సమష్టి కృషితోనే అటవీ సంరక్షణ సాధ్యం


అటవీ సంరక్షణ అనేది వ్యక్తిగతంగా ఏ ఒక్కరో చేయగల పని కాదని, సమష్టి కృషి, వివిధ శాఖల సమన్వయంతోనే ఇది సాకారమవుతుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టిఎఫ్ డిసి) మేనేజింగ్ డైరెక్టర్, ఉమ్మడి ఎపి అటవీ అకాడమీ (దూలపల్లి) పూర్వ సంచాలకులు పి. రఘువీర్ అన్నారు. సోమవారం ఆయన దివాన్ చెరువు గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమిని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి ఆయనకు అకాడమీ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను, ట్రైనింగ్ సదుపాయాలను గురించి వివరించారు. అకాడమీ వెబ్ సైట్ ను, లోగో ను ఆసక్తిగా తిలకించిన రఘువీర్ అన్ని విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అకాడమీ ఫ్యాకల్టీ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన శిక్షణలో ఉన్న ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులతో వనతరంగిణి సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ట్రైనింగ్ ను ప్రతిఒక్కరూ తమ జీవితకాలంలో లభించిన గొప్ప అవకాశంగా భావించాలని, ప్రతి రోజును సద్వినియోగం చేసుకొని విధినిర్వహణలో అత్యున్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సంపద, అన్ని సదుపాయాలు ఉన్న రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ ఏర్పాటు సముచితమని ఆయన అభిప్రాయపడ్డారు. అనతి కాలంలోనే పూర్తి స్థాయి బోధన, వసతి, శిక్షణ సదుపాయాలను సమకూర్చడంలో అకాడమీ సంచాలకులు మూర్తి విజయవంతమయ్యారని కొనియాడారు. గతంలో దూలపల్లి అకాడమీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఎంతో విజయవంతమైనాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రతా కోసం నైట్ పెట్రోలింగ్, నాకాబందీ, క్యాంపస్ పెట్రోలింగ్ వంటివి అమలు చేశామన్నారు. అటవీ ఉద్యోగుల్లో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంచడం కోసం సెమినార్లు నిర్వహించేవారమన్నారు. ఇటువంటి సెమినార్లలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి ట్రెయినీలు పలు ప్రయో జనకరమైన సూచనలు చేసారని, అవన్నీఇప్పుడు రెడ్ సాండర్స్ యాక్షన్ ప్లాన్ లో వాడబడు తున్నాయని తెలిపారు. అప్పట్లో అకాడమీ ట్రెయినీలు హైదరాబాద్ కు రూపొందించిన బయోడైవర్సిటీ ఇండెక్స్ 192 దేశాలతో జరిగిన జీవ వైవిధ్య సదస్సుకు నాంది పలికింద న్నారు. ఫ్యాకల్టీకి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను ట్రెయినీలనుంచి తీసుకుని, తగిన మార్పులు చేయడం వలన బోధన ప్రమాణాలు మెరుగుపదాటాయని రఘువీర్ చెప్పారు. కొత్తగా ఏ విషయం నేర్చుకున్నారనే విషయాన్ని.. అలాగే ఆ పరిజ్ఞానాన్ని విధి నిర్వహణలో ఏవిధంగా వినియోగిస్తారనే సంగతిని ట్రెయినీలతో ప్రతివారం చెప్పించడం వలన సత్ఫలితాలు ఉంటాయన్నారు. ప్రతి అటవీ ఉద్యోగి అడవితో అనుబంధాన్ని పెంచుకోవాలని, నిజాయితీగా, నిర్భీతిగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా తమ పేరు ప్రజలకు పదికాలాలు గుర్తుండిపోయేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. అకాడమీ డైరెక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి ప్రసంగిస్తూ దూలపల్లిలో రఘువీర్ సారథ్యంలో చేసిన సంస్కరణల్ని, అమలు చేసిన ఉన్నత బోధన పద్ధతుల్ని వివరించారు. ప్రతి అటవీ అధికారికి ఆయన రోల్ మోడల్ అని ప్రశంసించారు. దూలపల్లి తరహాలోనే ఇక్కడ కూడా సిబ్బంది ఆలోచనలు, ఆవిష్క రణలను సమాజోపయోగం కోసం బయటికి తెచ్చే కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ రాజమండ్రి రీజినల్ మేనేజర్ పి. రామ్మోహనరావు కూడా ప్రసంగించారు. డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు స్వాగతం పలికారు.

ముఖ్యాంశాలు