జీ శాట్ - 6ఎ తో తెగిన సంబంధాలు


భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించి, ప్రయోగించిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉప గ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు తెగిపోయాయి. రెండు రోజులకే.. ఇంకా తుది కక్ష్యలోకి చేరకముందే ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఉపగ్రహంలోని విద్యుత్‌ వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ చెప్పారు. ఉపగ్రహం తమ అధీనంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రాథమిక డేటా సూచిస్తున్నట్లు ఆయన వివరించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించారు. శుక్రవారం ఉదయం 9.22 గంటలకు ఈ ఉపగ్రహ కక్ష్యను తొలిసారిగా ఇస్రో పెంచింది. ఇందుకోసం జీశాట్‌-6ఏలోని లిక్విడ్‌ అపోగీ మోటార్‌ (ల్యామ్‌)ను కొద్దిసేపు మండించారు. ఈ కసరత్తు మొత్తం సాఫీగానే సాగిపోయింది. ఇదేరీతిలో రెండోసారి కక్ష్య పెంపు విన్యాసాన్ని శనివారం ఉదయం 10.51 గంటలకు నిర్వహించారు. అది కూడా విజయవంతంగానే సాగింది. ఆ తర్వాత నాలుగు నిమిషాల పాటు ఉపగ్రహం నుంచి డేటా అందింది. అనంతరం సంబంధాలు తెగిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్రో ఛైర్మన్‌గా శివన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాక సంస్థ చేపట్టిన తొలి ప్రయోగమిది. జీశాట్‌-6ఏతో సంబంధాలు తెగిపోయాక ఆయన సీనియర్‌ శాస్త్రవేత్తలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాధారణంగా ఏవైనా అవరోధాలు ఏర్పడితే ఉపగ్రహం ‘సురక్షిత మోడ్‌’లోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఆ వెంటనే మళ్లీ క్రియాశీలమవుతుందన్నారు. జీశాట్‌-6ఏ విషయంలో అలా జరగలేదని చెప్పారు.

ముఖ్యాంశాలు