కాశ్మీర్ లో భీకర కాల్పులు .. 12 మంది ఉగ్రవాదుల హతం


కశ్మీర్‌లో ఒకేసారి మూడుచోట్ల భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. 12 మంది ముష్కరులు హతమయ్యారు. ఈ కాల్పుల పోరులో ముగ్గురు జవాన్లు, నలుగురు పౌరులూ బలయ్యారు. దక్షిణ కశ్మీర్‌లో శనివారం రాత్రే ఈ భారీ ఎన్ కౌంటర్ మొదలైంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ ఇది కొనసాగింది. సైన్యం, కేంద్ర రిజర్వు పోలీసు దళం(సీఆర్‌పీఎఫ్‌), పోలీసుల తరఫున హుటాహుటిన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఎస్‌పీ వైద్‌ వివరాలు వెల్లడించారు. కశ్మీర్‌ లోయలో ఇటీవల కాలంలో చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో ఇదే భీకరమైనదని ఆయన చెప్పారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ (హెచ్‌ఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) లాంటి కరడుగట్టిన ముష్కర మూకలకు భారీ నష్టం కలిగించినట్లు తెలిపారు. అనంతనాగ్‌లోని దియాల్గమ్‌, షోపియాన్‌లోని కచ్చేదూర్‌, ద్రగడ్‌ ప్రాంతాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ద్రగడ్‌లోని ఎదురుకాల్పుల్లో ఏడుగురు, కచ్చేదూర్‌లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. దియాల్గమ్‌లో మరో ఉగ్రవాది మరణించాడు. మొత్తం 12 మందిలో 11 మంది స్థానికులేనని అధికారులు గుర్తించారు. ముగ్గురు జవాన్లూ కచ్చేదూర్‌లోని కాల్పుల్లోనే ప్రాణాలు విడిచారు. కాల్పుల్లో మరణించిన ఓ పౌరుడు ద్రగడ్‌ నివాసి. ఇతడి ఇంటిలోనే ముష్కరులు నక్కారు. బలగాల కాల్పుల్లో ముష్కరులతోపాటు ఇతడూ మరణించాడు. ఓ ముష్కరుణ్ని భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ విషయాన్ని వైద్‌ ప్రధానంగా ప్రస్తావించారు. ఒకడిని ప్రాణాలతో పట్టుకోవడంలో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) ఎంతో కృషిచేశారు అని తెలిపారు. ముష్కరుడి కుటుంబ సభ్యులను ఎస్‌ఎప్‌సీ ఘటన స్థలానికి పిలిపించారు. లొంగిపోవాలని ఒప్పించేందుకు 30 నిమిషాలపాటు అతడితో మాట్లాడించారు. అయితే కుటుంబ సభ్యుల మాటలను అతడు వినలేదు. మాట్లాడే సమయంలో అతణ్ని పట్టుకునేందుకు ఎస్‌ఎస్‌పీ ప్రయత్నించారు. అయితే అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. వేరే మార్గం లేక కాల్పులు జరిపి అతణ్ని మట్టుపెట్టారు. అదే సమయంలో పక్కనున్న మరో ముష్కరుణ్ని ప్రాణాలతో పట్టుకోగలిగారు’అని తెలిపారు. కాల్పులు జరుగుతున్న ప్రాంతాలకు పెద్దయెత్తున స్థానికులు, నిరసనకారులు చేరుకుని ఆందోళన వ్యక్తంచేశారు. రాళ్లురువ్వారు. వీరిని నియంత్రించేందుకు జరిపిన కాల్పుల్లోనే ముగ్గురు పౌరులు మరణించారు. కాల్పుల్లో పౌరులు మృతిచెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తంచేశారు. వీరమరణం పొందిన జవాన్లకు ఆమె నివాళులర్పించారు.

ముఖ్యాంశాలు