కేబినెట్ భేటీపై సీఎం నోట్..అధికారుల ఉత్కంఠ


రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి సమస్య, తుపాను సహాయక చర్యలు, కరవు పరిస్థితులపై చర్చించేందుకు కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్ పంపింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం కార్యాలయం పంపిన ఈ నోట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రమణ్యం మల్లగుల్లాలు పడుతూ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. కేబినెట్‌ సమావేశం నిర్వహించాలంటే సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్‌ పంపిస్తుంది. ఆ నోట్‌ను సీఎస్‌... ఇతర విభాగాల కార్యదర్శులకు పంపిస్తారు. కార్యదర్శులు పంపే సమాచారం ఆధారంగా అజెండా రూపొందిస్తారు. ఇది సాధారణ ప్రక్రియ. కానీ, కోడ్‌ అమల్లో ఉండటంతో కేబినెట్‌ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై సీఎస్‌ సుబ్రమణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. కేబినెట్‌ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశముంది.

ముఖ్యాంశాలు