రైతులకు మేలు చేసే బడ్జెట్


ఈ బడ్జెట్‌ ని వ్యవసాయదారుల బడ్జెట్ అనవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లపై భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నగదు, సోలార్‌ పంపుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఆదేశం వంటి వాటిని ఈ బడ్జెట్లో జైట్లీ ప్రవేశపెట్టారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలైన మధ్యతరగతికి ఒక ప్రతిపాదన కొంత ఊరట ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీలను ప్రభుత్వం రెండు రూపాయల మేర తగ్గించింది. అన్‌బ్రాండెడ్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని లీటర్‌కు ప్రభుత్వం రూ 6.48 నుంచి రూ 4.48కి తగ్గించింది. బ్రాండెడ్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 7.66 నుంచి రూ 5.66కు తగ్గించింది. ఇక బ్రాండెడ్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 8.69కు తగ్గించింది.

2018-19లో వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నామనీ, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నామనీ చెప్పారు. మార్కెట్‌ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఖరీఫ్‌ పంటలకు ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తామని జైట్లీ తెలిపారు. ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు విస్తరిస్తామని తెలిపారు. మత్స్య, పశు సంవర్థక శాఖలకు రూ.10 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1290 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆహార శుద్ధి రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.1400 కోట్లను కేటాయించారు. 42 మెగా ఫుడ్‌ పార్కులను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్‌ క్లస్టర్ల కోసం రూ.500 కోట్లను కేటాయించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం