విచక్షణ కోల్పోతున్న రాజకీయ మేధావులు


ఇదే గుజరాత్ లో హంగ్ వచ్చి కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ అయితే ఏమందురు? కాంగ్రెస్ గెలిచిందని గెంతులేయరూ!? సాధారణ మెజారిటీ కంటే (మ్యాజిక్ ఫిగర్ ) ఒక్కటంటే ఒక్క సీటు ఎక్కువొచ్చి కాంగ్రెస్ గెలిస్తే .. ఇక మీ సంబరం పైస్థాయిలో ఉండదూ! ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే.. మోదీ ని వ్యతిరేకించండి.. లేదా సమర్థించండి...అందులో తప్పేమీ లేదు. కానీ మోదీ ని ప్రమాణంగా తీసుకుని రాజ్యాంగ నియమాలని కూడా మార్చి చెప్పేయకండి. మీ విచక్షణను మీరే చంపేసుకోకండి. ఇదీ మనం ఇవాళ ఈ దేశపు మేధావులకు, రాజకీయ పండితులకి, పరిశీలకులకు చెప్పాల్సిన మాట. సాధారణ మెజారిటీ అయినా.. అద్భుత మెజారిటీ అయినా ఉండేది, వర్తించేది ఐదేళ్ళే! అది కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా... మరే పార్టీ అయినా కూడా! అదే రాజ్యాంగం చెప్పింది. సాధారణ మెజారిటీ కంటే తక్కువ వస్తే (హంగ్ ఏర్పడితే) అదీ సమస్య. అప్పుడు బేరసారాలు, సభ్యుల కొనుగోళ్లు ఇంకా అమ్మకాల వలన ప్రజాతీర్పు పెడదారి పడుతుంది. మరో విషయం.. తాము తీర్పునిచ్చిన ఐదేళ్ల పరిధిలో ఎవరెలా పని చేసారో చూసి వచ్చే ఎన్నికల్లో జనం ఓట్లేస్తారు తప్ప ముందటి ఎన్నికల్లో ఎన్ని ఇచ్చామో చూసి ఆ లెక్క సరిపోవాలనో.. సరిపెట్టాలనో వేయరు! అది ఎలాగంటే.. ఈ పర్యాయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లు వచ్చిన బిజెపి వచ్చే ఎన్నికలో ఓడిపోతుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? లేక 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్ గెలుస్తుందని వారి నమ్మకమా? రెండూ వీళ్ళ చేతుల్లో లేవని వీరికీ తెలుసు, మనకూ తెలుసు. ఇవన్నీ వారికి తెలియక కాదు.. వారు అంత అజ్ఞానులూ కాదు. కానీ మోదీ ఓడిపోవాలన్న వారి ప్రగాఢ వాంఛ.. ఆ కోరిక నెరవేరలేదన్న దుగ్ధ లోనుంచి పుట్టుకు వస్తున్న విశ్లేషణలు ఇవి! అంతే.. ఇది మోదీకి వ్యతిరేకంగా వారు రాస్తున్న స్వీయ రాజ్యాంగం! ఒక పార్టీ, ఒక రాష్ట్రంలో వరుసగా ఆరు ఎన్నికల్లో గెలిస్తే.. దాదాపు పాతికేళ్ళు అధికారం నిలబెట్టుకుంటే చిన్న విషయమా? అదే పాతికేళ్ళూ మరో పార్టీ జనం తిరస్కరణకు గురై ఓడిపోతుంటే.. ఆ పార్టీ ఈ రాజకీయ, మీడియా మేధావులకు ఆరాధ్య దైవంగా కనిపిస్తోందా? పశ్చిమ బెంగాల్ లో ఏనాడైనా సిపిఎం విషయంలో వీరు ఇలాంటి అడ్డదిడ్డం వాదనలు చేసారా? నిజాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం అందరి విధి. మోదీని విమర్శించడం తప్పు కాదు. కానీ మోదీని తప్పు పట్టడం కోసం నిజానికి మసి పూస్తున్నారు.. అదే తప్పు. ! ఆ మసి చివరికి వారి చేతుల్లోనే కనిపిస్తుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం