దిగజారిపోతున్న మీడియా ప్రమాణాలు !


ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లే వార్తలు ఎలాంటివైనా సరే .. నిస్సిగ్గుగా .. కనీస ఆధారాలు లేకపోయినా సరే ప్రచురించి, ప్రసారం చేయడం ద్వారా మీడియా తన విలువల్ని పూర్తిగా కోల్పోతున్నది. కేవలం కాసేపు టిఆర్పి వస్తే చాలని... ఎంత దిక్కుమాలిన వార్త అయినా సరే ప్రసారం చేసే స్థాయికి ఛానల్స్ దిగజారిపోవడం అత్యంత బాధాకర పరిణామం. ఒకనాటి ప్రపంచ సుందరి, ప్రస్తుతం ఒకరి భార్యగా జీవిస్తున్న మహిళ 1973 లో జన్మించింది.. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. ఆమెకు 1988 లో తాను ఐవిఎఫ్ పద్దతిలో పుట్టానని విశాఖకు చెందిన ఒకడు ప్రచారం చేస్తున్నాడు. 27 ఏళ్ల క్రితం త‌న‌ను తల్లి నుంచి దూరం చేశార‌ని ఇప్పుడు ఆమెను తిరిగి కలవాలనుకుంటున్నానని అతడు అన్నాడు. ఈ హంగామా మీడియా దృష్టిని తెగ ఆకర్షించేసింది. అయితే వాడు చెప్పిన డేట్ ప్రకారం ఆ మహిళ వయసు 15 సంవత్సరాలని కనీస స్పృహ కూడా మీడియాకి లేకుండా పోయింది. ఆ మహిళ తన తల్లి అనదగిన ఆధారాలేవీ త‌న వ‌ద్ద లేవ‌ని, త‌న బంధువులు నాశ‌నం చేశార‌ని కూడా అతడు చెప్పిన సరే మన మీడియాకి ఇదొక బ్రేకింగ్ వార్తే! గతంలో శ్రీదేవి తన పెళ్ళాం అని... ప్రియాంక గాంధీకి తాను భర్తనని ఒకడు ఇలాగ స్టేట్ మెంట్స్ ఇచ్చి హంగామా చేయడం. ఆనక జైల్లోకి పోవటం తెలిసిన విషయాలే. నిజాల్ని వార్తలుగా వేయడానికి ఎంత ధైర్యం అవసరమో.. అసత్యాలను ప్రచారం చేయకపోవడానికి అంతకు మించిన విచక్షణ అవసరం అనేది మీడియాకి ఎప్పటికి అర్థం అవుతుందో!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం