ఈ నరేంద్రుడు దేశోద్ధారకుడా.. మతోద్ధారకుడా?


* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఐదేళ్ళలో దేశానికి నిజంగా చేసినవి... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూరుశాతం నిజాయితీపరుడు. ఇది నిస్సందేహమైన విషయం. ఆశ్రితపక్షపాతం గాని, బంధుప్రీతి గానీ లేనివాడు. ఆయన తన క్యాబినెట్ ని, ఐదేళ్ల పాలనని కూడా ఎవరూ వేలెత్తి చూపకుండా, అవినీతి కుంభకోణాలు లేకుండా నడిపించగలిగాడు.. ఇదొక అద్భుత విజయం. దేశాన్ని రక్షణ రంగంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసాడు. పాకిస్థాన్ కి ఒకటికి రెండుసార్లు గట్టిగా బుద్ధి చెప్పి.. భయపెట్టాడు. చివరికి చైనా కూడా ఏకపక్షంగా పోయే దుస్సాహసం చేయకుండా అదుపులో ఉంచాడు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ భిన్న ధ్రువాల్ని కూడా అనివార్యంగా ఏకతాటిపైకి తెచ్చే కృషి నిబద్ధతతో చేస్తున్నాడు.. కొంత వరకూ విజయం కూడా సాధించాడు. విదేశాంగ విధానాన్ని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చక్కటి దిశలో పెట్టాడు. ఆర్థికంగా, సైనికశక్తి పరంగా, దౌత్య పరంగా, ద్వైపాక్షిక సంబంధాల పరంగా ప్రపంచవ్యాప్తంగా భారత దేశం పలుకుబడిని, పరపతిని పెంచాడు. దేశంలో అంతర్గతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచాడు. వర్తకులపై వేధింపులు లేకుండా చేసి వారు స్వేచ్ఛగా, నిజాయితీగా పన్ను కట్టే వాతావరణాన్ని కల్పించాడు. కొత్త విదేశీ అప్పులను అదుపులో ఉంచడంతో పాటు.. పాత బాకీలు తీర్చే యోచనతో కొన్ని విధానాలు అమలు చేసాడు. ఆధార్ సీడింగ్, పెద్దనోట్ల రద్దు, బ్యాంకు అకౌంట్ల విశ్లేషణ, విదేశీ నిధులతో ఇక్కడ అవకతవకలకు పాల్పడుతున్న వేలాది స్వచ్చంద సంస్థల అకౌంట్లను గాడిలో పెట్టడం, కొన్నిటి లైసెన్సులు రద్దు చేయడం వంటి చర్యలతో ముఖ్యంగా దేశీయంగా నల్లధనం అరికట్టే పనిలో పురోగతి సాధించాడు. తాను ఒక కచ్చితమైన హిందువుగా జీవిస్తూ.. ఎటువంటి పరమత బుజ్జగింపు ధోరణులకు పాల్పడకుండా గొప్ప సంప్రదాయం నెలకొల్పాడు అదే సమయంలో ఒక ప్రధానమంత్రిగా తాను ఏ మతానికీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వకుండా.. నూటపాతికకోట్ల భారతీయ సమాజాన్ని ఒకేలా చూసే ప్రయత్నం నిజాయితీగా చేసాడు. ఇలా ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని గొప్ప ఆలోచనల్ని.. సూపర్ పవర్ దిశగా అడుగుల్ని ఆచరణలో పెట్టడం ద్వారా మోడీ నవభారత నిర్మాత అయ్యాడు.. ఇది నిస్సందేహం. అయితే ఆయన మౌలికంగా, సమూలంగా దేశాన్ని మార్చినది, మార్చదలచుకున్నది ఆర్థిక, రక్షణ, అంతరిక్ష, విదేశ వ్యవహారాల రంగాల్లో మాత్రమే.

