జీన్స్ మార్కెట్లో పతంజలి!


తన వ్యాపార సామ్రాజ్యానికి హద్దులు లేవని ఎప్పుడో తేల్చిపారేసిన యోగాగురు బాబా రామ్ దేవ్ ఇపుడు దుస్తుల మార్కెట్లో అడుగుపెట్టారు. అది కూడా దేశీయ జీన్స్ ఫాంట్ల హవాతో! స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి పతంజలి పరిధాన్‌ పేరుతో దుస్తులను విక్రయించనున్నట్లు గతంలోనే బాబా ప్రకటించారు. ఆమేరకు దిల్లీలో ‘పతంజలి పరిధాన్‌’ పేరిట యాక్సెసరీస్‌ స్టోర్‌ను సోమవారం ప్రారంభించారు. ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా పరిధాన్‌ జీన్స్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రాందేవ్‌ బాబా తెలిపారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ స్టోర్‌లో మహిళలు, పురుషులు, చిన్నారులకు రకరకాల దుస్తులు లభించనున్నాయి. అంతేకాదు. తొలి దుకాణాన్ని తెరిచిన సందర్భంగా పతంజలి ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్‌ కింద వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. పతంజలి జీన్స్‌ రూ.500కే లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.2500 బ్రాండెడ్‌ షర్ట్స్‌ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్‌ పురస్కరించుకొని ఒక జీన్స్‌, రెండు టీ షర్టులను(రూ.7000 విలువ చేసే) కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని దోచుకుంటున్న మల్టీ నేషనల్‌ కంపెనీలను నియంత్రించేందుకు స్వదేశీ వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా వెల్లడించారు. పతంజలి పరిధాన్‌ లో ‘ఆస్థా’, ‘సంస్కార్‌’, ‘లైవ్‌ ఫిట్‌’ బ్రాండ్స్‌ కింద దాదాపు 3500 రకాల వస్త్రాలు, షూస్‌, యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

ముఖ్యాంశాలు