లీలావతి ఆసుపత్రిలో మనోహర్‌ పారికర్‌


గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ సోమవారం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైతే చికిత్స నిమిత్తం అమెరికాకు బయల్దేరి వెళ్తారు. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి, సీనియర్‌ భాజపా నేత చంద్రకాంత్‌ పాటిల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి వెళ్లడానికి ముందు పారికర్‌ తన నివాసంలో సీనియర్‌ మంత్రులతో భేటీ అయ్యారు. తాను తిరిగి వచ్చేవరకూ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు... మంత్రులు ఫ్రాన్సిస్‌ డిసౌజా (భాజపా); విజయ్‌ సర్దేశాయ్‌ (గోవా ఫార్వార్డ్‌ పార్టీ); సుదీన్‌ ధావలీకర్‌ (మహారాష్ట్రవాదీ గోమాంతక్‌ పార్టీ)లతో సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. క్లోమ సంబంధ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ గతనెల 15న ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం 22న గోవాకు తిరిగి వచ్చిన ఆయన.. అదే రోజు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, క్లుప్తంగా మాట్లాడారు. మళ్లీ 25న గోవా వైద్య కళాశాలలో చేరి, మార్చి 1న ఇంటికి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన ప్రైవేటు నివాసం నుంచే పాలనా వ్యవహారాలను చూస్తున్నారు. పారికర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారనీ, ఆయన తిరిగి వచ్చేవరకూ పాలన వ్యవహారాలను మంత్రుల కమిటీ చూస్తుందని సర్దేశాయ్‌ స్పష్టం చేశారు. ముంబయికి వెళ్లే ముందు- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యక్తిగత కార్యదర్శితో పాటు డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో మనోహర్‌ పారికర్‌ సమావేశమయ్యారు. అందరికీ ధన్యవాదాలు. గత 15 రోజులుగా మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు. అందుకే నా ఆరోగ్యం కొంత కుదుటపడింది. పూర్తిగా నయం కావడానికి విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. నా ఆరోగ్యంకోసం మీరు ప్రార్థనలు కొనసాగిస్తారని ఆశిస్తున్నా... అని వీడియో సందేశంలో ఆయన ప్రజలను కోరారు.

ముఖ్యాంశాలు