కాంగ్రెస్, తెదేపా చెట్టాపట్టాల్


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా తెదేపా, వైకాపాలు కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు 12వ రోజూ లోక్‌సభలో చర్చకి రాలేదు. గురువారం కూడా ఉభయసభలు ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. కావేరి జలాల అంశంపై అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన కొనసాగించడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. బడ్జెట్‌ మలి విడత సమావేశాలు శుక్రవారంతో ముగియనుండగా పార్లమెంటు ప్రాంగణంలో కనిపించిన ఒక ప్రత్యేక దృశ్యం పలువురిని ఆకర్షించింది. తెదేపా, కాంగ్రెస్‌ సహా 17 విపక్ష పార్టీల ఎంపీలు చేయి చేయి కలిపి ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా వంద మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. సభలను నిర్వహించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ విపక్షాలు ఆందోళనకు దిగాయి. తెలుగు దేశంతో పాటు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ, బీఎస్పీ, డీఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఎన్‌సీపీ, ఆప్‌, ఆర్‌జేడీ తదితర 17 పార్టీలు ఏకమై నిరసన తెలిపాయి. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఉభయసభల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలైన గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జునఖర్గే సహా దాదాపు వంద మందికి పైగా ఉభయ సభల ఎంపీలు నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, దేశంలో బ్యాంకుల మోసాలు, రాఫెల్‌ కుంభకోణం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, మైనార్టీల అణచివేత, ఎస్సీ ఎస్టీలపై పెరిగిపోతున్న వేధింపులు, సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల లీక్‌, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాలకు సంబంధించి ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి పార్లమెంటు ప్రారంభమయ్యేంత వరకూ దాదాపు అరగంటకు పైగా ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ‘గ్రాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌ టు ఏపీ’ అని రాసి ఉన్న ప్లకార్డును మిగతా ప్రతిపక్ష సభ్యులందరికీ చూపుతూ వెళ్లి మానవహారంలో చేరారు. అన్నాడీఎంకే సభ్యులు 25 మంది వెల్‌లో నిల్చొని ఆందోళన కొనసాగించడంతో.. సభ సజావుగా లేదంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో మొత్తం 11 మంది ఇచ్చిన అవిశ్వాస నోటీసులు బుట్టదాఖలయ్యాయి. తొలుత అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ నేత మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ అవిశ్వాసం చర్చకు రాకుండా తాము పారిపోతున్నట్లు ప్రభుత్వం నిందలు వేస్తోందని విమర్శించారు. తాము పూర్తి సిద్ధంగా ఉన్నందున తమ నోటీసులపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. దళితులు, రైతుల ఇబ్బందులు, నీరవ్‌మోదీ మోసాలపైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సీపీఎం నేత పి.కరుణాకరణ్‌ కూడా ఇదే డిమాండ్‌ చేశారు. తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ మాట్లాడుతూ గత 21 రోజుల నుంచి ఉభయసభలు నడవడంలేదని.. అందుకు కాంగ్రెస్‌, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకులే ప్రధాన కారణమని ఆరోపించారు. 5వ తేదీ సభ ప్రారంభమైతే 27వ తేదీ వరకు కాంగ్రెస్‌వాళ్లు అవిశ్వాస నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సభ జరగని కారణంగా ఎన్డీఏ కూటమి సభ్యులు 23 రోజుల వేతనభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించారని, వారందర్నీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు సభను అడ్డుకుంటూ కూడా వేతనభత్యాలు తీసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అందుకు వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. తర్వాత స్పీకర్‌ అవిశ్వాస నోటీసులను సభముందు ఉంచారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తోట నరసింహం, ఎన్‌కే ప్రేమచంద్రన్‌, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కేశినేని నాని, మిథున్‌రెడ్డి, పి.కరుణాకరణ్‌, మహమ్మద్‌ సలీం, జ్యోతిరాదిత్య సింధియా, మల్లికార్జున ఖర్గేలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించారు. సభ సజావుగా లేకపోతే వాటికి మద్దతిచ్చే 50 మందిని లెక్కించడం తనకు సాధ్యంకాదు కాబట్టి అందరూ సీట్లలో కూర్చోవాలని అన్నాడీఎంకే సభ్యులకు సూచించారు. వారు వినిపించుకోకపోవడంతో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదావేసి వెళ్లిపోయారు.

ముఖ్యాంశాలు