వేదాంత దర్శనమే పరమాత్మ అవతార వైభవం


(ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మూడవరోజు ప్రవచనం) భగవంతుని అవతారాలలో సమగ్ర తత్వాన్ని దర్శించవచ్చని, ఆయన ప్రతి లీలా, ప్రతి తత్వం ఉపనిషద్ అంతరార్థాలను ప్రబోధిస్తాయని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. రాజమహేంద్రవరంలోని విరించి వానప్రస్థ ఆశ్రమంలో జరుగుతున్న శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా మూడవరోజైన ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఉపనిషత్తుల సమస్తాన్ని పిండితే వచ్చే సారమే భగవంతుడని ప్రతిపాదన చేసారు. భగవంతుని సద్భక్తుల నడతను, భగవంతుని లీలలను భాగవతం చెబుతుందన్నారు. భగవత్ సంబంధమైన వ్యక్తుల జీవన విధానాన్ని తెలియజెప్పేది భాగవత ధర్మమని, అది తెలుసుకొని అటువంటి ధర్మాన్ని అలవరచుకోవడమే భాగవత శ్రవణానికి గల నిజమైన సార్థకత అని స్పష్టం చేసారు. పురుషార్థాలలోని అర్థాన్ని ధర్మం కోసం పొందుతూ.. కామాన్ని జీవ యాత్ర కోసం మాత్రమే ఆశ్రయించాలన్నారు. త్రిగుణాలు భగవంతుని వలననే చైతన్యం పొందుతున్నాయని.. అందుచేత అవి తమ మాయను ఆయనపై ఎంతమాత్రమూ చూపజాలవని పేర్కొన్నారు. అయితే మాయా బద్ధులమైన మన దృష్టికి మాత్రం తాను కూడా మాయకు లోబడినట్టుగా కనిపిస్తాడన్నారు. భగవంతుని లీలలు విభిన్న కాలాల్లో జరిగినవని.. కానీ మన స్మరణ మాత్రం చేత అవి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయని బ్రహ్మశ్రీ సామవేదం ప్రతిపాదించారు. దీనివలన ఆనాడు ఆ లీలలు గావించిన దుష్టశిక్షణ మరల మరలా జరిగి మన హృదయాల్లో శిష్టత్వం నెలకొంటున్నదని తెలిపారు. అట్టి భగవల్లీలానుసంధానమే భాగవతం అని తెలుసుకోవాలన్నారు. దీనివలన హృదయం శుద్ధం అవుతుందని చెప్పారు. భగవంతుని లీలల ను వినడం, స్మరించడం, వాటిని కీర్తించడం ద్వారా మానవుడు తరిస్తాడన్నది భాగవత రహస్యమన్నారు. "సత్యం పరం ధీమహి" అనే భాగవత శ్లోకాన్ని ఉటంకిస్తూ ఇక్కడ సత్యమే ఉపాసనార్హమని అదే భగవంతుని రూపమని సూత్రీకరించారు. వేదప్రమాణంగా ఉపాసనర్హత కలిగిన ఏ దేవతనైనా ఇక్కడ ప్రతిపాదించుకొని ఉపాసించవచ్చని చెప్పారు. శ్రీమద్భగవద్గీత లో పేర్కొన్న వాసుదేవ నామం అత్యంత అర్థవంతమని.. నిజానికి ఇది గీతలో జరిగిన మహా మంత్ర ఆవిష్కారమని పేర్కొన్నారు. సర్వ వ్యాపకునిగా ఉంది సర్వాన్నీ ప్రకాశింపజేసేవాడనేది వాసుదేవ అనే మాటకు అర్థంగా వివరించారు. భగవంతుని లీలావతారాలు అన్నిటికీ ఈ అర్థం వర్తిస్తుందని.. విశేషంగా వాసుదేవ పుత్రుడు కనుక శ్రీ కృష్ణుని యెడల కూడా సార్థకమై నిలుస్తుందని అన్నారు. "లీలావతారానురతౌ" శ్లోకాన్ని వివరిస్తూ భగవానుడు విశుద్ధ సత్వ గుణంలో లీలావతారాలను ధరిస్తాడని తెలియజేసారు. శుద్ధ సత్వ గుణంలో త్రిగగుణాతీతమైన బ్రహ్మము అద్భుత నామాన్ని ధరించి, అద్భుత రూపం దాల్చి, అద్భుతాలను ఆచరిస్తుందని నిర్వహించారు. అట్టి లీలావతారాన్ని భక్తితో ఆశ్రయించడం ద్వారా మానవులు తమో, రజో గుణాలను వదిలించుకొని సత్వ గుణప్రధానులు కావాలన్నారు. సత్వం ద్వారా