పాక్ కు భద్రతా సాయం నిలిపివేత ... ట్రంప్ మరో దెబ్బ


పాకిస్థాన్‌ కి ఇటీవల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా నాయకత్వం ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి తమ భద్రతా సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. అమెరికా భద్రతా దళ అధికార ప్రతినిధి హెథర్‌ నౌఎర్ట్‌ మీడియా తో మాట్లాడుతూ ఇకపై పాకిస్థాన్‌కు ఆయుధాల సరఫరా, భద్రతకు సంబంధించి సహకారాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో కొన్నేళ్లుగా పాక్‌ పూర్తిగా విఫలం అవుతున్నదని, పైగా అమెరికా భద్రతా దళాలపై దాడులు చేసేవారికి పాక్‌ సాయం అందిస్తున్నదని ఆమె ప్రకటించారు. మరో భద్రతాధికారి మాట్లాడుతూ 2016కు పాక్‌కు మంజూరు చేసిన మిలిటరీ ఫండ్‌ను నిలుపుదల చేస్తూ ఇప్పటికే ఆదేశాలు రాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై పాక్‌కు అమెరికా నుంచి ఆర్థిక, భద్రతా సహకారాలు ఏమాత్రం అందబోవని స్పష్టంచేశారు. అయితే ఈ విషయాన్ని కూడా పాకిస్థాన్‌ తేలికగానే తీసుకుంటుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ట్వీట్‌ తర్వాత పాక్‌ తీవ్రంగా స్పందించి... అమెరికాను తప్పు పట్టిన నేపథ్యంలో ఈ అధికారి ఆలా అని ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ చేసిన త్యాగాలను డబ్బుతో వెలకట్టడం సాధ్యం కాదని, అమెరికా వెంట లేకున్నా తమ పోరాటం కొనసాగుతుందని పాక్ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ ప్రకటించటం తెలిసిందే. ఈ స్పందనను కూడా అమెరికా సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నది.

ముఖ్యాంశాలు