ధనుర్మాస వైభవం


శ్రీవైష్ణవులందరికీ ధనుర్మాసం పరమ పవిత్రం కదా..ఈ మాసములో గోదాదేవిని, మహావిష్ణువుని అమిత భక్తితో సేవిస్తారు. అమిత భక్తిపరులైన ఆళ్వారుల్లో గోదాదేవి ఒకరు. ఆమె స్వామి వారిని సేవించి, వరించి తరించారు.ఓ మారు గోదా తన తండ్రి విష్ణుచిత్తునితో కలసి తిరుమాళింజోరులై లోని అళగర్ అనే పిలిచే విష్ణ్వాలయములో స్వామి వారిని స్తుతించి స్వామి వారికి వంద కుండల పాయసాన్నం నివేదిస్తానని మ్రొక్కుకుంది. ఆ పిమ్మట ఆమె విల్లిపుత్తూరికి తిరిగి రావడం .. స్వామి వారిని తదేక ధ్యానం చేస్తూ చివరకు స్వామి వారు ఆమెను కరుణించి వివాహ మాడటం జరిగింది. గోదా దేవి నాడు అళగర్ గుడిలో తాను స్వామి వారికి నివేదిస్తానన్న వంద కుండల పాయసాన్నం సంగతే మరచి పోయింది. రామానుజులు వారు తరువాతి కాలములో ఆ సంగతి తెలిసి అళగర్ పెరుమాళ్ కి ఆ మ్రొక్కుబడి చెల్లించారు ఆండాళ్ తరపున. తరువాత కొన్నాళ్ళకు రామానుజుల వారు శ్రీవిళ్ళిపుత్తూర్ కి వెళ్ళినపుడు తన తరపునమ్రొక్కుబడి చెల్లించిన రామానుజులు రావడం చూసి గోదాదేవి ఉత్సవ విగ్రహం గర్భగుడిలో నుండి ముచ్చటపడి నడచి రావడం మొదలుపెట్టి అర్ధ మంటపం దాకా వచ్చి రామానుజునికి స్వాగతం చెబుతూ నిలబడిపోయింది.. అందుకే గోదాదేవి ఉత్సవ విగ్రహం విళ్ళిపుత్తూర్ ఆలయములో గర్భ గృహములో గాక అర్ధ మండపములోనే ఉండిపోయింది. అక్కడకు వెళ్ళినపుడు అక్కడి శ్రీవైష్ణవ భక్తాగ్రేసరులు.. అమ్మ వారి ఉత్సవ విగ్రహం ఎందుకు గర్భగుడిలో ఉండదో ఈ ఉదంతం చెప్పారు. శ్రీరామానుజులు పరమ వైష్ణవ శిఖామణి.. ఆయన ఈ ధనుర్మాసములో తిరుప్పావై పాడుతూ బిక్షాటన చేసేవారట. అందుకే ఆయనకు తిరుప్పావై జీయర్ అని పేరు కూడా ఉంది.ఓ ధనుర్మాసములో రామానుజుల వారు తిరుప్పావై పాడుతూ తన గురువుగారి ఇంటి ముంగిట వచ్చేసరికి 18 వ పాశురం పాడారట.ఆ సమయములో పెరియనంబి ఇంటి తలుపులు మూసి ఉన్నాయిట. ఆయన ఆ పాశురం పాడగానే పెరియనంబి కుమార్తె వచ్చి తలుపు తీసిందిట. అపూర్వ సౌందర్యముతో మెరసిపోతున్న పెరియనంబి కుమార్తెను చూడగానే ఆమెలో నీలా దేవిని గాంచారట రామానుజులు . వెంటనే మరో మారు ఆ పాశురం మళ్ళీ గానం చేసారట. అందుకే తిరుప్పావై గానం చేసేప్పుడు పద్దెనిమిదవ పాశురాన్ని రెండు మార్లు ఆలపిస్తారు. ఓం నమో నారాయణాయ - వీర నరసింహ రాజు, కువైట్ సిటీ

ముఖ్యాంశాలు