ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్


తక్షణ తలాక్‌ రద్దు బిల్లు ను రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డుకుంది. లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్‌ రాజ్యసభలో మాత్రం వ్యూహం మార్చింది. ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబట్టింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రె్‌స సహా విపక్షాలు బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేస్తూ సభను స్తంభింప చేశాయి. దీంతో గందరగోళం మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే మహారాష్ట్రలో అల్లర్లపై రగడ చోటుచేసుకుంది. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత డిప్యుటీ చైర్మన్‌ కురియన్‌ చర్చకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితుల నడుమే రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ‘లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయం ఆగలేదు. వరకట్నం ఇవ్వలేదన్న కారణంతో మొరాదాబాద్‌లో ఓ మహిళకు తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చడం అత్యవసరం’ అని తెలిపారు. ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. తమ పార్టీ బిల్లుకు వ్యతిరేకం కాదని, కానీ బిల్లులోని అంశాల పునఃపరిశీలనకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనేత ఆనంద్‌ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తృణమూల్‌ ఎంపీ డెరిక్‌ ఓ బ్రెయిన్‌ కూడా మరో తీర్మానం పెట్టారు. సెలక్ట్‌ కమిటీలో విపక్ష పార్టీల తరఫున సభ్యులతో కూడిన ఓ జాబితాను సభ ముందుంచారు. దీనిపై అధికారపక్షం అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ సభ్యుల తీర్మానాలు చెల్లవని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపలేమని స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలు గత ఏడాది ఆగస్టు 22న ట్రిపుల్‌ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఇద్దరు జడ్జీలు అసాధారణ అధికారాన్ని ఉపయోగించి ఆరు నెలలపాటు ట్రిపుల్‌ తలాక్‌పై నిషేధం విధించారు. ఆ నిషేధం గడువు ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ఈలోగా ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకురావాలని జైట్లీ వివరించారు. రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు కొంత మంతి ముస్లిం మహిళలు రాజ్యసభకు వచ్చారు. పాత ఢిల్లీ నుంచి వచ్చిన వారు పబ్లిక్‌ గ్యాలరీలో కూర్చొని సభాకార్యక్రమాలను వీక్షించారు. వారంతా ముస్లిం మహిళలు కాదని, కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బీజేపీ మోసగాళ్లంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తక్షణ తలాక్‌ రద్దు బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని కోరుతున్న పార్టీలకు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) కృతజ్ఞతలు తెలిపింది. ఆ పార్టీలన్నీ చివరి దాకా తమ వైఖరికి కట్టుబడి ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం