అటవీ సంరక్షణలో వినూత్న విధానాలు : సిసిఎఫ్‌ మూర్తి


1975లో కేవం లాగింగ్‌ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రాజమండ్రి అటవీసర్కిల్‌ 1999 నుంచి కొత్తరూపు సంతరించుకొని పూర్తిగా అటవీపరిరక్షణ కార్యకలాపాలు చేపడుతున్నదని ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ జెఎస్‌ఎన్‌ మూర్తి మంగళవారం రాజమండ్రిలో అటవీ శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 7623.4541 హెక్టార్ల అడవి ఉందని, 4 టెరిటోరియల్‌, 3 లాగింగ్‌, 2 వైల్డ్‌ లైఫ్‌, 3 సోషల్‌ ఫారెస్ట్‌, 1 ఎఫ్‌ఎస్‌డి డివిజన్లు, ఎస్‌ఎస్‌ (రాజమండ్రి), 2 ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ సెక్షన్లు సర్కిల్‌ పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక నేషనల్‌ పార్క్‌ (పాపికొండ), 3 అభయారణ్యాలు (కోరింగ, కొల్లేరు, కృష్ణా) సర్కిల్‌ పరిధిలో 308.5520 చదరపు కిలోమీటర్ల పరిధిలో నెకొని ఉన్నాయని వివరించారు. అటవీ ప్రాంతాలు, అటవీ సంపద సంరక్షణ కోసం వినూత్నంగా 39 బేస్‌ క్యాంపులను గిరిజనుల సహకారంతో లోతట్టు అటవీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐదేసి కిలోమీటర్ల పరిధిలోని అటవీ సంపద పరిరక్షణకు ఉద్దేశించిన ఈ క్యాంపు సక్రమంగా పనిచేసేలా బీట్‌ అధికారులు ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువులో పనిచేస్తున్న ఎపి స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీ ద్వారా ఇంతవరకూ 2 బ్యాచుల సెక్షన్‌ అధికారులు, 3 బ్యాచుల బీట్‌ అధికారులు వెరసి 128 మందికి (ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారితో కలిపి) శిక్షణ సదుపాయం అందజేసినట్లు పేర్కొన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇక్కడ శిక్షణ పొందుతున్న సిబ్బందికి డ్రైవింగ్‌లో కూడా తర్ఫీదు ఇస్తున్నామన్నారు. రైఫిల్‌ షూటింగ్‌లో కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ఇక్కడ జిమ్‌, యోగా కేంద్రం కూడా ఉన్నాయని తెలిపారు. ఈ అకాడమీకి భవన నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని మంత్రి రాఘవరావు ఈ సందర్భంగా ప్రకటించారు.

ముఖ్యాంశాలు