ఆర్జిత సేవ టిక్కెట్ల లాటరీలో మార్పులు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్‌కు ప్రస్తుత ఎలక్ట్రానిక్‌ లాటరీ పద్ధతిలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల నుంచి శుక్రవారం డయల్‌ తితిదే ఈవో కార్యక్రమాన్నినిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సూచనల మేరకు ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్‌ నమోదు గడువును 7నుంచి 4రోజులకు కుదిస్తున్నట్లు తెలిపారు. లాటరీ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు 3 రోజులలోపు ఆన్‌లైన్‌లో సొమ్ము జమ చేయాలని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌ లో జరిగే సేవలకు సంబంధించి 56,593 టిక్కెట్లు విడుదల చేస్తున్నామని శుతెలిపారు. శుక్రవారం ఉదయం 10 నుంచి ఈనెల 9 ఉదయం 10 గంటల్లోపు బుక్‌ చేసుకోవాలి. 9న మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్ట్రానిక్‌ లాటరీ తీస్తాం. సుప్రభాతం 7,878, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 వంతున మొత్తం 10,658 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు. సాధారణ సేవల కింద 45,935 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచాం అన్నారు. వీటిలో విశేషపూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజలసేవ 3 వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు 12,825 వరకు ఉన్నాయన్నారు.  2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనల కసరత్తు పూర్తి చేసినట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్ల ధరలు పెంచే ఆలోచన ఉందన్నారు. మార్చి రెండో వారంలో శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుపతిలోనూ చేపట్టనున్నామని తెలిపారు.  టోకెన్లపై శ్రీవారి దర్శనంతో పాటు తలనీలాల సమర్పణ, గదులు పొందడం, లడ్డూ ప్రసాదం వంటి వాటికి సింగల్‌విండో విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందని వెల్లడించారు. భక్తుల వసతి కోసం తిరుపతిలో మూడు సముదాయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.  

Facebook