మోదీ గెలుపుపై బిజెపి దృష్టి పెట్టాలి!


వచ్చే లోక్ సభ ఎన్నికలో నరేంద్ర మోదీ మాత్రమే గెలవాలి... ఇది దేశానికి అవసరం. అయితే ఇలా జనం గట్టిగా అనుకునేందుకు దోహదం చేసే అంశాలు నికరంగా ఏవి ఉన్నాయనే విషయంపై బిజెపి లో గట్టి ఆత్మ శోధన అవసరం! ఈ విషయంలో ఇప్పటికే లేటైంది... ఇప్పుడు కూడా అశ్రద్ధ చేస్తే బిజెపి గట్టి మూల్యం చెల్లించుకోక తప్పదు. అది బిజెపికి మాత్రమే కాక దేశానికి కూడా నష్టదాయకం. ఇప్పుడు ఈ ఒక్కసారీ మోదీ గెలిస్తే.. ఇప్పుడు మొదలైన మార్పు శాశ్వతం అవుతుంది... దేశం బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ ఆ పాత రోజులే ఆక్రమిస్తాయి... దేశాన్ని ఆ పాతాళంలోనే ఉంచేస్తాయి! దేశానికి చేసిన సేవ, రక్షణ, విదేశీ వ్యవహారాలలో పురోగతి, ఆర్థిక రంగ బలోపేత చర్యలు, అవినీతి రహిత పాలన ఇలాంటివి ప్రధానిగా నరేంద్ర మోదీ సాధించిన కొన్ని విజయాలు. అయితే ఇవి చరిత్రలో చెప్పుకోవడానికి బాగుంటాయి! ఓట్లు రాబట్టే అంశాలైతే కాదు. అవినీతికి పాల్పడితే ఓడిస్తారేమో కానీ.. నీతిగా ఉంటే ఓట్లేసే జనం కాదు మనోళ్లు. అవినీతి పరుల భరతం పడితే మాత్రం మెచ్చుకుంటారు.

అలాగే రక్షణ రంగాన్ని ఎంత బలోపేతం చేసినా అనవసరం... అదే పాకిస్థాన్ తో యుద్ధం చేస్తే మాత్రం ఓట్లేస్తారు. ఇప్పుడు మోదీ మళ్ళీ గెలవడం మన దేశానికి జాతీయావసరం. దేశమే కుటుంబమైన వ్యక్తి, నిజాయితీతో పాటు నిబద్ధత, సాహసం ఉన్నవాడు కాబట్టి మోదీ ఇంకోసారి గెలవాలి. అలా జరగాలంటే కేవలం జనంలో మోదీ పై ఉన్న అభిమానం ఒక్కటే చాలదు. నిజానికి ఇవాళ దేశంలో సుమారు 90 శాతం మంది మోడీని మెచ్చుకుంటున్నారు. కానీ ప్రధానికి నేరుగా ఎన్నికలు జరిగేపరిస్థితి కాదు కదా. అంచేత అనేక సమీకరణాలు, స్థానిక అంశాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తాయి. సామాన్యప్రజలు, మధ్యతరగతి వర్గాలకు నరేంద్ర మోదీ పాలించిన ఈ నాలుగేళ్లలో ఏమి మంచి జరిగింది, ఎంత చెడు జరిగింది అనేది బిజెపి వర్గాలు నిజాయితీగా బేరీజు వేసుకోవాలి. మహిళలు, యువకులు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, ఓసీలు, హిందువులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, గ్రామీణులు, పట్టణ ప్రాంతాలవారు... ఇలా రకరకాలుగా విభాజితమై ఉన్న ఓటింగ్ వ్యవస్థ మనది. ఏ వర్గానికి ఏమి జరిగింది .. ఎవరు ఏమనుకుంటున్నారు... ఇలాంటి అంశాల్లో శాస్త్రీయమైన ఆలోచన, పరిశీలన అవసరం. పెద్దనోట్లరద్దు, జీఎస్టీ ఈ రెండూ చాలాగొప్పసంస్కరణలు అని, విజయాలు అని బిజెపి వారు గట్టిగా నమ్ముతుంటే అవే విషయాలను దారుణ వైఫల్యాలుగా అనేక పార్టీలు, నాయకులూ ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బిజెపి నేరుగా బలంగా లేదు... కొన్ని రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులు, ఎత్తులు చాలా కష్టం, క్లిష్టం. అవన్నీ సమకూడనిదే అనుకూల ఫలితం రాదు. ఎక్కడికక్కడ దుష్ప్రచారాలు, నష్టకూటముల దెబ్బలు తగులుతుంటే ఎలా కాసుకోవాలోకూడా తెలియాలి. అవసరమైతే నష్ట నివారణ చర్యలూ చేపట్టాలి. ఫాల్స్ ప్రిస్టేజికి పోకుండా ఈ ఆఖరి రోజుల్లో అయినా జనాన్ని మంచి చేసుకోవాలి. అది మిస్సయితే ఆనక ఎన్నికల్లో దెబ్బ కొట్టేసి... ఆ తర్వాత మోదీ చాలా గొప్పోడంటూ వాజపేయిని పొగిడినట్టు పొగుడుతారు! ఇవాళ దేశానికి మోదీని మించిన నాయకుడు లేడు. ప్రధాని పదవికి అంతకు మించిన అర్హుడూ లేడు. కానీ మన వ్యవస్థలో ఉన్న దరిద్రం ఏమిటంటే... ఈ అర్హతలను బట్టి కాక..ఇతరేతర కారణాల ద్వారా మాత్రమే అధికారం వస్తుంది. మంచి పని చేయడానికైనా సరే అధికారమే ముఖ్యం..అది రావాలంటే ఏమి చేయాలో అవి చేయాలి తప్ప మడి కట్టుకుంటే మూలన కూర్చోబెట్టేస్తారు! అంచేత బిజెపి కళ్ళు తెరవాలి.. మోదీ కాస్త జనంపై దృష్టి పెట్టాలి.. ముందు గెలవాలి... ఆ తర్వాతే ఏదైనా!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం