించాడు. సజ్జన మధ్యంలోనే తాను ఉంటానని చెప్పిన ఆ మహాపురుషుడు తన చుట్టూ ఉన్న సర్వాన్ని ఎంతగా మార్చేశాడు. అది నందవ్రజమైనా, బృందావనమైనా... మధుర అయినా... ద్వారక అయినా... హస్తిన అయినా, కడకు కురుక్షేత్రమైనా సరే .... ఎక్కడ తానున్నా సర్వం ఆనందసాగరమే! అందరికీ తానున్నానని అనుక్షణం ఆయన కల్పించిన విశ్వాసం... ఆయన ఇచ్చిన ధైర్యం అనన్యసాధ్యం. అహరహమూ ఆ మాటను నిలబెట్టుకుంటూనే ఇంతకాలమూ భూమిపై చరించాడు ఆ దివ్యపురుషుడు.  చివరికిలా ఈనాడు లోకాలన్నిటినీ వదిలి... తన నిజ వాసానికి విచ్చేశాడు లోక విభుడు. ఇది సంతోషించాల్సిన విషయమే తామందరికీ...! కానీ ఆ సంతోషం స్థానంలో ఏదో వెలితి.. ఏదో బాధ తొలిచేస్తున్నాయి ... ఏమిటీ విపరీతం!  శ్రీమహావిష్ణువు పరిపూర్ణుడైనా కూడా ఆ కృష్ణుని యందే తమ మానసాలు ఏల లగ్నమై ఉన్నాయి... అక్కడ కృష్ణుడు శరీర విసర్జన చేస్తే తాము ఎందుకు కళవెళ పడుతున్నట్లు?

(సశేషం)

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836