అరుణాచల్ ఉనికినే గుర్తించనంటున్న చైనా


చైనా ఇప్పుడు ఏకంగా తాము అసలు అరుణాచల్ ప్రదేశ్ ఉనికినే గుర్తించలేదంటూ వ్యాఖ్యానించి సంచలనం కలిగించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్జువాంగ్‌ ఈ వ్యాఖ్య చేయడం వివాదాస్పదంగా మారింది. సరిహద్దు వివాదం విషయంలో తమ వైఖరి సుస్పష్టమని, అది కొనసాగుతుందని చైనా చెప్పేసింది. ఇండియా చెబుతున్న అరుణాచల్ ప్రదేశ్ ఉనికిని అసలు తాము గుర్తించడం లేదని చైనా ప్రతినిధి దుందుడుకు వ్యాఖ్య చేసారు. అక్కడి ఉద్రిక్తతల గురించి మాత్రం నాకు తెలియదని గెంగ్జువాంగ్‌ ముక్తాయింపునిచ్చారు. భారత భూభాగంలోకి ఎందుకు చైనా సైనికులు చొచ్చుకెళ్లారు అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా నిర్లక్ష్య, ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు. తాము అరుణాచల్‌ప్రదేశ్‌కు గుర్తింపే ఇవ్వనప్పుడు తాము అడుగు మోపిన భూమి భారత్‌ది ఎలా అవుతుందని వితండవాదం చేసారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చి దొంగచాటుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా దురుసు వ్యాఖ్యలు డ్రాగన్ దేశపు పెడసరం ధోరణికి అద్దంపడుతున్నాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం