భాగవతం భగవత్ స్వరూపమే - బ్రహ్మశ్రీ సామవేదం


శ్రీమద్భాగవతం అద్భుత మహిమాన్వితమని.. అది సాక్షాత్ భగవత్ స్వరూపమని ప్రవచనవిరించి , సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని విరించి వానప్రస్థాశ్రమ ప్రాంగణంలో శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞాన్ని ఆయన ప్రారంభించారు. 42 రోజుల పాటు ఈ బాగవత ప్రవచనామృత ధార భక్తజగతిపై వర్షించనుంది. తొలి రోజు ప్రవచనంలో భాగంగా భాగవత మాహాత్మ్యాన్ని సామవేదం వారు స్పృశించారు. భాగవత ప్రవచనం పాండిత్య ప్రదర్శన కాదని ఆయన చెప్పారు. ఇది భక్తి ధాతువు చేత జ్ఞానవైరాగ్య హేతువుగా సాగే గొప్ప యజ్ఞమన్నారు. భగవంతుడు అన్నీ ఇస్తాడు గానీ.. భక్తి మాత్రం ఇవ్వడని.. అది స్వీయ సముపార్జితంగా రావాల్సిందేనని స్పష్టం చేసారు. కానీ అట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని ఉంటాడని.. సాక్షాత్తు ముక్తి ఈ భక్తికి దాసురాలిగా చరిస్తుందని సప్రమాణంగా సూత్రీకరించారు. భాగవత స్వరూప స్వభావ ప్రభావాలు మూడింటినీ భాగవత మాహాత్మ్యం వెల్లడిస్తుందని చెబుతూ ఆ విశేషాలను విశదం చేసారు. ద్వాపర యుగాంతంలో అవతార పరిసమాప్తి చేసిన శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తరూపంలో మాత్రమే అదృశ్యుడయ్యాడని... వాస్తవానికి ఆయన తన సమస్త శక్తినీ భాగవత గాథలో నిక్షిప్తం చేసాడని తెలిపారు. భగవంతుడు, భాగవతం ఏమాత్రం అభేద వస్తువులు కావన్నారు. భాగవత శ్రవణం ద్వారా శబ్దరూపంలో భగవత్ సాక్షాత్కారం భక్తుల అనుభూతికి వస్తుందని ప్రవచించారు. భక్తికి అత్యవసరమైన శ్రద్ధను ఈ శ్రవణం కల్పిస్తుందన్నారు. గాధల రూపంలో భక్తుల చెవుల ద్వారా ప్రవేశించే భగవానుడు వారి హృదయాల్లో స్థిరాసీనుడవుతాడని చెప్పారు. కలియుగంలో మానవుని తరింపజేసే సరళ తరుణోపాయంగా ఆయన భాగవత పారాయణ, ప్రవచన, శ్రవణాదులను సశాస్త్రీయంగా ప్రతిపాదించారు. ఘోరమైన కలియుగంలో మానవులను ఉద్ధరించే తరుణోపాయం గురించి శౌనకాది ఋషులు సూత మహర్షిని పరిప్రశ్న వేసే సన్నివేశంతో భాగవత మాహాత్మ్య వివరణను బ్రహ్మశ్రీ సామవేదం ప్రారంభించారు. కలి మాయ నుంచి దాటించేది, కాల సర్పం కాటునుంచి కాపాడేది... భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించేది... కృష్ణ భక్తిని వృద్ధి చేసేది.. అన్నిటికంటే గొప్పగా తరింపజేసేది.. ఇలా అనేక పరమ ప్రయోజనాలను కల్పించే ఒకే ఒక్క సాధనంగా భాగవత మాహాత్మ్యాన్ని సూతుడు వివరించాడని తెలిపారు. భాగవత ప్రమాణం గురించిన విషయాలు పద్మ పురాణంలో, స్కాంద పురాణంలో కనిపిస్తాయని సామవేదం వెల్లడించారు. ఈ మహత్కథ ను తొలుత శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునకు అర్థం అయ్యే స్థాయిలో నాలుగు శ్లోకాల రూపంలో చెప్పగా.. దానిని బ్రహ్మ మరి కాస్త విశదంగా నారదునకు ఉపదేశిస్తే... అదే గాధను నారదుడు వ్యాసునకు చెప్పాడు.. ఆ మహాగాధనే వ్యాసమహర్షి 18 వేల శ్లోకాలతో సవిస్తరంగా కలియుగోద్ధరణ కోసం భాగవత మహాకథగా అనుగ్రహించాడు.. దానిని వ్యాసుని ద్వారా గ్రహించిన సుక మహర్షి ఆ గాధను ఏడురోజుల పాటు ఏకధాటిగా పరీక్షిత్ మహారాజుకు వినిపించాడని చెబుతూ అదే భాగవత సప్తాహంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. భాగవతం ఎంత విలువైనదో.. అమృతం కంటే కూడా ఎంత గొప్పదో చెబుతూ ఒక గాధను సామవేదం వారు ప్రస్తావన చేసారు. పరీక్షిన్మహారాజు ఏడురోజుల్లో పాముకాటు కారణంగా చనిపోతానని తెలిసిన తర్వాత ఆత్మోద్ధరణ కోసం సంకల్పించాడు. అయన ప్రాయోపవేశ దీక్షను సార్థకం చేసేందుకు సుక మహర్షి భాగవత ప్రవచనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు... అయితే అపుడు దేవతలు వారి వద్దకు వెళ్లి మరణాన్ని తప్పించుకోవడానికే గదా మహారాజు ఈ పని చేస్తున్నది.. అందుచేత మేము ఆయనకు అమృతం ఇస్తాం.. ప్రతిగా నువ్వు మాకు భాగవతం చెప్పమని మహర్షితో ప్రతిపాదన చేసారు. భాగవతాన్ని అమృతంతో కొలిచినందుకు మహర్షి ఆగ్రహించగా.. తనకు అమృతం వద్దని.. భాగవత కథామృతమే కావాలని రాజు చెప్పాడని ఆ గాథలో వివరించారు. ముక్తి సాధకమైన భాగవతమే నిజమైన అమృతం అని.. అది శాశ్వతానందదాయకమని ఈ గాధ ద్వారా స్పష్టం చేసారు. అమృతం గాజు పెంకు అయితే భాగవతం మణి వంటిదని ఈ సందర్భంగా ఋషి వచనాన్ని ఉటంకించారు. భాగవత శ్రవణం ఒకరోజో, ఏడు రోజులో , 21 రోజులో పరిమిత దీక్షగా చేయాల్సినది కాదని.. ఆజన్మాంతం చేయవలసిన పని అని చెప్పారు. పరీక్షిత్తు ఏడు అహోరాత్రాలు భాగవత శ్రవణం చేశాడన్నారు. ఆయన ఆయుర్దాయం అంతే ఉన్నది కనుక .. అన్ని రోజులే చేసాడు తప్ప అది పరిమితి, అవధి కాదని.. అంచేత ప్రతి మావుడూ ఆయుష్షు ఉన్నంతకాలం భాగవతామృతాన్ని ఆస్వాదించాలని సూచించారు. బ్రహ్మశ్రీ సామవేదం కథాక్రమంలో భాగంగా తొలిరోజు ప్రవచనంలో వివిధ గాధలను జనరంజకంగా వివరించారు. యమునా తీరాన బృందావనంలో భక్తిమాత విషాదాన్ని, ఆమె పుత్రులైన జ్ఞానవైరాగ్యాల దురవస్థను గాంచిన నారద మహర్షి వేదనాంతరంగుడై ఆమెను ఊరడిస్తాడు. నాలుగు వేదాలూ వారికి వినిపించినా కూడా కలి ప్రభావం ముందు అవి నిష్ఫలమవుతాయి. అప్పుడు నారదుడు తరుణోపాయంతో వస్తానని భక్తి మాతకు మాట ఇచ్చి బదరీక్షేత్రానికి వస్తాడు. అక్కడ సనక సనందనాదులిచ్చిన సలహా మేరకు ఆమెతో భాగవత సప్తాహం చేయించడంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలకు పూర్వపు జవసత్వాలు వస్తాయి. ఇది బృందావనంలో జరిగిన ఘటన కనుక.. ఇప్పటికీ బృందావనంలో మట్టి ని తాకినా భక్తి కలుగుతుందనే విశ్వాసం ఉందని.. అది నిస్సందేహం అని చెప్పారు. మరో కథగా తుంగభద్రా తీర వాసి అయిన ఆత్మదేవుని కథను ప్రవచనకర్త అద్భుతరీతిలో వివరించి సభాసదులను ముగ్ధులను గావించారు. అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక రహస్యాలను అలవోకగా తేటతెల్లం గావిస్తూ.. పామర పండితులిరువురినీ అలరిస్తూ సామవేదం వారి ప్రసంగ ఝరి గోదావరి ప్రవాహంలా సాగిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరై ప్రవచనం పూర్తయ్యేవరకూ మంత్ర ముగ్ధుల వలే ఆలకిస్తూ ఉండిపోయారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కృష్ణ నామ స్మరణతో పులకించారు. సర్వశ్రీ టివి నారాయణరావు, గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, కామర్సు ప్రసాద్, దినవహి హనుమంతరావు తదితరులు ఉన్నారు.