బంద్ హింసాత్మకం ...యుద్దభూమిగా మారిన కేరళ

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సంప్రదాయానికి విరుద్ధంగా 50ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు దర్శించుకోవడం తీవ్ర ఆందోళనలకు కారణమైంది. మహిళల ఆలయ ప్రవేశ ఘటనతో గురువారం రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, ఒక భాజపా కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనలకు సంబంధించి 266 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందుజాగ్రత్తగా 334 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. బంద్, అల్లర్ల ప్రభావం కేరళ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు పై కూడా పడింది. కేరళలో కర్ణాటక రవాణా శాఖ బస్సులపై దాడి చేశారు. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖకు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. తమిళనాడులో హిందూ సంస్థల కార్యకర్తలు శబరిమల ఆలయ సంప్రదాయ ధిక్కరణకు నిరసనగా కోయంబత్తూర్‌లోని రైల్వే స్టేషన్లో రైల్ రోకోకి ప్రయత్నించారు. ఈ సందర్భంగా 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాజపా సానుభూతిపరులైన 15 మంది న్యాయవాదులు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ కేరళకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూడా ఆందోళన జరిగింది. ఇక్కడ పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కన్నూర్ జిల్లాలోని తలస్సెరీ ప్రాంతంలోని ఓ కార్యాలయంలో ఆందోళనకారులు బాంబులు విసిరారు. కానీ, అదృష్టవశాత్తూ అవి పేలకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. నీదుమంగడు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై క్రూడ్ బాంబును విసిరారు. పాలక్కడ్ ప్రాంతంలో ఆందోళనకారులు రెచ్చిపోగా గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. బంద్ కారణంగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు దాదాపు రూ.3.50కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాదాపు 100 బస్సులు ధ్వంసమయ్యాయి. బంద్ హింసాత్మకంగా మారడంతో యూడీఎఫ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది. కేరళలో నెలకొన్న పరిస్థితులపై వెంటనే నివేదిక అందజేయాల్సిందిగా కేరళ గవర్నర్ సదాశివం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ను కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టం వివరాలను అందజేయాలన్నారు. కేరళలో విధినిర్వహణలో ఉన్న విలేకర్లపైనా దాడులు జరిగాయి.