మాత్రమే త్రిగుణాతీత స్థితికి వెళ్లడం సాధ్యమన్నారు. సృష్టి ఆది నుంచి భగవంతుని నామరూపాలు చెప్పగలం కానీ అంతకు ముందు అవ్యక్తమని.. అయితే భాగవతం అట్టి అవ్యక్త భగవత్ తత్వాన్ని విశదం చేసిన విధానాన్ని అయన వివరించారు. భాగవతాన్ని మధించిన కొందరు మహాభక్తులు అందలి విశేషాలను బ్రహ్మసూత్రాలతో అన్వయించిన సందర్భాలను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సభారంజకంగా వివరిస్తుంటే కరతాళ ధ్వనులు మార్మోగాయి. అవ్యక్తమైన భగవంతుని షోడశ కళారూపునిగా చెప్పారన్నారు. పరమాత్మను వేదం పురుష శబ్దంతో సంబోధించిందన్నారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిపి పది, పంచభూతాలు ఐదు, ఇక మిగిలినది ప్రపంచం... ఇవి పదహారు కాగా వీటిలో ఇమిడి, వీటి బయటా ఉన్నవాడే ఆ పురుషుడని అందుకే ఆయనను షోడశ కళారూపుడని భాగవతంలో చెప్పారని ప్రవచించారు. ఇలా అర్థం చేసుకొని కనుగొనడమే ఇంద్రియాలకు అతీతంగా చేసే భగవద్దర్శనమన్నారు. తదుపరి అవ్యక్త అవతారంగా.. కారణ జలాలలో యోగనిద్రానంతరంగుడైన శేషశయనమూర్తిని ప్రతిపాదించారు. విశ్వం వికసిస్తున్న పద్మం అయితే దానికి కేంద్రంగా ఉన్నవాడు ఈ పద్మనాభుడన్నారు. ఆ నాభి కమలం నుంచి రజోగుణ నియామకుడైన బ్రహ్మ జనించాడని... ఆ తదుపరి జగత్తు విస్తరించగా అందులో కూడా భగవానుడు వ్యక్తం అయ్యాడని వివరించారు. సమస్త విశ్వం భగవానుడి అవయవసంస్థానంగా అమరిందన్నారు. ఇదే నిజమైన విశ్వరూపమని.. సృష్టిలో హిందూ ధర్మంలో తప్ప మరే ధర్మంలోనూ ఇంతటి విస్తృతమైన భావన లేదని స్పష్టం చేసారు. భాగవతం ప్రకారం అవతారాల లెక్కలో ఇదే మొదటి వ్యక్త అవతారమన్నారు. పురుష సూక్తాన్ని మరొక ప్రమాణంగా ఇక్కడ ఉదహరించారు. విశ్వం అంతా వ్యాపించినా ఆ విశ్వా వికారాలు మాత్రం పరమాత్మకు అంటబోవన్నారు. సమస్త బ్రహ్మాండాలను తనయందు నిలుపుకొని నిర్వహించగల సర్వ సమర్థునిగా ఈ విరాట్రూప పరమాత్మను గుర్తించిన వారు ధన్యులన్నారు. ఈ విశ్వరూప స్మరణ వలన మన నిత్య కృత్యాల్లో సంక్రమించే పాపాలు నశిస్తాయన్నది ఫలశ్రుతిగా చెప్పబడిందన్నారు. వేలాది పదాలు, వేలాది భుజాలు, వేల ముఖాలు, వేల నేత్రాలు, వేల వేల నాసికలు, వేనవేల కుండలాలు..ఇలా ఆ విరాట్ స్వరూపుడిని వర్ణించి, దర్శించి, మురిసి తరించిపోవడంలో కలిగే విరాట్ సంతోషం సాటి లేనిదన్నారు. విశ్వరూప ధ్యానం వలన సమస్తంలో విష్ణువే కనిపిస్తాడని సామవేదం వారు వక్కాణించారు. అంతా హరియం అయినవాడికి భయం ఉండదన్నారు. విశ్వమే కాన్వాసుగా కలిగిన ఆ మహా వైష్ణవ దృశ్యాన్ని ఉహించి, మనసులో నిలుపుకోవడమే విరాట్రూప ధ్యానం అని, అవ్యయ భావనకు ఇదే ఆది అని సూత్రీకరించారు. అవతార పరంగా పరమాత్మ మనలా రూపం దాల్చినా, మనలా జన్మించినా.. మనలాగే మాయలో ఉన్నట్టు కానవచ్చినా ఆయన ఆ మాయకు లోబడడు అని తెలుసుకోవాలన్నారు. అవతారం అంటేనే దిగి రావడం... ఈ రహస్యం తెలిస్తే అవివేక భావనలు అంతరిస్తాయన్నారు. ఒకడు ప్రవాహంలో కొట్టుకు పోతూ ఉంటే వాడిని కాపాడేందుకు గజ ఈతగాడు ప్రవాహంలో ఉరుకుతాడు.. ఆ కొట్టుకుపోతున్న వాడిని రక్