అనంత కల్యాణ గుణాల రేడు శ్రీకృష్ణుడు


(ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీమద్భాగవత ప్రవచనం నాలుగోరోజు ప్రసంగం) కృష్ణుడిది యోగీశ్వరావతారం.. యోగీశ్వరేశ్వరావతారం అని ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిపాదించారు. భగవంతుని పొందే ఉపాయానికి యోగం అని పేరుని శాస్త్రం చెప్పిందని.. అలాగే జ్ఞానానికి మరో పేరు యోగం అని వక్కాణించారు. కృష్ణుడి విషయానికొస్తే జ్ఞానం ఆయన రూపం అని ఆ జ్ఞానానికి ఆయనే గమ్యం అని తేటతెల్లం చేసారు. అత్యంత శాస్త్రీయ, సమన్వయ దృక్పథంతో సాగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం వారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞం ఆద్యంతం ఆసక్తితో.. అనురక్తితో వింటున్న భక్తజనం తోడుగా అద్వితీయంగా సాగుతున్నది. ప్రవచనం నాలుగో రోజున... అభిమన్యుపత్ని ఉత్తర గర్భం లోని శిశువుకు మహావిష్ణువైన శ్రీకృష్ణుడు ప్రాణ గండాన్ని తప్పించిన ఘట్టంతో మొదలిడి కుంతీ దేవి కృష్ణుని ఎడల చేసిన స్తోత్రం, భీష్మ కృత కృష్ణ స్తుతి, భీష్మ నిర్యాణం, ఆపిమ్మట శ్రీకృష్ణ నిర్యాణ సమాచారం.. అర్జున విలాపం, ధర్మరాజు మహాప్రస్థాన ప్రస్తుతి, పరీక్షిన్మహారాజు ఔన్నత్యం, భూదేవి, ధర్మదేవత గోవృషభ రూపంలో కృష్ణుని గుణగణాలను స్మరించుకునే ఘట్టం, కలి ప్రభావాన్ని నియంత్రించిన పరీక్షిత్తు పాలనా వైభవం... కాలవశాన కలి ప్రభావానికి లోనైన పరీక్షిత్తుకు ఋషి శాపం, సర్పం కాటు విషయాన్ని విస్మరించి.. కాలసర్పం కాటును తప్పించుకున్న ఆ మహారాజు ఆధ్యాత్మిక వైభవం ఇత్యాది విశేషాలను సభారంజకంగా శ్రీ సామవేదం విశదపరిచారు. కలి ఆసన్నమైన తర్వాత పరీక్షిత్ పాలనలో గోమాత(భూదేవి), వృషభం (ధర్మం) సంభాషణలో భాగంగా వ్యక్తమైన పలు శ్రీకృష్ణ సుగుణాలను బ్రహ్మశ్రీ సామవేదం వివరించారు. సత్యం, శౌచం (బహిర్ , అంతః శుద్ధి) , దయ, శాంతి, సంతోషం, ఆర్జవమ్, సామ్యం, తపస్సు, జ్ఞానం, విరక్తి, ఉపరతి, ఇతిక్ష, ఐశ్వర్యం, శౌర్యం, తేజం, శృతం, బలం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, ధైర్యం, మార్దవం, ప్రాగల్భ్యం (గొప్ప ప్రతిభ), ప్రశ్రయః, శీలం, సహః, ఓజః (కామరాగదోషాలు లేని, ప్రపంచాన్ని వహించగల గుణము), భాగహా, గాంభీర్యం, స్థిరత్వం, ఆస్తిక్యం, కీర్తి, మానం ఇత్యాది అనేక సుగుణాల పుట్టగా, అనంత