భగవత్ ప్రీతి కలిగితే బతుకు తరిస్తుంది

(ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీమద్భాగవత ప్రవచనం ఐదవ రోజు ప్రసంగం)
భగవంతునిపై ప్రీతి కలిగితే జీవితం తరించిపోతుందని.. అయితే ఆ ప్రీతి కలగాలంటే ముందు భగవంతుడి విలువ తెలియాలని సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా మంగళవారం రాత్రి ఐదోరోజు ప్రవచనం చేస్తూ వేద స్వరూపమే భాగవతమని స్పష్టీకరించారు. అట్టి భాగవతాన్ని చదివితే భగవంతుని విలువ తెలుస్తుందన్నారు. వేదాలు, వేదాంతమైన ఉపనిషత్తులు ఏమి చెప్పాయో అదే భాగవతం కూడా గాధా రూపంలో చెబుతుందన్నారు. అందరూ చదువుకొని తరించదగిన, చదివి తరించగలిగిన వేదంగా భాగవతం అవతరించిందని చెప్పారు. నిజానికి వేద వాక్కును విశదపరచడానికే పురాణం ఇతిహాసాదులు ఉన్నాయని.. అందుకే శ్రుతిస్మృతిపురాణాలని మనవారు కలిపే చెబుతారని వెల్లడించారు. వేదంలో పండితుడైనంత మాత్రమే పురాణ ఇతిహాసాలు అక్కరలేదనుకోవడం అవివేకమన్నారు. ఇవి మూడూ అవిభాజ్య వస్తువులనే స్పృహను పండితులు కలిగి ఉండాలని హితవు పలికారు. ఇవన్నీ ఋషులు ఇచ్చినవే గనుక ఎక్కువా తక్కువా ఉండబోదని... అలా భావించడమే పాపమని స్పష్టం చేసారు. విష్ణు జ్ఞానం ఏ రూపంలో ఉన్న కూడా అది జన్మతారకమేనని చెబుతూ విష్ణు సహస్రనామాల వైభవాన్ని ఉదహరించారు. ఇందలి నామాలను మాత్రమే కాక, ఆ నామాల వెనుక గల చోదకశక్తిని దర్శించే ప్రయత్నం చేయాలన్నారు. పద్మనాభుడి ద్వారా ఉద్భవించిన బ్రహ్మదేవుడు తన పుట్టుక గురించి ఆలోచిస్తూ ఉంటే చుట్టూ ఉన్న జలం నుంచి తప తప అనే శబ్దం వినిపించిందని.. తపించమని చెబుతున్నట్టుగా ఇది అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు తపించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందాడని పేర్కొన్నారు. యోగపరమైన స్థితికి వెళ్లి యోచించడమే తపస్సు అని బ్రహ్మశ్రీ సామవేదం నిర్వచించారు. తపస్సుతో తపించకపోతే సాక్షాత్తూ బ్రహ్మదేవునికి కూడా పరమాత్మ అనుగ్రహం దొరకలేదనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలన్నారు. తపస్సు, బ్రహ్మచర్యం ద్వారా పక్వమైన మనస్సుకు పరమాత్మ అందుతాడని.. భగవదనుభూతికి ప్రథమ, ప్రధాన స్థానం తపస్సు మాత్రమేనని బ్రహ్మశ్రీ సామవేదం  ప్రవచించారు. బ్రహ్మదేవుడు గావించిన తపస్సుతో ప్రసన్నుడైన మహావిష్ణువ్వు విశ్వ రచన చేయాల్సిందిగా చతుర్ముఖుని ఆదేశించాడన్నారు. అయితే ఇక్కడ బ్రహ్మ కనబరచిన సంపూర్ణ శరణాగతి సర్వ మానవాళికి కూడా ఆదర్శప్రాయమన్నారు. నీ ఆజ్ఞగా భావించి విశ్వ రచన చేస్తాను.. అయితే అందుకు వలయు సమర్థతను నీవే అనుగ్రహించాలని.. సృష్టి చేస్తున్నది నేనే అన్న అహంభావం ఏ క్షణంలోనూ నాకు కలుగకుండా నీవే సర్వదా నన్ను కనిపెట్టుకోవాలి అని బ్రహ్మ పరమాత్మను ప్రార్థించాడన్నారు. అహం, మొహం నన్ను ఆవరించకుండా జ్ఞానాన్ని ప్రసాదించమని బ్రహ్మ కోరితే... దయాళువై శ్రీ మహావిష్ణువు అనుగ్రహించినదే చతుశ్లోకీ భాగవతమని తెలిపారు. ఇక్కడ బ్రహ్మ స్తుతిని, బ్రహ్మకి విష్ణువు చేసిన ఉపదేశాన్ని మనకు కూడా అన్వయించుకొంటే అసలు సత్యం తెలుస్తుందన్నారు. పరమేశ్వరుని వలన నడుస్తున్న ప్రపంచాన్ని, అందులోని ఆకర్షణలను చూసి మొహానికి లోను కాకుండా.. జగత్తు ద్వారా జగదీశ్వరుడ్ని చూడాలని, నడిచే జగత్తుని క