బాబు వ్యతిరేకత జగన్ కి కలిసొస్తుందా?


రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరిగితే... తెదేపాకి కలిసొచ్చే అవకాశం కాదనలేము. అధికారంపై అనంతమైన ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక అంశంపై ఆశ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.. అదే చంద్రబాబుపై పెరుగుతున్న వ్యతిరేకత. అయితే ఆమేరకు జగన్ పై సానుకూలత పెరుగుతున్నదా అంటే అవునని సమాధానం రావడంలేదు. ఇది వైకాపా శ్రేణులు నిశితంగా గమనించాల్సిన అంశం. ఆశ వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలు, హోమ్ గార్డులు... ఇలా ఒకొక్కరినీ లైన్ లో పెట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు .. రేపో మాపో నిరుద్యోగభృతి మొదలవుతుంది... పింఛన్ల పరంగా బాబుకి ఇప్పటికే మంచి పేరు ఉంది. చంద్రన్న కానుకలు, తోఫాలు ఇలాంటివన్నీ మైలేజి పెంచేవే. ఇసుక కుంభకోణం, రాజధాని, పోలవరం డ్రామాలు, నేతల అవినీతి, కేంద్రంతో అనవసర తగువు, ప్రత్యేకించి ఇటీవల బాబుకి మద్దతుగా పేట్రేగిపోతున్న కులశక్తులు (ఇది గతంలో లేదు), తెదేపా నేతలు చెబుతున్న అబద్ధాలు, ప్రజాధనం దుర్వినియోగాలు ఇవి తెదేపాకి సమస్యాత్మకమే. పాదయాత్రలో ప్రసంగాలతో విరుచుకు పడుతున్న జగన్ ప్రధానంగా అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నదీ అదే పని. రాష్ట్రంలో అవినీతి ఉందన్నది నిజమే అయినా జనానికి తమకు కలిగే లబ్ది ముందు అది పెద్ద విషయం కాదు కదా! పాదయాత్రలో నాడు బాబు చేసిన పనే అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జగన్ చేస్తున్నారు.. అదే వాగ్దానాల వరద పారించడం...! ఇదంతా చూస్తుంటే జగన్ ని ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎంచుకుంటారా అనే అనుమానం తలెత్తుతుంది. జగన్ బిజెపితో నేరుగా కలిసే అవకాశం లేదు. పవన్ వైసీపీతో కలుస్తారా? చూడాలి మరి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒంటరిగా వైసీపీ, జనసేన, బిజెపి ఎవరూ కూడా తెదేపాని అడ్డుకోలేరు...ఇది నా అంచనా. కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడం ఖాయంగా ఉంది. అయితే వారు కూడా తెదేపాని తిడుతూనే పవన్ కి మద్దతిస్తున్నారు. మరోపక్క బిజెపి రాష్ట్రంలో బలపడే ప్రయత్నాలు పెద్దఎత్తున చేసిందంటే అప్పుడు కూడా వైకాపా ఓట్లకు కన్నం పడుతుంది. ఇలా బాబు వ్యతిరేక ఓట్లను మూడు పార్టీలు (బిజెపి, జనసేన+వామపక్షాలు, వైకాపా) పంచుకుంటే సునాయాసంగా బాబు మళ్ళీ పవర్లోకి రావడం ఖాయం కావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు వ్యతిరేకత జగన్ కి కలిసొచ్చే దానికంటే జగన్ వ్యతిరేకతే బాబుకి ఎక్కువ కలిసివచ్చే పరిస్థితి ఉండవచ్చు.

ముఖ్యాంశాలు