కల్యాణ గుణ నిలయునిగా భూమి శ్రీ కృష్ణుని కీర్తించిందన్నారు. ఉత్తర గర్భం లోని శిశువుకు ప్రాణభయం ఎదురైన వేళ ఆ శిశువు కృష్ణుని స్మరించడం... ప్రాణరక్షణ తర్వాత జన్మించిన ఆ శిశువు పుట్టగానే ప్రాణదాత అయిన కృష్ణుని కోసం చుట్టూ పరీక్షించి చూడడం అనే విషయాలను సామవేదం వారు విద్వజ్జన సమ్మోహనంగా సమన్వయపరిచారు. ఈ రెండు విషయాల్లో ఏమాత్రం అతిశయోక్తి, అసత్యం లేవన్నారు. ఆ గర్భస్థ శిశువుకి ఈ మహోన్నత సంస్కారం, సుకృతం పాండవుల ఇంట జన్మించడంతోనే సమకూడాయన్నారు. పాండవులు నిత్యయోగులని.. వారి ఇంట నిత్యం కృష్ణ స్మరణే జరిగేదని ఈ సందర్భంగా తెలిపారు. సుఖము కలిగినా, శాంతి. ఆపద, ఆనందం, సందేహం.. ఇలా ఏది తలెత్తినా పాండవుల ఇంట కృష్ణునే తలచేవారని.. నిత్యం ఆయన ధ్యాసలోనే మసలే వారని పేర్కొన్నారు. అందుకే గర్భంలోనూ ఆ శిశువుకి కృష్ణుడు గుర్తొచ్చాడని సూత్రీకరించారు. పరీక్షిత్తు సుకృతం ఎంతో గొప్పది కనుక.. అతడి జన్మ వైభవం ఉత్కృష్టం గనుక పుట్టకముందే.. అంగుష్ఠమాత్ర దివ్య స్వరూపంలో విష్ణు దివ్య దర్శన భాగ్యాన్ని పొందాడన్నారు. అందుకే అతడికి విష్ణురాతుడని పేరు పెట్టారని భాగవతం చెబుతోందన్నారు. అయితే ఆ శిశువు పుట్టీ పుట్టగానే పరీక్షగా కృష్ణుని కోసం వెదికాడు గనుక పరీక్షిత్తు అనే పేరు పెట్టినట్టుగా భారతంలో ఉన్న అందమైన భావన కూడా సముచితమే అన్నారు. ప్రాణదాత కృష్ణుడు కావడమే కాక భూమిపైకి వస్తూనే ఆ కృష్ణుని కోసం అన్వేషించాడు గనుకనే విష్ణురాతుడు (పరీక్షిత్తు) ధన్యుడయ్యాడని.. అదే అతడి మొదటి ఆధ్యాత్మిక సాధన అనీ విశ్లేషించారు. అంతటి కరుణను పొందాడు గనుకనే ఆ మహారాజు ధర్మ పరిరక్షకుడయ్యాడని.. కేవలం వారం రోజుల దివ్య సాధనతో తాను ముక్తిని అందుకోవడమే కాక లోకానికి భాగవత కృపను చేకూర్చగలిగాడని సూచనప్రాయంగా తెలిపారు. గర్భిణిని దహృది అంటారని చెబుతూ ఆ సమయంలో ఆమె భావనలు, ఆలోచనలు గర్భస్థ శిశువును ప్రభావితం చేస్తాయని, పరీక్షిత్తుకి కృష్ణ స్పృహ కలిగించినది ఆ తల్లి సంస్కారమే అనే సంగతిని నేటితరం గుర్తెరగాలన్నారు. భగవంతుడిని ప్రార్థించిన ప్రతిసారీ తక్షణం రక్షణ దొరకదని అంటూ... రక్షణలో జాప్యం కలిగితే మన కర్మఇంకా క్షయం కాలేదని గ్రహించాలన్నారు. చాలాసార్లు భగవానుడు దర్శనం ఇవ్వకుండానే మనలను ఏదో ఒక రూపాన రక్షిస్తూ ఉంటాడని చెబుతూ.. ఆ సత్యాన్ని ప్రతిక్షణం స్మరణలో ఉంచుకోవాలని ఉపదేశించారు. అంగుష్ఠ మాత్రుడుగా .. ప్రతి వారి హృదయంలో భగవత్ స్వరూపం వ్యాపించి ఉంటుందనే విషయాన్ని ఉపనిషత్తు చెప్పిందని.. ఇది కూడా పరీక్షిత్తు జన్మ ఉదంతంలో స్పష్టం అవుతున్న మరో ఆధ్యాత్మిక రహస్యమని అన్నారు. అనంతరం కృష్ణుని కీర్తిస్తూ కుంతీదేవి చేసిన స్తోత్రం ఆమె హృదయాన్ని, కృష్ణ తత్వాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ఇది ప్రతివారూ నిత్యానుష్టానంలో చెప్పుకోవలసిన శ్లోకం అని శ్రీ సామవేదం ప్రశంసించారు. జీవునికి, ప్రకృతికి కూడా అతీతుడైన అనాది పురుషుడు.. పురుషోత్తముడు... జీవులకు బయట లోపల కూడా ఉన్నవాడైన కృష్ణపరమాత్మకి నమస్కారం అంటూ కుంతీ స్తోత్రం చేసిందని చెప్పారు. తమకు నిత్యం ఆపదలు కలగాలని.. వాటి ద్వారా నిత్యం కృష్ణుడే స్ఫురణకు రావాలని తద్వారా కృష్ణ సాన్నిధ్యంలోనే జీవనం కడతేరాలని ఆమె కోరుకుందన్నారు. స్ఫురణ స్మరణ అవుతుందని... అదే దర్శనం అని అంతరార్థాన్ని విశ్లేషించారు. ఎవని దర్శనం కలిగితే ఇక మళ్ళీ జన్మ ఉండదో అట్టివాని దర్శనంగా కృష్ణ దర్శనాన్ని కుంతీదేవి సంభావించినదని వెల్లడించారు. లోకైక నాథుడైన నారాయణుడ్ని స్మరించడమే సంపద.. ఆ నారాయణుడిని విస్మరించడమే ఆపద అని ఈ సందర్భంగా సమన్వయపరిచారు. గంగ సముద్రం వైపు ప్రయాణించినట్టు నీ వైపే నా మనసు పయనించేలా చూడు అని కుంతీదేవి వేసుకున్నాడని, మమకార పాశాన్ని తెంచివేయమని అర్థించినదని వెల్లడించారు. భాగవతంలో స్తోత్రాలకు విశిష్ట స్థానం ఉందని.. వీటిపై పరిశోధన చేయవచ్చని అన్నారాయన. స్తోత్రం అంటేనే భగవత్ తత్వాన్ని అందించే శాస్త్రం అని నిర్వచించారు. అయితే ఫలశృతిపై కాక స్తోత్రం, దాని భావంపై శ్రద్ధ పెట్టాలని భక్తులకు సూచించారు. ధర్మజుడిని పట్టాభిషిక్తుడిని చేసిన కృష్ణుడు అంపశయ్యపై ఉన్న భీష్ముని నుంచి ధర్మాచరణ విధానాలపై అతడికి వివరణ ఇప్పించే సన్నివేశాన్ని.. భీష్మాచార్యుని అద్వితీయ భక్తి వైభవాన్ని సామవేదం వారు అనితరమైన శైలిలో విశదపరిచారు. శరీర బాధ తెలియకుండా వరం ఇచ్చి మరీ నాతో ధర్మాలు చెప్పించడం ఎందుకయ్యా... ధర్మమూర్తివి నీవే చెప్పవచ్చని భీష్ముడు అంటే.. నేనిచ్చిన సత్తువతో.. నా భక్తుడు చెబితేనే దానికి విలువ అని కృష్ణుడు అన్నాడని తెలిపారు. భీష్మ కృత శ్రీకృష్ణ స్తుతిని కూడా అనితరంగా వర్ణించారు. తనలోపల కదిలి మెదిలే కృష్ణ రూపాలన్నిటినీ కాలస్వరూప భగవానుడిగా సంభావిస్తూ భీష్ముడి స్తుతి సాగిందన్నారు. కృష్ణుడిని స్మరిస్తూ పాలనా సాగించాలని చెప్పిన భీష్మాచార్యుడు ఇదిగో ఇతడే నారాయణుడని కృష్ణుని చూపి ధర్మజునికి చెప్పాడన్నారు. మాయాశక్తితో లోకాన్ని మోహింపజేస్తూ తనను తాను గోప్యంగా రహస్యంగా ఉంచుకొని సర్వమూ నడిపించిన కృష్ణ తత్వం అద్భుతమని.. ఆ రహస్యాన్ని శివుడు, నారదుడు వంటివారు మాత్రమే వాస్తవంగా తెలుసుకోగలరని భీష్ముడు చెప్పాడన్నారు. సర్వ సమర్థుడు కనుకనే మీకు సారథిగా, సఖునిగా, సేవకునిగా కూడా వ్యవహరించాడని వాస్తవాన్ని వెల్లడించాడన్నారు. కేవలం కృష్ణ ధ్యానమే ముక్తి దాయకమని.. కానీ భీష్మాచార్యుని మహద్భాగ్యం అట్టి కృష్ణుడే కనులముందు నిలుచుండగా... ఆ రూపాన్ని అపురూపంగా చూస్తూ .. అలాగే బాహ్య స్పృహను వీడి మనస్సుని ఆ కృష్ణుడిపైనే నిలిపి కనురెప్ప వేయకుండా... నిర్మలానందంతో భీష్ముడు తన ఇహ యాత్రను చాలించాడన్నారు. భీష్ముడు తలచిన కృష్ణుని ప్రతి రూపమూ అద్వితీయమే అని సామవేదం ప్రతిపాదించారు. పార్థసారథి రూపంలో కృష్ణ ధ్యానం ప్రతివారికీ తగినదన్నారు. బతుకు రథాన్ని భగవంతుడికి అప్పగించడమే ఇందలి ధ్యేయమన్నారు. భీష్ముని స్తుతికి సంబంధించి పోతన భాగవత పద్యాలను ప్రస్తావిస్తూ.. అందరూ అనువదించి రాస్తారు.. కానీ పోతన అనుభవించి రాస్తారు అని సామవేదం కొనియాడారు. ధర్మాన్ని అంటిపెట్టుకొని స్థిర విశ్వాసంతో, నిత్యా చైతన్యంతో భక్తులు నడవాలని.. అలా చేతకాకుంటే మహోత్సాహో మహాబలః అని స్వామిని స్తుతించి ఆశ్రయించాలని తరుణోపాయం బోధించారు. కృష్ణుని ఏకం అద్వితీయం బ్రహ్మ గా గ్రహిస్తూ, స్తుతిస్తూ భీష్ముడు సద్గతి పొందినది తెలిపారు. ఆ తదుపరి కొంతకాలానికి... దారుకుని ద్వారా కృష్ణ వర్తమానం రావడంతో ద్వారకా వెళ్లిన అర్జునుడు విషాద మూర్తిగా తిరిగి వచ్చాడన్నారు. అర్జునుడు కుమిలిపోతూ.. విలపిస్తూ కృష్ణ నిర్యాణ సమాచారం తెలిపాడని... అది విన్న వెంటనే ధర్మరాజు కూడా మహాప్రస్థానానికి సిద్దపడ్డాడని కథాక్రమంలో భాగంగా వివరించారు. ఇంద్రియాలను మనస్సుతో అంతర్ముఖం చేసి వాటిని బుద్ధితో లీనం చేసి.. సంపూర్ణంగా బుద్ధిని దైవంతో లయం చేయడమే మహాప్రస్థానమని.. ఇంతటి సాధన, ఈ పరిణితి రావాలంటే యుగాలు కూడా చాలవని స్పష్టం చేసారు. కృష్ణ నిర్యాణం తర్వాత ఆసన్నమైంది కలి దుష్ప్రభావాన్ని శ్రీ సామవేదం ప్రముఖంగా వివరించారు. తపస్సు, శౌచం, దయ, సత్యం అనేవి నాలుగూ ధర్మానికి నాలుగు పాదాలని.. మోహం హం వలన తపస్సు (ధర్మపాలన), దుష్ట సాంగత్యం వలన శౌచం, గర్వం వలన దయ, పోయాయని ఇక సత్యం మాత్రమే ఒక్క పాదంగా మిగిలి ఉన్నదని చెప్పారు. అధికసంఖ్యాకులు నీచులే పాలకులవుతారని అన్నారు. గోవధని నిషేధించకుంటే పాలకులకు ఆ పాపం చుట్టుకోక తప్పదని హెచ్చరించారు. జూదం, మద్యపానం, స్త్రీ యెడల కాముక దృష్టి, బంగారం (ధనాశ), అసత్యం, గర్వం, హింస ఉన్నచోట్ల మాత్రమే కాలిని ఉండమని అనడు పరీక్షిత్తు శాసించాడని.. ఆ మహారాజు తన ఆజన్మాంతం కలిని అదుపు చేసాడని తెలిపారు. కృష్ణ నిర్యాణం తర్వాత ద్వారకనుంచి స్త్రీలను ఇతరులను అర్జునుడు తీసుకొస్తుంటే బందిపోట్లు అతడిని ఓడించిన సన్నివేశం చెబుతూ అదే రథం, అదే రథి, అదే అమ్ములపొది, అదే ధనుస్సు.. కానీ అర్జునుడు ఆడదానికి కారణం ఆ సారథి లేకపోవడమే అని స్పష్టం చేసారు. జయాపజయాలకు అతీతంగా పరమాత్మపై బుద్ధి నిలపమన్నదే గీతా జ్ఞానం అందించే సందేశం అని గుర్తు చేసారు. సద్రూపుడు, చిద్రూపుడు అయి నిలిచైనా శ్రీ కృష్ణ పరమాత్మ తన భౌతిక శరీరాన్ని ఉపసంహరించుకున్నా... ధ్యానానికి స్మరణకి, కీర్తనకి కావలసినంత సావకాశాన్ని మనకు అందించే వెళ్లారని పేర్కొన్నారు. భగవద్విరహంతో తపిస్తే కృష్ణుడు తన ఉనికిని ప్రకటిస్తాడని తెలిపారు. కలియుగంలో బూటకపు ధర్మాలు రాజ్యమేలి అసలు ధర్మాలు నశిస్తాయన్నారు. ధర్మం లేకపోతే భూమి వట్టిపోతుందని, గోవుకి దెబ్బ తగిలితే భూమి క్షోభిస్తుందని హెచ్చరించారు. గోసేవ, గోరక్షణ ముఖ్యం అన్నారు. ధర్మ రక్షణపై శ్రద్ధ లేనప్పుడు తత్వాలు, జ్ఞానాలు ఏమీ మేలు చేయలేవన్నారు. ధర్మం చెట్టు వంటిదని, తత్వం ఫలం వంటిదని ప్రతిపాదిస్తూ తత్వం దొరికిందని ధర్మాన్ని వదిలేయడం.. మామిడి పండు కోసుకుని చెట్టు నరికేయడం వంటిదన్నారు. సనాతన ధర్మాన్ని కర్మ, ఉపాసన, జ్ఞానం పేరుతో ముక్కలు చేయవద్దని హితవు పలికారు. ధర్మంతో కూడిన భక్తిని, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తిని భాగవతం బోధిస్తుందని పేర్కొన్నారు. మరణమే కాదు జననం కూడా కాలసర్పం కాటే అన్న గొప్ప నీతిని పరీక్షిత్తు జీవితం నుంచి మనం నేర్చుకోవాలన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం