అటవీ సంరక్షణ కృషికి శతాబ్దాల చరిత్ర

ఎపి ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి


భారతదేశ చరిత్రలో అటవీ సంరక్షణకు విశేష ప్రాముఖ్యత ఉందని, వనాల పరిరక్షణ కోసం అనేక శతాబ్దాలుగా చేసిన కృషికి దాఖలాలు ఉన్నాయని ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి అన్నారు. ఇటీవల విధులు చేపట్టిన ఫారెస్ట్ బీట్ అధికారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవుల యాజమాన్యం అనేది సదవగాహన, శాస్త్రీయతపై ఆధారపడిన సంక్లిష్ట విషయమని ఆయన అన్నారు. విధినిర్వహణలో అటవీ అధికారుల విజయంపైనే పర్యావరణం, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం,భావితరాల భద్రతా ఆధారపడి ఉంటాయన్నారు. అందుకే ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలతో క్షేత్రస్థాయి అటవీ సిబ్బందికి శాస్త్రీయ శిక్షణ ఇస్తోందని తెలిపారు. అగ్నిపురాణంలో చెట్లు నాటడాన్ని పుణ్యకార్యంగా పేర్కొన్నారని, ఐదేళ్లకోసారి మొక్క నాటాలని బుద్ధుడు బోధించాడని చెబుతూ మతాచారాల్లోనే పూర్వీకులు వనసంరక్షణ బాధ్యతలు చేపట్టారన్నారు. 300 ఏళ్లకు ముందు గ్రీకు రాయబారి మెగస్తనీస్ భారతదేశంలో అమలులో ఉన్న అటవీ యాజమాన్య విధానాలను వివరించాడన్నారు. కౌటిల్యుడు అడవుల్ని ప్రయోజనాల ఆధారంగా వర్గీకరించాడని, అటవీ విధ్వంసానికి పాల్పడితే జరిమానాలు నిర్దేశించాడని వివరించారు. ఆధునిక కాలంలో శాస్త్రీయంగా అటవీ యాజమాన్య నిర్వహణకు ప్రత్యేక శాఖను బ్రిటిషర్లు 1864 లో ఏర్పాటు చేశారన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో అటవీప్రాంతానికి విపరీతంగా నష్టం ఏర్పడిందని ఆ తర్వాత అటవీ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. సక్రమ అటవీ యాజమాన్యానికి శిక్షణ అవసరం ఏర్పడిందని మూర్తి వెల్లడించారు. 1867 లో తొలిసారిగా భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో అటవీ సంరక్షణపై శిక్షణ ఇప్పించిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో వివిధ హోదాల అటవీ అధికారుల కోసం దేశవ్యాప్తంగా శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసి నిరంతర శిక్షణ ఇస్తున్నారన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం