నిష్కపట ధర్మాన్ని అనుగ్రహించే భాగవతం - బ్రహ్మశ్రీ సామవేదం


(రెండవరోజు ప్రవచనం) శ్రీమద్భాగవతం సాధకునికి ఏమి ఇస్తుందంటే.. నిష్కపట ధర్మాన్ని అనుగ్రహిస్తుందని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. విరించి వానప్రస్థాశ్రమ ప్రాంగణంలో చేపట్టిన భాగవత ప్రవచన మహా యజ్ఞంలో భాగంగా రెండవరోజైన శనివారం రాత్రి ఆయన భాగవతములోని మొదటి రెండు శ్లోకాలను గురించి సమగ్ర వ్యాఖ్యానం గావించి సభాసదులను సంభ్రమ పరిచారు. శ్రీమద్భాగవతానికి పరమహంస సంహిత, మోక్ష సంహిత అనే పేర్లు ఉన్నాయిఆయన తెలిపారు. ఇది సమస్త వేదాల సారం అన్నారు. వివిధ కథలతో నిండిన శ్రీమద్భాగవతం ప్రారంభ శ్లోకం అత్యంత గంభీరం.. మహా చిక్కనైనది అని చెబుతూ.. ఇది భాగవత మహా వృక్షానికి విత్తనం లాంటిదని భక్తులు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఉపనిషత్తులతో పరిచయం లేకపోతే ఈ శ్లోకం అర్థం తెలుసుకోజాలరని చెప్పారు. పంచభూతాల్లోని భూమి, జలము, తేజస్సు అనే కనిపించే మూడింటిలో ప్రకటితమయ్యే పరమాత్మను ఈ తొలి శ్లోకం ప్రతిపాదించినదని వెల్లడించారు. ఇది బృహదారణ్యకోపనిషత్తులో కనిపిస్తుందని తెలిపారు. "మనం భాగవతం ఎందుకు వింటామంటే తరించడం కోసం.. తరించాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి.. అది జరగాలంటే అసలు భగవంతుడు ఎవరో మనకి తెలియాలి. అదే ఈ శ్లోకం చెబుతున్న సత్యం" అన్నారు. ఇంద్రియ గోచరంగా ఉన్న, పంచ భూతాత్మికమైన విశ్వమును ఎవరైతే సృష్టించి, పోషించి, లయం చేస్తారో అతడిని మాత్రమే పరమాత్మ అని భాగవతం లోని ఈ ప్రారంభ శ్లోకం చెబుతున్నాడని వక్కాణించారు. సర్వ వ్యాపకుడైన ఆ భగవానుడు ఈ విశ్వానికి లోపల, ఆవల కూడా ఉన్నాడని భగ్గవట ప్రమాణంగా పేర్కొన్నారు. స్వప్రకాశకుడు, సర్వ జ్ఞానసంపన్నుడుగా పరమాత్మను అభివర్ణించారు. జగద్గురువైన బ్రహ్మకు సైతం ఈ భగవానుడు గురువు అని, బ్రహ్మదేవునికి వేదాన్ని సంకల్పమాత్రం చేత భిక్షగా అనుగ్రహించినవాడని.. అంతేకాక ఎవరి చేతనూ వర్ణించనలవి కాని వాడని స్పష్టం చేసారు. మహా మహా పండితులు కూడా తమ జ్ఞానం చేత ఆ పరమాత్మను తమ తమ కోణాలనుంచి వర్ణించగలరు తప్ప.. పూర్తిగా ఇడిగో ఈయనే అని చూప సమర్థుకు కారని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు. అయినా అట్టి పండితులు తరిస్తారని.. ఎందుకంటే ఇంద్రియ మోహాలు వీడి సర్వ జగన్మోహనుడైన పరమాత్మ వర్ణనలో వారు నిమగ్నమవడమే ఇందుకు కారణమని సూత్రీకరించారు. మానవుడు స్వీకరించే ఏ ఆహారమైనా ఈ మూడు విధాలైన భూతాలనుంచి ఉత్పన్నం అవుతాయని.. నూనె రూపంలో తీసుకున్నవాటిలో అగ్ని.. అన్నంలో మట్టి ఉంటాయని విశదపరిచారు. అగ్ని వాక్కుగా, జలం ప్రాణంగా, మట్టి మనసుగా శరీరంలో తమ పాత్రను పోషిస్తాయన్నారు. అయితే భగవంతుని శక్తి చేత ప్రకాశించబడుతున్న ఈ దేహం.. లేదా జగద్దేహం రెండూ కూడా తామే సత్యం అన్నంతగా ఆకర్షిస్తాయన్నారు. ఎడారిలో నీరులా తేజస్సే కనిపిస్తుందని, అయితే నీరు లేకున్నా కనిపిస్తున్నది కనుక అది సత్యమేనని శ్రీధర భాష్యాన్ని ప్రస్తావిస్తూ తెలిపారు. అయితే అక్కడ నీరు లేదు కాబట్టి అది అసత్యమే అన్నారు. అదే జగన్మిథ్య భావన అని ఆయన వివరించారు. పరమాత్మనిత్య సత్యం కావున ఆయన యందు గల జగత్తు అసత్యం అయినా కూడా సత్యమే అన్నట్టుగా మురిపిస్తున్నదన్నారు. పరమాత్మ ఎంతటి నిజమో లోకం కూడా అంతే నిజమైనట్టయితే మనం ప్రత్యేకించి ముక్తి కోసం వెదకడం ఎందుకని ప్రశ్నిస్తూ జగత్తు సత్యం కాదని తేల్చి చెప్పారు. పరమాత్మ నిత్య శాస్వతుడిని, జగత్తు అసత్తు అని స్పష్టం చేసారు. ఆ విధంగా మన దృష్టి జగద్వికారానికి లోనవుతున్నదని, అయితే జగత్తంతా పరమాత్మ వ్యాపనంతోనే ప్రకాశిస్తున్నది కనుక దానికి ఆ ప్రశస్తి చేకూరించని ప్రవచించారు. ఇనుపగుండును ఎర్రగా కాలిస్తే ఎర్రని గుండు కనిపిస్తుంది.. కానీ మనకి ఆ రెండూ వేరు వేరని తెలుసు. అలాగే భగవంతుడిని, జగత్తుని వివేకంతో వేరువేరుగా గ్రహించాలన్నారు. అట్టి విచక్షణా జ్ఞానాన్ని మనకు కల్పించేదే భాగవతం అన్నారు. ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు కానీ మానవ మనో వికారాలు ఆయనకి అంటవని తెలిపారు. ఆయన ఉనికిని తెలుసుకోనంత వరకూ ఆ భగవంతుని గొప్పతనం మనిషికీ అంటదన్నారు. దేవుని లక్షణాలు సత్ లేదా చిత్ అంటూ ఉనికి, ప్రకాశం (చైతన్యం) వీటికి అర్థాలన్నారు. ఇంద్రియాలకు అతీతమైన పరమాత్మను ఆ ఇంద్రియాలు గుర్తించలేకున్నా.. ఆ ఇంద్రియాలు ఆయన వల్లనే పని చేస్తున్నాయని వెల్లడించారు. సర్వ వ్యాపకుడైన వాసుదేవుడిని ప్రత్యక్షం చేయించేదే భాగవతం అని సిద్ధాంతీకరించారు. భాగవతంలో జగద్వర్ణన గురించి విశేషంగా ప్రస్తావించిన సామవేదం వారు, భగవంతుడి గురించి చెబుతూ జగత్తుని ఎందుకు వర్ణించారనే ప్రశ్నఆసక్తికరమన్నారు. జగత్తు ద్వారా జగదీశ్వరుడి చెంతకు మనలను చేర్చడమే ఇందలి విశేషం అన్నారు. ఇక భాగవత గ్రంథంలోని రెండో శ్లోకంలో భాగవత స్వరూపాన్నివ్యాసుడు చెప్పాడన్నారు. భాగవతం నిష్కపటమైన ధర్మాన్ని బోధిస్తున్నదని ఈ రెండో శ్లోకం చెబుతున్నదన్నారు. ఫలాపేక్షతో పాటించే ధర్మం కపట ధర్మమని, ఫలాపేక్ష రహితంగా చేసే ధర్మాచరణ నిష్కపట ధర్మమని సూత్రీకరించారు. అట్టి ధర్మాన్ని ప్రతిపాదిస్తున్న విశిష్ట గ్రంథం శ్రీమద్భాగవతామని సంస్తుతించారు. నిష్కపటంగా, నిస్వార్థంగా దైవాన్ని ప్రేమించే వాడు కోటికి ఒక్కడు కూడా ఉండరని, అట్టి వారిని సృజించడానికే భాగవతం ఆవిర్భవించిందని ప్రవచించారు. కర్మలు చేస్తూనే నిష్కపట కర్మ ఆచరించాలని భాగవత వాక్కుగా తెలిపారు. కర్మల్లో చరిస్తూనే జ్ఞాన వైరాగ్యాలు కోరుకునే వాడికి ఈ మార్గం విధాయకం అన్నారు. ధర్మ బద్ధమైన కర్మలు చేయి, అది భగవానుడే చేయిస్తున్నాడని గ్రహించు. దాని ఫలితాన్ని ఆశించకు... అని మార్గోపదేశం చేస్తూ ఇదే సర్వోత్కృష్ట ధర్మం అని, అదే భాగవత మార్గమని అన్నారు. .

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం