చంద్రబాబుపై పోరుకు మోదీ శంఖారావం


ఇప్పటివరకూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ కేంద్రప్రభుత్వం పైన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైన విరుచుకుపడుతున్నారు. అనుక్షణం ఆరోపణలతో చీకాకు పెడుతున్నారు. అయితే ఆయనపై బిజెపి ఎదురు దాడి చేసిందే లేదు. దీంతో బాబు ఆటకు ఎదురు లేదన్న రీతిలో పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిక సీన్ మారింది. బాబుపై ఎదురు దాడికి బిజెపి సన్నద్ధం అయింది. ఎపిలో ఏమి జరుగుతుందో తెలుసు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు! ఇవి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరం భాజపా బూత్‌ స్థాయి కార్యకర్తలతో దిల్లీ నుంచి మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌మార్పు కోరుతోంది.. అంటూ ఆయన మాట్లాడడం చూస్తే భాజపా వైఖరిలో స్పష్టమైన మార్పు సుస్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పటివరకూ బిజెపి రాష్ట్రనాయకుల్లో కొందరు మినహా మిగతావారు మెతక వైఖరినే కనబరిచారు. నేరుగా ఆరోపణలు చేసిన పరిస్థితి ఇంతవరకూ లేదు. అయితే తొలిసారి ఒక జాతీయ స్థాయి నేత..అందులోనూ ప్రధానమంత్రి స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారు అని కుండ బద్దలుకొట్టడం సంచలన విషయమే. ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మోడీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర సహాయాన్ని ప్రజలకు భాజపా కార్యకర్తలు తెలియజెప్పాలన్నారు. ఆనాడు విభజనపై మిగతా పార్టీలు రాజకీయం చేస్తుంటే ఏపీకి న్యాయం కోసం మాట్లాడింది భాజపా మాత్రమే అని గుర్తు చేసారు. కాగా గత నాలుగున్నరేళ్లలో జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇవ్వలేదని చెప్పారు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఎందుకు ఏర్పాటు చేయలేదో తెదేపా, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.

ముఖ్యాంశాలు