చేతులు కలిపిన నాయుడు - రాహుల్


నాలుగు దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఇకపై గతం గతః అని అంత మర్చిపోయి వర్తమానం, భవిష్యత్తు కోసం కలిసి పని చేస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. భాజపాను ఓడించడమే లక్ష్యంగా తాము కలిసి పని చేస్తామన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థను భాజపా ఆక్రమిస్తోందని ఆరోపిం చారు. గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో ఆయన సమావేశమయ్యారు. 12-తుగ్లక్‌లేన్‌ లోని రాహుల్ నివాసంలో వారిద్దరూ గంట సేపు చర్చలు జరిపారు. అనంతరం రాహుల్‌.. చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్న మీరు కలిసి ఎలా పనిచేస్తారు? అని అడగ్గా గతంలోకి వెళ్ల కుండా వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఏకాభిప్రాయానికి వచ్చాం. మోడీ కి వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రజలకు ఒక దార్శనికత అందించాలని నిర్ణయించాం అన్నారు. నిరుద్యోగం, రఫేల్‌, రైతు సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ దేశాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ప్రకటించారు. దేశాన్ని రక్షించడానికి ఇద్దరం ఒక్కతాటిపైకి రావడం ప్రజాస్వా మికంగా తప్పని పరిస్థితి అని వారన్నారు. సీనియర్‌ నాయకుడిగా నాపైనా, ఓ ప్రధాన జాతీయ పార్టీ నేతగా రాహుల్‌గాంధీపైన దేశాన్ని రక్షించే బాధ్యత ఉంది. అందుకే ఇద్దరం కలిశాం. భాజపాను వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఉమ్మడి వేదిక తయారు చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎన్నడూ ఇలాంటి పరిపాలనకానీ, వ్యవస్థల విధ్వంసంకానీ చూడలేదు. ఏ వ్యవస్థనూ వదిలి పెట్టకుండా నాశనం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోడానికే కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అన్ని పార్టీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్తాం’ అని చంద్రబాబు అన్నారు. డీఎంకే నేత స్టాలిన్‌నూ త్వరలో కలుస్తానన్నారు. 2019 ఎన్నికలనాటికి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెడతారా? అని అడిగితే ఇద్దరూ సూటిగా చెప్పలేదు. మీ ఆసక్తి అభ్యర్థులపైన. మా ఆసక్తి దేశంపైన. మీరు మిగతా విషయాలన్నీ మనసులోంచి తుడిచిపెట్టి దేశం గురించి ఆలోచించాలి అని బాబు సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షమన్నది వాస్తవం. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మిగతా పార్టీలు కూడా అవసరం. అందుకే అందరూ కలిసి పనిచేయాలి... అన్నారాయన.

ముఖ్యాంశాలు