మార్చి 18 న రష్యా అధ్యక్ష ఎన్నికలు


రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 18న జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పుతిన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన పావెల్‌ గ్రుడిన్‌, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ తరపున వ్లాదిమిర్‌ జిరినోవస్కీలు ఢీకొంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించింది. పుతిన్‌కు పోటీ ఇవ్వగల నేత ఆయన ఒక్కరే కాగా పాత కేసుల కారణంగా ఆయనపై వేటు వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి పుతిన్‌ తెర వెనుక దౌత్యమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఎన్నిక ఏకపక్షమే అవుతుందని అంచనాలు నెలకొన్నాయి. రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. అక్కడ ప్రధాని నామమాత్రం. అధ్యక్షుడి పదవీ కాలం ఆరేళ్లు. ప్రధానిని అధ్యక్షుడు నియమిస్తారు. కార్యనిర్వాహక అధికారాలు అన్నీ అధ్యక్షుని చేతిలోనే ఉంటాయి. మర్చి 18 ఎన్నికల్లో సగానికి పైగా ఓట్లు సాధిస్తే అధ్యక్షుడవుతారు. అలా రాకపోతే రెండో దఫా ఏప్రిల్‌ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహిస్తారు. పుతిన్‌కు తన సొంత పార్టీ యునైటెడ్‌ రష్యాతో పాటు, జస్ట్‌ రష్యా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. రాజ్యాంగం ప్రకారం ఏ నాయకుడు వరసగా రెండు సార్లు మించి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్‌ ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకునే ఆ తరవాత ప్రధాని అయ్యారు. 2012లో రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుని అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. అలా 2012లో మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే 2024 వరకు అధికారంలో కొనసాగుతారు. జోసెఫ్‌ స్టాలిన్‌ తరవాత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నేతగా చరిత్ర పుటల్లో ఆయన నిలిచిపోతారు. ఇటీవల వైదొలగిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే తర్వాత ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నదీ పుతినే. సోవియట్‌ విభజన తర్వాత బోరిస్‌ ఎల్సిన్‌ నుంచి పగ్గాలు అందుకున్న పుతిన్‌ దేశ రాజకీయాలపై పట్టు సాధించారు. పుతిన్‌ అంటేనే రష్యా, రష్యా అంటేనే పుతిన్‌ అన్న అభిప్రాయాన్ని ఇంట బయటా కల్పించారు. పుతిన్‌ పాలనపై ప్రజల అభిప్రాయాలూ ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో ఆయనకు ఎదురైతే లేదని విశ్లేషకుల అంచనా. దీటైన ప్రత్యర్థి లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం. దేశపు వృద్ధిరేటు నిరాశాజనకంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లాయి. నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. పత్రికాస్వేచ్ఛకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపులు కొనసాగుతున్నాయి... అయినప్పటికీ పుతిన్ రేసుగుర్రం కావడం... గెలుపు అవకాశాలు ఆయనకే ఎక్కువ ఉండడం విశేషం. అమెరికాను ఎదుర్కోవాలంటే, బలమైన నాయకుడు అవసరమన్న ఉద్దేశంతో మాత్రమే రష్యా ప్రజలు ఆయనను బలపరుస్తున్నారు. అమెరికాకు దీటుగా, అంతర్జాతీయంగా రష్యాను ప్రభావవంతమైన దేశంగా నిలబెట్టడంలో పుతిన్‌ పాత్రపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఉక్రెయిన్‌, సిరియా విషయాల్లో ఆయన వైఖరిని రష్యన్లు సమర్థిస్తున్నారు. 2014లో ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను చేజిక్కించుకోవడంలో తెగువ ప్రశంసలకు పాత్రమైంది. ప్రభుత్వ వ్యతిరేకత తనపై పడకుండా ఉండాలనే ఆలోచనతో ఆయన ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం