గాంధీజీ హత్య జరగకపోయి ఉంటే...!


ఆ రోజు ఆ ఘటన జరగకపోయి ఉంటే.. దేశ చరిత్ర గతి మరోలా ఉండేది.. నేను ఇక్కడ మహాత్మ గాంధీనో, నాథూరాం గాడ్సేనో సమర్థించడమో, విమర్శించడమో చేయడం లేదు.. ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ మాత్రమే.. జనవరి 30, 1948, సాయంత్రం 5.17గం.. ఢిల్లీలోని బిర్లా హౌస్ దగ్గర ప్రార్ధన సమావేశానికి వెళ్లుతున్న మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. ఆయనకు తోడ్పడింది నారాయణ ఆప్టే అనే మరో యువకుడు.. దేశ విభజన సందర్భంగా జరిగిన మత కల్లోలాల్లో లక్షలాది మంది అమాయక పౌరులు మరణించారు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కరువైంది ఇళ్లూ ఆస్తులూ కోల్పోయిన అభాగ్యులెందరో.. పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి కట్టుబట్టలతో తరలి వచ్చిన కుటుంబాలు అసంఖ్యాకం.. వీరంతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో దేశ విభజన సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు భారత్ ఇవ్వాల్సిన రూ.55 కోట్లను వెంటనే ఇవ్వాలంటూ మహాత్మగాంధీ నిరాహార దీక్ష చేపట్టడం ఆగ్రహం తెప్పించింది. అప్పటికే గాంధీజీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న నాథూరాంగాడ్సే ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. తన పథకాన్ని అమలులో పెట్టేశాడు.. గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష అమలైంది. తోడ్పడిన ఇతర నిందితులకు జైలు శిక్ష పడింది.. ఇవి బయటకు కనిపించిన సత్యాలు.. గాంధీ హత్యలో ఎలాంటి ప్రమేయం లేకున్నా నిందలు ఎదుర్కొన్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ సంస్థపై వెంటనే నిషేధం విధించారు.. వాస్తవానికి నాథూరాంగాడ్సే ఒకప్పుడు ఆరెస్సెస్ లో ఉన్నా, కాలక్రమంలో ఆ సంస్థతో విబేధించి హిందూ మహాసభలో చేరాడు.. గాంధీజీ హత్య తర్వాత జరిగిన దర్యాప్తులో ఆరెస్సెస్, హిందూ మహాసభలకు ఎలాంటి ప్రమేయం లేదని తేలిపోయింది. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా చేసిన పని అని గాడ్సే కూడా స్పష్టం చేశాడు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. గాంధీజీ హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా అరెస్టయిన మహానేత వినాయక్ దామోదర్ సావర్కర్.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి రెండు యావజ్జీవ శిక్షలకు గురైన మహాయోధుడు సావర్కర్. అలాంటి మహానీయుడిపై అన్యాయమైన నిందలు మోపారు. ఆయన హిందూ మహాసభ అధ్యక్షుడు కావడమే కారణం. గాంధీజీ హత్య జరగకపోయి ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేని చెప్పవచ్చు.. అప్పటికే వయసు మీద పడిన కాంగ్రెస్ నాయకులు తమ జీవిత కాలంలో పదవులు అనుభవించలేమనే భయంతో దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యాన్ని అంగీకరించారు. విభజన సందర్భంగా జరిగిన మారణహోమం, విషాద ఘటనలపై దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ లో మాన ప్రాణాలు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో భారత దేశానికి తరలి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అలాంటి కష్ట సమయంలో వారికి అండగా నిలిచింది ఆరెస్సెస్, హిందూ మహాసభలు.. పెద్ద సంఖ్యలో శిబిరాలను ఏర్పాటు చేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోజుల్లో స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పెద్దగా లేవు.. గెలిచినా బొటాబొటీ మెజారిటీయే ఉండేది.. హిందూ మహాసభకు అధికారం దక్కకున్నా పెద్ద సంఖ్యలోనే సీట్లు వచ్చి ఉండేవి.. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలుండేవి. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదు. హిందువుల్లో ఐక్యత, దేశభక్తిని ప్రేరేపించే సంస్థగా అప్పటికే గుర్తింపు వచ్చింది ఆ సంస్థకు.. దురదృష్టవశాత్తు గాంధీ హత్యతో పరిస్థితి తారుమారైపోయింది. నిషేధం కారణంగా ఆరెస్సెస్ విస్తరణలో కొంత కాలం జాప్యం జరిగిపోయింది. హిందూ మహాసభ పూర్తిగా రాజకీయాలకు దూరమై కనుమరుగైంది. అదే సమయంలో సానుభూతి ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ పార్టీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నెహ్రూ వంశ పారంపర్య-కుటుంబ పాలనకు పునాది పడింది.. దేశంలో కుహనా లౌకికవాదం, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, కుంభకోణాలకు బీజం వేసిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించేందుకు చాలా ఏళ్లే పట్టింది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ తో ఎంతో మంది స్వయం సేవకులు చేరారు. ఎమర్జెన్సీ తర్వాతి కాలంలో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపొందింది. జాతీయవాదాన్ని సమర్ధించే బీజేపీకి సహజంగానే ఆరెస్సెస్ స్వయంసేవకుల అండదండలు ఉంటాయి.. గాంధీజీతో ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం కట్టుబడిన గొప్ప దేశ భక్తుడు ఆయన.. భారతమాత ప్రియ పుత్రుడు.. కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో మహాత్ముడిగా నిలిచిపోయారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరుకున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందుకు సిద్దమై మహాత్ముని సూచనను పాటించలేదు. మహాత్మగాంధీ వారసులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరి స్థానంలో సోకాల్డ్ వారసత్వం పుట్టుకొచ్చింది. నకిలీ గాంధీలు దేశాన్ని పాలించారు. శతాధిక చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని వారసత్వ రాజకీయ పార్టీగా మార్చేశారు. కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికీ వల్లించే అరిగిపోయిన రికార్డులాంటి అబద్దం ఏమిటంటే.. గాంధీజీని చంపింది ఆరెస్సెస్ అని.. చరిత్ర తెలిసిన దేశ ప్రజలు ఎవరూ ఇప్పుడు ఈ అబద్దాన్ని నమ్మేందుకు సిద్దంగా లేరు.. ఓ మహాత్మా.. నీవు కోరుకున్నట్లు స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ రద్దు జరగలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా జరుగుతున్న అంతిమ ప్రయత్నాలకు అయినా నీ ఆశీస్సులు అందించు..

-క్రాంతిదేవ్ మిత్రా, హైదరాబాద్

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us