రూ.200 కోట్ల క్లబ్ లో ‘2.ఓ’

2.ఓ సినిమా వసూళ్ళలో అదరగొట్టింది. బాక్సాఫీసు వద్ద విజయకేతనం ఎగరవేసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.100 కోట్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయి కొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ తదితర హక్కుల ద్వారా సినిమా దాదాపు రూ.370 కోట్లు ఆర్జించింది. గతంలో రజనీ నటించిన ‘రోబో’, ‘కబాలి’ సినిమాలు కూడా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసాయి. అదే కోవలో ఇప్పుడు మూడో సినిమాగా ‘2.ఓ’ చేరింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూడు సినిమాల హీరో ఎవరైనా ఉన్నారంటే అది రజనీయే అని చెబుతున్నారు. ఒక్క చెన్నైలోనే ‘2.ఓ’ మూడు రోజుల్లో రూ.10 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన 2 . ఓ అక్కడ దాదాపు రూ.13 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రూ.63.25 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఉవాచ. రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగాయి. ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసం మాత్రమే కాదని, ఇంకా చాలా ప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయని గుర్తు చేసే చిత్రమే ‘2.ఓ’. మొబైల్ ఫోన్ టవర్ల రేడియేషన్ ప్రభావం వల్ల పక్షులు చనిపోతున్నాయనే అంశాన్ని ఇందులో చూపించారు. ప్రముఖ హిందీ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది.