ఫైజాబాద్ జిల్లా ఇక శ్రీ అయోధ్య జిల్లా!


అలహాబాద్‌ పేరును ‘ప్రయాగ్‌రాజ్‌’గా మార్చిన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగా యూపీలోని మరో నగరం పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఫైజాబాద్‌ పేరును ‘శ్రీ అయోధ్య’గా మారుస్తున్నట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫైజాబాద్‌ ఇక నుంచి శ్రీఅయోధ్యగా పిలవబడుతుందని ప్రకటించారు. అయోధ్య కూడా ఇక్కడకు సమీపంలో ఉంది. దీంతో ఫైజాబాద్‌ జిల్లాను శ్రీ అయోధ్య జిల్లాగా వ్యవహరించనున్నారు. ‘అయోధ్య గురించి మాట్లాడుకోవడానికే ప్రజలు భయపడతారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇక్కడికి రాలేదు. కానీ నేను సీఎం అయ్యాక అయోధ్యకు ఆరు సార్లు వచ్చాను. గౌరవం, ప్రతిష్ట, ఆత్మగౌరవానికి అయోధ్య ఓ చిహ్నం. అయోధ్యలో కొత్తగా వైద్య కళాశాలను తీసుకొస్తాం. దానికి దశరథుడి పేరు పెడతాం. త్వరలోనే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి పురుషోత్తం భగవాన్‌ రామ్‌ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని సీఎం యోగి తెలిపారు. శ్రీరాముడి పేరు మీద ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.

ముఖ్యాంశాలు