ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కొత్త అధ్యాయం


ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్న సంకేతాలు వెలువడ్డాయి. దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కనపెట్టి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పొరుగుదేశం దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమయ్యారు. భద్రతా పరమైన గ్యారంటీ ఇస్తే అణ్వస్త్రాలను వదులుకోవడానికి ప్యాంగ్‌యాంగ్ సుమఖత వ్యక్తం చేసింది. దీనికి మరో ముందడుగుగా ఇరు దేశాల నేతలు ఏప్రిల్‌లో చారిత్రక సదస్సు నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ మేరకు సియోల్ అధికార వర్గం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చర్చల ప్రక్రియలో తొలి దశగా ఇద్దరు ప్రతినిధులను పంపగా వారితో సోమవారం రాత్రి ఫలవంతమైన చర్చలు జరిపినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కిమ్ జోంగ్‌ ఉన్‌తో దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యూ-యాంగ్ చర్చలు జరిపారు. చర్చలు ఫలవంతగా సాగినట్టు చుంగ్ తెలిపారు. తమ దేశ భద్రత, నాయకత్వానికి భరోసా కల్పిస్తే అణ్వస్త్ర కార్యక్రమాలను నిలిపేసేందుకు కిమ్ సుముఖత వ్యక్తం చేసినట్టు చుంగ్ వెల్లడించారు. కాగా, కిమ్ ఆహ్వానాన్ని గౌరవించి ప్రెసిడెంట్ మూన్ జాయ్ ఇన్ త్వరలోనే ఆయనతో భేటీ అవుతారని ప్యాంగ్ యాంగ్ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

ముఖ్యాంశాలు