సుప్రీం లో ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ


కనీసం 50శాతం వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘దీనిపై మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకే ఒక్క నిమిషంలో వాదనలు ముగించి కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా లెక్కించే వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక శాసనసభ నియోజకవర్గంలోని అయిదు వీవీప్యాట్ల స్లిప్పులను ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్‌ 8న ఆదేశించింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. వీవీప్యాట్‌ చీటీల లెక్కింపును ఒకటి నుంచి అయిదుకు చేయడం సహేతుకమైన సంఖ్య కాదు. అది సంతృప్తి కలిగించేదీ కాదు అని ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు. తీర్పు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మా రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే మా కోరిక. వీవీ ప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం లాభం. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిందేనని గట్టిగా కోరాం. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది మా ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమని ఈసీ గుర్తించాలి. మా పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే మా పోరాటం కొనసాగిస్తాం. వీవీ ప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తాం. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకి సిబ్బంది సరిపోరని చెప్పడం తప్పించుకోవడమే అని వారు విమర్శించారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి సిబ్బంది సరిపోతారు అని చంద్రబాబు అన్నారు.

ముఖ్యాంశాలు