డ్రోన్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి!


ఫొటోలు, వీడియోలు, సెక్యురిటీ.. ఇలా అనేక అవసరాల నిమిత్తం డ్రోన్లను ఈమధ్య బాగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ప్రజాభద్రతకు, ప్రయివసీకి, దేశ భద్రతకు కూడా ప్రమాదం కలిగించే అవకాశాలు పెరగడంతో ఇకపై డ్రోన్ ల వినియోగానికి అనేక షరతులు వర్తించేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం డిసెంబరు 1 నుంచి ఎగిరే డ్రోన్లు, రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ (ఆర్‌పీఏఎస్‌) లను పూర్తిగా చట్టబద్ధం చేసింది. ఇందుకోసం డ్రోన్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ను ప్రారంభించింది. 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న డ్రోన్లు మినహా మిగతా డ్రోన్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రవేశపెట్టిన ‘డ్రోన్‌ రెగ్యులేషన్స్‌ 1.0’ పాలసీ ప్రకారం డ్రోన్లు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. 250గ్రాములు, అంతకంటే తక్కువ బరువున్న డ్రోన్లను నానో డ్రోన్లుగా వ్యవహరిస్తారు. వీటికి రిజిస్ట్రేషన్‌ అక్కరలేదు.. అయితే ఆపరేట్‌ చేయడానికి పోలీసులకుముందస్తు సమాచారం మాత్రం ఇవ్వాలి. ఎవరి ప్రయివసీకి భంగం కలగకూడదు. ఇంతకంటే ఎక్కువ బరువున్న అన్ని డ్రోన్లకు రిజిస్ట్రేషన్‌ అనివార్యం. రిజిస్ట్రేషన్‌ తర్వాత వాటికి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు (యూఐఎన్) ఇస్తారు. ‌ ‘డ్రోన్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైన ఈరోజు ఒక చారిత్రకమని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా వెల్లడించారు. రిజిస్టర్‌ చేసుకునేందుకు డ్రోన్ వినియోగదారులకు, ఆపరేటర్లకు 30రోజుల గడువు ఇచ్చామన్నారు. జనవరి 1 నుంచి రిజిస్టర్డ్ డ్రోన్లు ఆపరేట్‌ చేసుకోవచ్చునని తెలిపారు. డ్రోన్లను పగటి వేళ మాత్రమే ఉపయో గించాలని, కంటికి కనిపించే ఎత్తులోనే తిప్పాలని నిబంధన విధించారు. విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దులకు చేరువ ప్రాంతాలు, దిల్లీలోని విజయ్‌ చౌక్‌, రాష్ట్రాల్లోని సెక్రటేరి యట్‌ కాంప్లెక్స్‌లు, సైన్యానికి చెందిన అన్ని ప్రదేశాల్లో డ్రోన్ల వినియోగం నిషిద్ధం. ఎకో-సెన్సిటివ్‌ జోన్స్‌, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా డ్రోన్లను నిషేధించిన ఇతర స్థలాల్లో కూడా వాడకూడదు. మరో ముఖ్య నిబంధన ఏమిటంటే డ్రోన్లను కదులుతున్న ఏ వాహనం నుంచి, లేదా విమానాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేట్‌ చెయ్యరాదు. నమోదు, అనుమతి లేని డ్రోన్ల వాడకానికి ఇకపై చట్టప్రకారం శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ముఖ్యాంశాలు