* ఇక అనేకమంది మద్దతుదారులు మోడీ ఈ దేశానికి చేసాడని ప్రచారం చేస్తున్న పనులు ఇవి... హిందూ మతాన్ని ఉద్ధరించాడని, ఇతర మతాల వ్యాప్తిని, మత మార్పిడులని చాలావరకూ అరికట్టేసాడని, ఆయా మతాలకి వచ్చే వేలాది కోట్ల విదేశీ నిధుల్ని ఆపేసాడని.. చర్చిలు కట్టకుండా నిలిపేసాడని... గోవుల్ని రక్షించేసాడని, మదర్సాలని సంస్కరించేసాడని... అన్నిటికీ మించి అయోధ్యలో రామమందిరం కట్టేయబోతున్నాడని... రిజర్వేషన్లు ఎత్తేస్తాడని, ఉమ్మడి సివిల్ కోడ్ వచ్చేస్తుందని, కాశ్మిర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసేస్తాడని, హిందూ రాజ్యాన్ని తెచ్చేస్తాడని ఇలా అనేక ప్రచారాలు మద్దతుదారులు చేస్తున్నారు. ఈ ప్రచారంలో అవగాహనా లోపం, అసత్యాలు అనేకం. నిజాయితీ కలిగిన వాడు, దేశాన్ని కుటుంబంగా భావించేవాడు, ఓటు బ్యాంకు రాజకీయం చేయనివాడు.. అదే సమయంలో దేశాభివృద్ధిని, అధికారాన్ని కోరుకునేవాడు ఒక మతోద్ధరణకి కట్టుబడిపోడు... అంతే కాక ఒకటి రెండు మతాలపై విద్వేషమూ ఉండదు. తాను గొప్ప హిందువుగా జీవిస్తూ.. అన్ని మతాలు కలిసి మెలిసి ఉండాలనే విధానాలనే మోడీ పాటిస్తున్నారు తప్ప హిందూ ధర్మాన్ని ఈ దేశంలోకి తేవాలని ఏమీ అనుకోవడంలేదు. అలా కొందరు పొరపాటుపడిపోయి.. ఆయనకి ఆపాదిస్తున్నారు. దానివలన మోడీకి మంచికంటే చెడే జరుగుతుంది. వీటిలో వాస్తవాలు చెప్పుకుంటే.. మోడీ పాలనలో దేశంలో ఎక్కడా చర్చిల నిర్మాణం ఆగిపోలేదు.. యథావిధిగా జరుగుతూనే ఉంది.. మోడీ పాలనా విధానాల వలన.. ప్రభుత్వ జోక్యం కారణంగా ఆగిపోయిందన్న ఒక్క చర్చి లేకపోగా.. మోడీ పాలనాకాలంలోనే మొదలై, లేదా అంతకుముందు ఆగిపోయి మళ్ళీ పనులు మొదలై.. ఇప్పుడు పూర్తయిన చర్చిలు కూడా అనేకం ఉన్నాయి. మదర్సాలపై కూడా నిర్బంధం ఏమీ లేదు. విదేశీ నిధులు పొందుతున్న సంస్థల లైసెన్సులు రద్దు చేసిన పనికి కూడా మతం రంగు పులమడం కొందరి అవగాహనా లోపం అంతే. దేశంలోకి నల్లడబ్బు రాకుండా తీసుకున్న చర్యల్లో ఇదీ ఒకటి.. అంతే. లైసెన్సులు రద్దయిన సంస్థల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత సంస్థలతో పాటు మత ప్రసక్తి లేని సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. దీనివలన మత ప్రచారానికి వచ్చిన అడ్డంకి కూడా ఏమీ లేదు. మత మార్పిడుల నిరోధానికి అంటూ మోడీ వచ్చాకా కొత్తగా ఏమీ చర్యలు తీసుకోలేదు.. అది అవసరం లేదు కూడా. గతంలో ఉన్నవి సక్రమంగా అమలైతే చాలు. మతమార్పిడులు ఎక్కడికక్కడ యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. హిందువుల కార్యక్రమాలను మించి క్రైస్తవ కార్యకలాపాలు, ప్రచార సభలు పెరిగిపోవడం చూస్తున్నాం. అంటే అణచివేత ఏమీ లేదు అనడానికి ఇది నిదర్శనం. అన్ని మతాలూ చాలా స్వేచ్చగా సంచరిస్తున్న వాతావరణం ఇండియాలో ఉంటే.. కొందరు ముస్లిం ప్రతినిధులు కావాలని అసహన ప్రచారం వ్యాప్తి చేసారు. అయితే దానిని దేశం నమ్మలేదు.. ప్రపంచం పట్టించుకోలేదు.కానీ మోడీ మద్దతుదారులు మాత్రమే అది నిజమనే భ్రమలో ఉన్నారు.. అదీ బాధాకరం. ట్రిపుల్ తలాక్ విషయంలో మోడీ ప్రాథమిక ఆలోచన మహిళా సంక్షేమం, తదుపరి ఆలోచన రాజకీయ ప్రయోజనమే తప్ప ముస్లిములను దెబ్బ తీయడం కాదు. బిజెపికి ముస్లిముల్లో కూడా సానుకూల దృక్పథం కోసం తీసుకున్న రాజకీయ చర్యగానే దీనిని చూడాలి తప్ప హిందువుల మనోభావాలకు అనుగుణంగా ముస్లిములపై విసిరిన పంజాగా భావించడం తప్పు. కాశ్మిర్ స్వతంత్ర ప్రతిపత్తి అంశం, ఉమ్మడి సివిల్ కోడ్, రామమందిరం విషయాల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఊరికే చర్చ నడుస్తుంది అంతే. అది మద్దతుదారులు, బోగస్ ప్రచార కర్తలు చేసేపని మాత్రమే. నిజానికి ఇవి ఇలా ఉంటేనే బిజెపికి లాభం. అందుకే ప్రభుత్వపరంగా వాటిపై శ్రద్ధ ఏమీ కానరాలేదు. అగ్రవర్ణ పేదలకి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం లో ఆంతర్యమే ఇప్పుడున్న అన్ని రిజర్వేషన్లకు రక్షణ కవచం తొడగడం... అదే సమయంలో పేదరికం సాకుగా ఇతర కులాలు రిజర్వేషన్ల కోసం ఒత్తిడికి దిగకుండా చేయడం. కాబట్టి మోడీ రిజర్వేషన్లని ఎత్తేస్తాడని కూడా అనుకోవక్కరలేదు.

*ఇది నా దృక్కోణంలో నరేంద్ర మోడీపై విశ్లేషణ. ఒక మనిషి గొప్పవాడు అన్నాము అంటే అతడు సర్వోన్నతుడు అని కాదు. సమగ్ర వ్యక్తిత్వం ఎవరికీ ఉండదు. అలా ఉంటే మనిషి ఎందుకు అవుతాడు.. దేవుడే అవుతాడు. పైగా రాజకీయాల్లో ఉన్నవాడు యోగి అయినా కూడా రాజుగా కొన్ని విధానాలు పాటించాలి. కొన్ని తప్పులూ చేయాలి.. ఎత్తుగడలూ వేయాలి. ఇంత చెప్పాకా మోడీ అసలు తప్పులే చేయలేదా అంటే.. కొన్ని తప్పులూ నా దృష్టిలో ఉన్నాయి. వాటిని అతిత్వరలోనే ఇంకో వ్యాసంలో చర్చిస్తాను.

ముఖ్యాంశాలు