కనకదుర్గమ్మ గుడి ఈఓ బదిలీ

బెజవాడ దుర్గమ్మ ఆలయ ఈఓ సూర్యకుమారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జ్‌ ఈవోగా దేవాదాయశాఖ కమిషనర్ అనురాధకు బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది. బెజవాడ కనకదుర్గ ఆలయంలో ఏదో తప్పు జరిగిందని నిర్ధారణ కావడం, ఆలయ నిబంధనలు, ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా అమ్మ సన్నిధిలో అర్ధరాత్రి అంతు తెలియని పూజలు జరిపించడం నేపథ్యంలో వ్యవహారాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరు 26వ తేదీ అర్ధరాత్రి అమ్మవారి ఆలయంలో పూజలు జరిగిన మాట వాస్తవమని పోలీసులతోపాటు ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు కూడా మధ్యంతర నివేదికలలో పేర్కొన్నాయి. నిబంధనలకు విరుద్ధమైన పూజలను, పైగా గుడితో సంబంధం లేని అర్చకుల పర్యవేక్షణలో నిర్వహించారని, సంబంధం లేని వ్యక్తులు అంతరాలయంలోకి ప్రవేశించారని, అంతే కాకుండా ఇవన్నీ ఈఓ కి తెలిసే జరిగాయని ప్రభుత్వానికి రూఢి అయింది. దీంతో ఈ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అసలు ఈ పూజలు ఎవరికోసం, ఎవరి ప్రమేయంతో.. ఏ లక్ష్యంతో జరిగాయో ఏ నివేదిక తేల్చకపోవడం. కనీసం రేఖామాత్రంగానైనా చెప్పకపోవడం గమనార్హం. 

Facebook
Twitter