బాబు చదరంగంలో పావులు వైకాపా, జనసేన


చంద్రబాబు నాయుడు నిఖార్సయిన, నిజమైన రాజకీయ నాయకుడు. తాను రాజకీయంగా ఏది కోరుకుంటున్నాడో దానిని నూరు శాతం ఎగ్జిక్యూట్ చేయగలిగిన నాయకుడు.. ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదు. ఈ విషయంలో మోదీ కూడా సరిపోరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనాన్ని, వర్గాలని, కులాలని, మతాలని మాత్రమే మిగతా వాళ్ళు ఓటుబ్యాంకులుగా చూడగలరు. కానీ చంద్రబాబు రెండాకులు ఎక్కువ చదివిన రాజకీయవేత్త... ఆయన మిగతా పార్టీలని, ఇతర నాయకుల్ని కూడా ఓటుబ్యాంకుగా వాడుకోగలిగిన సమర్థుడు.

తన అవసరం కోసం బిజెపితో తానే పొత్తు పెట్టుకొని.... మళ్ళీతన అవసరం కోసం తానే తెగతెంపులు చేసుకొని... ఆతర్వాత ప్రతి నిత్యం మోదీని, కేంద్రాన్ని తిడుతూ చెదిరిపోయిన పాత ఓటు బ్యాంకు ని మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.. ఏదో ఒక పార్టీ తో పొత్తు ఉంటే తప్ప గెలిచిన చరిత్ర లేని బాబు ఈసారి అవసరమైతే కాంగ్రెస్ తో పొత్తుకైనా రెడీ అయిపోవడం కూడా చాతుర్యమే! ఇది వేళాకోళం కాదు..నిజంగానే చెబుతున్నాను, బిజెపి అవసరార్థం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోగలదా? కాంగ్రెస్ బిజెపితో సీట్ల సర్దుబాటు చేసుకోగలదా? అవి చేయలేని పని బాబు చేయగలరు. తాను గెలవడం ఒక్కటే బాబుకి ప్రాతిపదిక. అందుకోసం ఎవరినైనా కలుపుకొంటారు.. ఎవరినయినా విసిరేస్తారు... అదే నిజమైన రాజకీయం. అందుకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనం.

తన రాజకీయ చదరంగంలో మిగతా పార్టీలను పావులుగా చేసి ఆడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలని అలాగే ఆ(వా)డుకుంటున్నారు. బిజెపితో వైరం అయినా, స్నేహం అయినా చంద్రబాబుకి ఆయన పార్టీకి పరిమితమైన విషయాలు. ఆ పార్టీవలన లబ్ది పొందినది బాబు మాత్రమే. అయితే విచిత్రంగా మిగిలిన రెండు పార్టీలని తన స్వభావానికి, అవసరానికి అనుగుణంగా మార్చగలగడమే చంద్రబాబు చాతుర్యానికి మచ్చుతునక. ఆయన బిజెపితో కలిసి ఉన్నంతకాలం మిగతా రెండు పార్టీలు కేంద్రంపై ఒక్క రాయి కూడా వేయకుండా ఆపారు బాబు. ఇప్పుడు తనతో బిజెపికి చెడిన తర్వాత తన పార్టీతో (తెదేపా) పాటు ఇటు రాష్ట్రంలోని వైఎస్సార్ సిపి, జనసేన... అటు దేశంలోని కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలను కూడా రోజూ బిజెపిపై రెచ్చగొట్టి ఎగదోస్తున్నారు. విచిత్రంగా అవన్నీకూడా బాబు ఆలోచన ప్రకారమే ఆడుతున్నాయి! రాష్ట్రంలోని జనసేన, వైకాపా పార్టీలకి కేంద్రంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? లేరు.. కానీ చంద్రబాబు పార్టీకి ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం అజెండాలో ఉంది. ఈ అజెండాకి అనుకూలంగా ఆయన వైకాపా, జనసేనల తోడ్పాటును పరోక్షంగా పొందగలుగుతున్నారు. తమకు జాతీయ స్థాయిలో ఏ పార్టీలతోనూ అనుబంధం, అవగాహ న లేకున్నా.. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో తమకు ఎటువంటి బాధ్యత, ప్రమేయం లేకపోయినా ఈరెండు పార్టీలు..తమకు తెలియకుండానే బాబుకి సహకరిస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ కి కూడా తోడ్పడుతున్నాయి. ఇదే అసలైన రాజకీయ విచిత్రం! బిజెపితో జగన్, పవన్ లకి స్నేహం, విరోధం రెండూ లేవు. వాటికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న వైరుధ్యమల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం, రైల్వే జోన్ విషయం మాత్రమే.ఇది ఆ రెండు పార్టీలకి మొదటినుంచీ ... అంటే గత నాలుగేళ్లనుంచీ ఉంది. కానీ తెదేపాకి ఈ రెండు అవసరాలు సుమారు గత ఏడాదినుంచే గుర్తుకొచ్చాయి. కారణం తనకి, బిజెపికి రాజకీయంగా చెడిపోవడమే! అంతకుముందు హోదా మాటెత్తితే అరెస్టు చేస్తామని ప్రతిపక్షాలను హెచ్చరించి..ఉద్యమాన్ని, డిమాండ్ ని అణిచేసిన చంద్రబాబు ఇప్పుడు అదే డిమాండ్ తాను ప్రతిరోజూ పెద్ద ఎత్తున వినిపిస్తూ... అవే ప్రతిపక్షాల చేత వంత పాడించుకుంటున్నారు!

