భారత్ కి పడి ఏడుస్తున్న పాక్ పాలకులు !


పాకిస్థాన్ ప్రతి విషయానికీ భారత్ కి పడి ఏడవడమే పనిగా పెట్టుకుంది. తాజాగా తనకు అమెరికాతో తలెత్తిన గొడవలో కూడా పాకిస్థాన్ భారత దేశాన్ని లాగుతోంది. అమెరికా అధినేత స్వయంగా పాకిస్థాన్ పాలకులను అబద్ధాలకోరులని, తమ డబ్బు తినేశారని విమర్శించడంతో పాటు సైనిక, భద్రతా సహాయ నిధులను ఆపేయడంతో పాకిస్థాన్ పాలకులకి స్వదేశంలో పరువు పోయింది. వారిని విమర్శించే వ్యక్తులు ఇపుడు గొంతెత్తుతున్నారు. దీంతో ఈ గొడవలో భారత్ ని కూడా భాగగస్వామిని చేసి పబ్బం గడుపుకొనేందుకు పాకిస్థాన్ నాయకత్వం వేసిన కొత్త ఎత్తు ఇది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ మాట్లాడుతూ పాక్‌, అమెరికా మాటల యుద్ధంలోకి భారత్‌ను లాగారు. ట్రంప్‌ ఉగ్రవాదుల విషయంలో భారత్‌ భాషలో మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పాక్‌, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఖ్వాజా దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా పాకిస్థాన్ పై ఆరోపణలు చేస్తున్నదని కూడా ఖ్వాజా ఆరోపించారు. ట్రంప్‌ కూడా భారత్‌ భాషలో మాట్లాడుతున్నారని.. ఈ వ్యాఖ్యల్లో నిజం లేదని ఖండించారు. భారత్‌, అమెరికాల మధ్య ఉన్న సంబంధాల వల్లనే అమెరికా ఈ భాష మాట్లాడుతోందని ఆరోపించారు.పాకిస్థాన్ దొంగచాటు ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ పీఓకే లోకి వెళ్లి మరీ కాల్పులు జరపడం, ఇంకా సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం.. తాజాగా జాదవ్ కిడ్నాప్ కి సంబంధించి స్పష్టమైన ఆధారాలను బయటపెట్టి పాక్ ప్రపంచానికి చెబుతున్న అసత్యాలు విలువ లేకుండా చేయడం వంటి భారత చర్యలతో పాకిస్థాన్ మరింత పగతో రగులుతోంది. దీనికి తోడు ఇంతకాలం భారత్ చెబుతున్న సత్యమే ఇప్పుడు అమెరికా నోటా వినడంతో షాక్ తిన్న పాకిస్థాన్ గత్యంతరం లేక ఈ వివాదంలో భారత్ ను లాగి బయటపడాలని చూస్తున్నదని పరిశీలకుల భావన.

ముఖ్యాంశాలు