• .

శ్రీకృష్ణ వేదం - 06

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం


వైకుంఠ ద్వారం గుండా వారంతా గడచి పాలసంద్రపు మధ్యనే త్లెటి శేషపానుపుపై విలాసుడై పవళించిన జగత్ప్రభువు శ్రీమన్నారాయణుని చెంతకు చేరుకున్నారు. దేవజనులు .. ఋషిపుంగవులూ కట్టగట్టుకొని తన వద్దకు రావడాన్ని గాంచిన లోకేశుడు మెత్తగా మందహాసం చేసాడు.. ఆ నవ్వు కోటి పున్నమి చంద్రుల సాటి  చలువ కాంతులను వెదజల్లగా ఆ సజ్జన మానసములన్నీ పరవశించాయి. 

ప్రభో వైకుంఠవాసా... పాహి పరమేశ్వరా... నమోస్తు లోకేశ్వరా... అంటూ వారందరూ ఎలుగెత్తి స్తుతించారు.  

ఏమిటి నారదా దేవప్రముఖును, సాధుసత్తమునూ అందరినీ ఒకేసారి ఇలా తీసుకువచ్చావు? ఏదైనా విశేషమా లేక నీ వినోదమా? 

లోకేశ్వరుడైన మహావిష్ణువు చిద్విలాస వదనుడై ఇలా ప్రశ్నించడంతో అందరూ మహోల్లాస భరితుయ్యారు.

నారదుడు ఒకింత చిన్నబుచ్చుకున్నట్లుగా అభినయిస్తూ పలికాడు.

అదేమిటయ్యా నారదా! నిత్యా వినోదివి... గడసరివి! నీ హృదయమున బాధా..! అదెందు చేతనో? మహావిష్ణువు పలుకులు విన్నంతనే.. నారదుడు తన మనసులోని బాధను ఇలా విశదం చేసాడు...

స్వామీ! లోకేశ్వరేశ్వరా! త్రికరణశుద్ధిగా నీ నామస్మరణము తప్ప,నీ ధ్యానము వినా వేరొకటి ఎఱుగనివాడను నేనన్న సంగతి నీకు తెలియనిది కాదు. ఈ లోకాలోకములన్నీ నీ క్రీడావేదికలే అన్న విషయమూ నాకు తెలుసనే ఇంతకాలమూ అనిపించేది. అందుచేతనే జగన్నాటక సూత్రధారివైన నీవు ఎప్పుడు ఏ రూపంలో ఏ చిద్విలాసం ప్రదర్శించినా ఆయా లీలావినోదములను గాంచి పరవశించుటయే గాని ఖేదపడి ఎఱుగని వాడను నేను. నీ అంతటి వాడవు నీవు. నీవే సంకల్పించినావంటే ఎదో ఒక విషయమూ, విశేషమూ ఉండకుండునా అనే నేను సదా విశ్వసించాను. ఘటనాఘటన సమర్థుడవైన నీవు ఏ పని చేసినా, ఏ లీల చూపినా, ఏ అవతారము దాల్చినా అందు అత్యద్భుతాలను గాంచి అనితరమూ ఆనంద పరవశుడనే అయ్యాను తప్ప ఇంతవరకూ ఏనాడూ కించిత్ బాధపడి ఎఱుగనయ్యా!  

కానీ ఈనాడు.. ఎందుచేతనో ఈ హృదయం ఆవేదనాభరితమైనది మహాత్మా! ఈ పాల్కడలి యందు పవళించిన సర్వేశరుడవు నీవు. నీవే సర్వలోక కర్తవు. నీకే సమస్తమూ తెలియును. నేవ్వే సకాలానికీ భర్తవు, కర్తవు. అట్టి నీవు వహించిన ఏ సంకల్పమూ నిష్ప్రయోజనము కాదు.  అంతే కాక అది జగదోద్ధారకము కూడా కాగలదని నేను గ్రహించిన విషయమే. అయినప్పటికీ ఈ క్షణాన మా అందరి హృదయ పరితాపమునూ యేలినవాడవైన నీకు నివేదించుట ఉత్తమమని భావించాను పరంధామా! 

మా మదిలో నెలకొన్నది అజ్ఞానాంధకారమో, మా ఆలోచనలను అలముకొన్నది అవిద్యయో తెలియకున్నది కానీ..నేడెందుచేతనో  నీ చిత్తమే మహోత్తమమని మాత్రము నాకు తోచుటలేదు మహాప్రభూ! ఇంతకు మించిన రహస్యమైనందు ఉన్నచో అది నీవే తెలిపి తరింపజేయాలి అనంతా! అంటూ ఆవేదనాంతరంగుడై పలికాడు నారద మహర్షి! 

(సశేషం) 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836