రాష్ట్రానికి కేంద్రం అసలు డబ్బులివ్వడంలేదు అనేది చంద్రబాబు ఆరోపణ... చాలా ఇచ్చాము మీరు దుర్వినియోగం చేశారనేది బిజెపి ప్రత్యారోపణ. వాడిన డబ్బుకి సరైన బిల్లులు ఇవ్వలేదు కాబట్టే కొత్తగా నిధులు ఇవ్వడంలేదు అనేది కూడా పదేపదే బిజెపి చెబుతున్న మాట. అయితే మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇక్కడే లాజిక్ మిస్సవుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదనే మాటని బలపరుస్తూ తెదేపా నెత్తిన ఇవి పాలు పోస్తున్నాయి. నిజానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలు వేరు.. పోలవరం, రాజధాని నిర్మాణాలకు ఇచ్చే నిధుల విషయం వేరు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టేసి చంద్రబాబు కేంద్రాన్ని బాడ్ చేస్తుంటే అదే పాటని ప్రతిపక్షాలు కూడా పాడుతున్నాయి. తద్వారా చంద్రబాబుకి ఆయనకొరుకున్న సింపతీని జనంలో ఇవే తెచ్చిపెడుతున్నాయి. దీనికి బదులు... ఒకపక్క ప్రత్యేక హోదా ఆవిషయంలో కేంద్రాన్ని బలంగా డిమాండ్ చేస్తూనే... మరోపక్క రాజధాని, పోలవరం, విభజన చట్టం పరిధిలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులను ప్రతిపక్షాలు గుర్తించాలి. వాటిపై జనానికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వీటిపై ఉంది. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఈ మాత్రమైనా జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు ఒక్కడి గొప్పా కాదని.. కేంద్ర సాయాన్ని కూడా బాబు తన అవసరాల కోసం దారి మళ్లించారని జనం తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. కేంద్ర సాయం లేకపోయినా.. చంద్రబాబు తన నిబద్ధత, చాతుర్యం, తెలివితేటలతో ఈ అభివృద్ధి సాధిస్తున్నారని జనం నమ్ముతున్నారు. దీనివల్ల నష్టం బిజెపికి కాదు..ఇక్కడి వైకాపా, జనసేన పార్టీలకే! బాబు కోరుకుంటున్నది సింపతీ. అందుకోసమే ఆయన రోజూ మోదీని తిడుతున్నారు. అదే పని ఎవరు చేసినా ఆయనకు లాభమే. అందుకే అందరిచేతా మోదీని తిట్టిస్తూ ఉంటారు. ఎవరైనా తిట్టకపోతే.. అదుగో వాళ్లిద్దరూ కుమ్మక్కయి పోయారని ఆరోపించి ఇరుకున పెట్టి మరీ తిట్టిస్తారు. ఆ రకంగా తాను ఏర్పాటు చేయదలచిన బిజెపి వ్యతిరేక కూటమిలో తనకు వ్యతిరేకులైన వైకాపా, జనసేనల్ని కూడా కలిపేసిన మేధావి చంద్రబాబు. బిజెపిని తిట్టడంలో తనకు ఆ రెండు పార్టీలు ఎంతగా కలిసొస్తే తనకు అంత రాజకీయ లబ్ది. ఇదే చంద్రబాబు ఆంతర్యం! ఈ రహస్యం తెలియక ఆయన నాటకంలో తాము పాత్రధారులవడం ఇక్కడి ప్రతిపక్ష పార్టీల అమాయకత్వం!

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా చేతిలో అన్ని అధికారపత్రాలు ఉంటాయి. కేంద్రం ఏ పథకానికి, ఏ పద్దు కింద రాష్ట్రానికి ఎంత ఇచ్చిందో, ఇస్తున్నదో, ఇవ్వనున్నదో.. ఎన్ని కేంద్ర ప్రాజెక్టులు మంజూరయ్యాయో వైకాపా వారికి పూర్తిగా తెలుస్తుంది. కానీ ఈ విషయాల్ని వైకాపా చెప్పడంలేదు. ఇలా చెప్పడం వలన తాము, బిజెపి కుమ్మక్కయ్యామని జనం అనుకుంటారని భయపడి ఈ విషయాల్ని వైకాపా ప్రస్తావించడం లేదు. కానీ ఇలా నిజాలు మాట్లాడకుండా మౌనం వహించడం వలన పరోక్షంగా చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇస్తున్నట్లే అని ఆ ఆపార్టీ తెలుసుకోవడంలేదు. అంటే తమకు తెలియకుండానే వైకాపా వారు తెదేపాతో కుమ్మక్కయ్యా రన్నమాట. ఇది వైకాపా తప్పు కాదు..చంద్రబాబు చాతుర్యం ఇదంతా!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం