అమిత్ షా జోక్యంతో సమసిన అసమ్మతి


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జోక్యం చేసుకుని గుజరాత్ లో అసమ్మతి వ్యవహారాన్ని చక్కదిద్దారు. శాఖల కేటాయింపుల్లో అవమానం జరిగిందంటూ కినుక వహించిన గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ దీంతో మౌనంవీడారు. ఆదివారం కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు. పోర్ట్‌పోలియోల విషయంలో షా హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు నితిన్‌ తెలిపారు. పార్టీ చీఫ్‌ అమిత్‌ షా ఫోన్‌ చేసి నాతో మాట్లాడారు. తగిన శాఖలను కేటాయించే విషయంలో మాట ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు అని నితిన్‌ పటేల్‌ మీడియాతో అన్నారు. గత క్యాబినెట్ లో నితిన్ పటేల్ ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించారు. ఈ దఫా ఆయనను మరోసారి డిప్యూటీ సీఎంను చేస్తూనే శాఖలను మార్చారు. దీంతో అలిగిన నితిన్ బాధ్యతలు స్వీకరించకుండా తిరస్కారభావాన్ని ప్రకటించారు. ఈ అవమానం యావత్‌ పటేల్‌ సామాజిక వర్గానికి జరిగిందిగా భావించాలని, 10 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తే కాంగ్రెస్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్నే కూల్చేద్దామని ఇదే అదనుగా హార్దిక్ పటేల్ తదితరులు హంగామా చేసారు. కాంగ్రెస్ వారితో కూడా మంతనాలు సాగాయి. చివరికి అమిత్‌ షా జోక్యంతో నితిన్‌ తగ్గడంతో హార్దిక్, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం