సరీసృపాల రక్షణపై వర్క్ షాప్ ప్రారంభం


హెర్పెటో ఫానా (సరీసృప జీవజాలం) పరిరక్షణ, ప్రధానంగా పాముల రక్షణ మరియు పునరావాసంపై అటవీశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి లాలాచెరువు వద్ద గల ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో మూడు రోజుల వర్క్ షాపు సోమవారం ప్రారంభమైంది. సదస్సు ను ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (వైల్డ్ లైఫ్) శ్రీ ఎన్. ప్రతీప్ కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రారంభ సభకు వైల్డ్ లైఫ్ డివిజన్ డిఎఫ్ ఓ శ్రీ అనంత్ శంకర్ అధ్యక్షత వహించగా, కాకినాడ డీఎఫ్ ఓ డాక్టర్ శ్రీమతి నందిని సలారియా, ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎంవి ప్రసాదరావు తదితరులు మాట్లాడారు. వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, పాములను పట్టడంలో నైపుణ్యం కలిగిన వారికి మూడు రోజుల పాటు మారేడుమిల్లి ప్రాంతంలో పాముల సంరక్షణ, వాటిని పట్టుకోవడంలో పాటించాల్సిన భద్రతా సంబంధమైన విషయాలపై ఈ మూడు రోజుల వర్క్ షాపులో భాగంగా అధికారులు శిక్షణ ఇస్తారు. పాముల పరిరక్షణ పై ఈ తరహా సదస్సు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. సదస్సు ప్రారంభించిన పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ప్రతీప్ కుమార్ ప్రసంగిస్తూ పాముల మీద ప్రజలకు సరైన అవగాహన కల్పించవలసిన అవసరం చాలా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఏటా యాభై వేల నుంచి అరవై వేలమంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారని, పాము కాటు మరణాల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువని అయన అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి సదస్సు ఏర్పాటవడం చాలా సముచితమని వ్యాఖ్యానించారు. ప్రజల్లో,అటవీఅధికారులలో కల్పించాలి

వన్యప్రాణుల వలన మానవులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా పులులు, చిరుతలు ఇంకా ఏనుగుల కారణంగా ఉంటున్నదని, అయితే వీటి విషయంలో వచ్చినంత గుర్తింపు లేకపోయినా, అంతకంటే ఎక్కువగా పాముల వలన ప్రాణాపాయం తప్పడంలేదని అన్నారు. పాములు ఎన్ని రకాలున్నాయి, ఏవి విషపూరితం, ఏవి కావనే ప్రాథమిక సమాచారం కూడా జనానికి తెలియకపోవడంతో పాము కనపడగానే భయంతో వణికిపోతున్నారని, విచక్షణ లేకుండా కొట్టి చంపేస్తున్నారని అన్నారు. 272 రకాల పాముల్లో కేవలం 52 రకాలు మాత్రమే విషపూరితం కాగా, మిగిలినవాటివలన హాని లేదన్న విషయం అందరూ తెలుసుకోవాలన్నారు. వేసవి కాలం లో అడవుల్లో నీరు దొరకక, చిరుతలు, పులులు, ఏనుగులు వంటి వన్యప్రాణులు సమీపాల్లోని జనావాసాల వైపు వస్తుండడం పరిపాటిగా మారిందన్నారు. వన్యప్రాణులతో మనకు ఉన్నది సహజ అనుబంధం అనే సంగతి మరచి దానిని వైరుధ్యంగా భావిస్తూ ఉండడమే సమస్యకు మూల కారణమని ప్రతీప్ కుమార్ అన్నారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, మనుషులకు గాయాలు, లేదా ప్రాణనష్టం జరిగిన సందర్భాల్లో బాధితులకు జాప్యం లేకుండా పరిహారం చెల్లించడానికి అటవీ అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. వీటి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు ఉండవన్నారు. అయితే ఈ నిధుల నిమిత్తం పై అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలపైనే ఆధారపడకుండా అందుబాటులో ఉన్న కాంపా నిధుల్నిఅటవీ అధికారులు వినియోగించుకోవాలన్నారు. చాలా కీలక ప్రాధాన్యం కలిగిన సర్పాల విషయంలో ఈ వర్క్ షాపును ఏర్పాటు చేసినందుకు డి ఎఫ్ ఓ శ్రీ అనంత్ శంకర్ ను ఆయన ప్రశంసించారు. ఈ తరహా కృషి ఇంకా జరగాల్సి ఉందన్నారు. శ్రీ అనంత్ శంకర్ మాట్లాడుతూ స్నేక్ క్యాచర్స్ లో కూడా కొందరు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టకుండా, అవగాహనా రహితంగా పాములను పట్టుకునే ప్రయత్నం చేయరాదన్నారు. అందుకే స్నేక్ క్యాచింగ్ ద్వారా వాటి రక్షణకు పాటుపడుతున్న వారికీ భద్రతాప్రమాణాలు కలిగిన కిట్స్ ను అందజేయడం, తగిన శిక్షణ ఇవ్వడం ఉద్దేశాలుగా ఈ వర్క్ షాప్ చేపట్టామన్నారు. పదిమంది అర్హులైన స్నేక్ క్యాచర్స్ కు కిట్స్ అందజేశారు. అలాగే వారికి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైన్టిస్ట్ డాక్టర్ అభిజిత్ దాస్, జూలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా సైన్టిస్ట్ ప్రత్యూష్ ఫై మోహ పాత్ర కూడా పాముల పరిరక్షణ గురించి వివిధ విషయాలు వెల్లడించారు. పాపికొండ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీసాయి వందన సమర్పణ చేసారు.

ప్రారంభ సభ ముగిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడిన పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) శ్రీ ప్రతీప్ కుమార్ వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఏపీలో మైదాన ప్రాంతాలలో కోతుల బెడద కు సంబంధించిన విషయంలో ఈ 8న అసెంబ్లీ లో ఒక ప్రశ్న చర్చకు వస్తుందన్నారు. కోతులను పట్టించి సురక్షితంగా అటవీప్రాంతాలలో వదిలే కార్యక్రమం చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ప్రాంతాలలో తిరిగే కోతుల పై ఆ ప్రాంత డిఎఫ్ ఓ కు సమాచారం ఇవ్వాలన్నారు. కోతులను పట్టుకొనే ప్రక్రియలో వెటర్నరీ డాక్టర్ల సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఇందుకు స్థానిక సంస్థలు నిధులు వెచ్చించాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని పాపికొండ, శ్రీశైల, నాగార్జున సాగర్ తదితర అభయారణ్యాలలో 52 నంచి 60 వరకూ పెద్ద పులులు సంచరిస్తున్నాయని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యాలలో పులుల గణాంకాలకై కెమెరా ట్రాప్స్ తో సర్వే జరుగుతుందన్నారు.

Attachments area

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం