తుఫాను పరిహారం పంపిణీ... సభలో బాబు ఆగ్రహావేశం


తుపాను సాయాన్ని కొట్టేయాలని ఎవరైనా చూస్తే ఊరుకోనని, ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకుంటే కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తిత్లీ బాధితులకు పరిహారం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షాలున్నాయని వైఎస్సార్సీపీ, జనసేనలపై ఆయన ధ్వజమెత్తారు. తిత్లీ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆఖరి బాధితుడికీ పరిహారం అందిస్తామని అభయమిచ్చారు. ‘ప్రకృతి విపత్తుల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కేంద్రం ఇంతవరకూ తిత్లీ తుపాను నష్టాలకు ఒక్క పైసా ఇవ్వలేదు. వాళ్లకు మానవత్వం లేదు." అని ఆరోపించారు. ప్రజలకు ధైర్యం చెప్పాలని టీడీపీ నాయకులు గ్రామాలకు వస్తే వైకాపా నాయకులు రెచ్చగొట్టాలని చూశారని, ఒడిశా నుంచి కిరాయి మనుషులను తెచ్చి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ ఉద్దానానికి వచ్చి చాలా అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీరు కార్చారు గానీ కేంద్రానికి లేఖ కూడా రాయలేదన్నారు. ఉద్దానంలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కష్టాన్ని తీర్చడానికి తానూ రాత్రింబవళ్లు పని చేస్తుంటే బిజెపి వాళ్లు తమపై రాళ్లు వేస్తున్నారన్నారు. కేంద్రంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందన్నారు. దేశం కోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత తీసుకు న్నానని, ఈ పోరాటానికి రాహుల్‌ గాంధీ సహకారం కూడా అడగటానికి భాజపా అరాచకాలే కారణం అని పేర్కొన్నా రు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ పక్క జిల్లాల్లో ఉండీ ఇక్కడికి రాలేదని, కనీసం ఒక్క మాటైనా మాట్లాడేందుకు నోరు పెగల్లేదని అన్నారు. కోడి కత్తి ఘటన ఒక డ్రామా అని బాబు ఆరోపించారు. మీ అభిమాని కోడికత్తితో మీపై దాడి చేస్తే.. పెద్ద సమస్యగా మార్చిన మీకు, తిత్లీ తుపాను ఈ ప్రాంతాన్ని ఇంతగా ధ్వంసం చేస్తే సమస్యగాకనిపించలేదా? అని జగన్ ని ప్రశ్నించారు. తిత్లీ తుఫాను వచ్చిన రోజే ఇక్కడికొచ్చానని, 13మంది మంత్రులను 30 మంది ఐఏ ఎస్‌ అధికారులను, 8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను, 110 మంది డిప్యూటీ కలెక్టర్లను రప్పించానని తెలిపారు.

ముఖ్యాంశాలు