రాజమండ్రి అలయ్ బలయ్ .. ఇది ప్రసాదరెడ్డి ఆత్మీయ సమ్మేళనం!


దత్తన్నగా సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే అలయ్ బలయ్ అంటే తెలియని వాళ్లుండరు! పండగ సందడికి ఒకింత ఆత్మీయతను, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగత అభిమానాన్ని ప్రదర్శించే ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఎందరినో నాయకులను ఒకచోటికి చేర్చేకార్యక్రమం. ఇప్పుడు ఆ తరహా కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరానికి చెందిన దారపు ప్రసాదరెడ్డి ఈ సంక్రాంతికి నిర్వహిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో ప్రముఖంగా వ్యవహరించిన ప్రసాదరెడ్డి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసారు. ప్రస్తుతం ఆయన ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు. స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర నేతగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా అనేకమందితో వ్యక్తిగత పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న ప్రసాదరెడ్డి పలు యువజన, ప్రజాసంఘాలకు కూడా ఆప్తుడు. ఈ ఏడాది సంక్రాంతి, కనుమ పండగల రెండు రోజులూ ధవళేశ్వరం జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఆయన అలయ్ బలయ్ తరహాలో "ఆత్మీయ సమ్మేళనం" నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ పార్టీల ప్రముఖులు, అధికారులు, వివిధ వర్గాల ప్రతినిధులు, స్వదేశీ జాగరణ్ మంచ్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ క్రీడల పోటీలు, యువకుల కరాటే పోటీలు, సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు ప్రసాదరెడ్డి ఆయన మిత్రబృందం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బిజెపి ప్రముఖ నేతలు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, సోము వీర్రాజు తదితరులకు సన్నిహిత అనుచరునిగా మసలిన ప్రసాదరెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా సొంత ముద్ర ఉంటుంది. పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఒకే వేడుకలో ఆత్మీయంగా పాల్గొనేలా ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తున్న ప్రసాదరెడ్డి కృషి సఫలం కావాలని పలువురు ఆశిస్తున్నారు. ఇకపై ఏటా సంక్రాంతికి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తానని కూడా ప్రసాదరెడ్డి చెబుతున్నారు. తన ప్రవర్తనతో, మాట తీరుతో అటు మాస్ ని ఇటు క్లాస్ ని కూడా మెప్పించే స్నేహ శీలి దారపు ప్రసాదరెడ్డి. రాజమండ్రి పక్కనే చిన్న గ్రామం ధవళేశ్వరం నుంచి రాజకీయం మొదలెట్టినా... ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, చండీగఢ్, సిమ్లా అనే తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్లి జై హింద్.. భారత్ మాతాకీ జై అనగల చొరవ అతని సొంతం. ఇప్పుడు తనదైన శైలిలో ప్రసాదరెడ్డి ఈ వినూత్న కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు..

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం