జీఎస్టీ సంపూర్ణంగా సక్సెస్ : ప్రధాని మోదీ


అన్ని రకాల వస్తువులపై ఒకే శ్లాబుతో పన్ను విధించడం అసాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. పాలకు, మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లకు ఒకే విధమైన పన్నులు ఎలా వేస్తామని అడిగారాయన. విపక్ష కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న రీతిలో అన్నింటిపై 18% చొప్పున ఏకీకృత పన్ను విధిస్తే ఆహారోత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి పోతాయని చెప్పారు. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భం గా ఒక మ్యాగజీన్‌కు ఇచ్చిన ముఖాముఖిలో, ఇంకా ట్విటర్లో ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీతో వృద్ధి, సరళత, పారదర్శకత సాధ్యమయ్యాయని అయన అన్నారు. 17 రకాల పన్నులు, 23 రకాల సెస్సుల్ని కలిపి జీఎస్టీ కిందికి తీసుకువచ్చాక ఏడాదిలోనే పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 70% మేర పెరిగింది. సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు (చెక్‌పోస్టులు) రద్దయ్యాయి. అక్కడ ఇప్పుడు బారులు తీరిన వాహనాలు కనిపించడం లేదు. ట్రక్కుల చోదకులకు ఎంతో సమయం ఆదా కావడంతో పాటు రవాణా రంగానికి ఊపు వచ్చింది. అది మన దేశ ఉత్పాదకతను పెంచుతోంది. జీఎస్టీ గానీ సంక్షిష్టంగా ఉంటే అసలు ఇది జరిగేదా? సేవా పన్ను, ఎక్సైజ్‌ సుంకం వంటి కేంద్ర పన్నుల్ని, వ్యాట్‌ వంటి రాష్ట్ర పన్నుల్ని ఒక్కటిగా చేసి, ‘ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌’ను అంతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పన్ను విధానాన్ని సరళతరం చేశాం. రాష్ట్రాలు, వ్యాపార వర్గాలు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలు తీసుకునే కొత్త వ్యవస్థ రూపొందించాం. అన్నింటికీ ఒకే శ్లాబు ఉండాలని చెప్పడం చాలా సులభమే. అలా చేయడం వల్ల ఆహార పదార్థాలు ఇప్పుడున్న సున్నా శాతం పన్నులో ఉండవు. ఒకే పన్ను శ్లాబు తీసుకువస్తామని కాంగ్రెస్‌ చెబుతోందంటే దానర్థం... సున్నా నుంచి 5% పన్ను ఉన్న ఆహార పదార్థాలను కూడా 18% పన్నులోకి చేరుస్తామనడమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 66 లక్షల మంది పరోక్ష పన్ను చెల్లింపుదారులు నమోదైతే జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఏడాదిలోనే 48 లక్షల మంది కొత్తగా నమోదయ్యారు. ఏడాది వ్యవధిలో 350 కోట్ల లావాదేవీలు జరిగాయి. 11 కోట్ల రిటర్న్స్‌ దాఖలయ్యాయి. జీఎస్టీ అత్యంత సంక్షిష్టంగా ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవా?’ అని మోదీ ప్రశ్నించారు. జీఎస్టీ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించినప్పుడు ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ లో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేటప్పుడు ఇబ్బందులు సహజమన్నారు. ‘అన్ని పన్నుల్నీ కలిపి ఒక్కటిగా చేసినప్పుడు దానిని సాధ్యమైనంత సరళంగా, సున్నితంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇబ్బందుల్ని గుర్తించడంతో పాటు వాటిని తక్షణం పరిష్కరిస్తూ వచ్చాం. సహకార సమాఖ్య తత్వానికి నిదర్శనంగా... రాష్ట్రాలతో కలిసి అడుగులు వేసే ఏకీభావాన్ని ప్రోది చేశాం. మునుపటి ప్రభుత్వాలు ఈ విషయంలో విఫలమయ్యాయి. గతంలో చాలా పన్నులు బయటకు కనిపించేవే కావు. జీఎస్టీ వచ్చాక మనం ఏది చూస్తామో దానినే చెల్లిస్తాం. బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి చాలా నిత్యావసరాలు సహా దాదాపు 400 వర్గాల వస్తువులపై పన్నులు తగ్గాయి. 150 రకాల వస్తువులపై పన్ను లేదు. చాలావాటిని 5% శ్లాబులో చేర్చాం. 95% వస్తువులు 18% కంటే తక్కువ పన్నులోనే ఉన్నాయి. రిటర్న్స్‌ నుంచి పన్ను వాపసు (రిఫండ్‌) వరకు అంతా ఆన్‌లైన్లో పారదర్శకంగా జరుగుతోంది’ అని ప్రధాని వివరించారు.

ముఖ్యాంశాలు