బడ్జెట్ స్వరూపం పై సర్వత్రా చర్చ


బడ్జెట్‌ వేడి రాజుకుంటోంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల జరగనున్న దృష్ట్యా తాజా బడ్జెట్‌ రాజకీయంగా కీలక భూమిక పోషించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయపన్ను చెల్లింపు వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కాస్త ఊరట ఇస్తుందనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ బడ్జెట్‌కు సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. అందరి విన్నపాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. వీటిల్లో ప్రధానంగా ఆదాయపన్ను మినహాయింపు పరిధిని పెంచటం, ఆరోగ్య బీమాకు సంబంధించి అదనపు ప్రోత్సాహకాలు కల్పించడం, అదే సమయంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టబడులను మరింత ప్రోత్సహించడం తదితర అంశాలు కీలకం కానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇదివరకు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, విస్తృతంగా పెట్టుబడులు పెడుతుందని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది పూర్తిగా సాధ్యంకాకపోవచ్చు. కార్పొరేట్‌‌ పన్ను వసూళ్లు ఆశించిన దానికన్నా చాలా తక్కువ వచ్చాయి. అదే సమయంలో జీఎస్‌టీ ప్రభావంపై కూడా ఆర్థిక వ్యవస్థపై పడింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో రూ.5లక్షలు దాటిన స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలపై వచ్చే లాభంపై పన్ను విధించడం అనే అంశాన్ని ప్రభుత్వం పునః పరిశీలించాలని కొందరు అంటున్నారు. దీని వల్ల సుమారు 5వేల మదుపరులపై ప్రభావం పడినా, సుమారు 5కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.2.5లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో రూ.1.5లక్షలు ప్రజా భవిష్య నిధి లేదా ఐదేళ్ల బ్యాంకు ఫిక్సిడ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద లాభపడవచ్చు. దానితో పాటు రూ.25,000 వేల వరకూ ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు లభిస్తుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నులు. మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులకు ఊరట కల్పించేలా 2018 బడ్జెట్‌లో పన్ను ప్రోత్సాహకాలు, మినహాయింపులు కల్పించవచ్చని అంటున్నారు. అదే సమయంలో కార్పొరేట్‌ పన్నును తగ్గించవచ్చునని అంటున్నారు. దేశంలోనే తొలిసారి జాతీయ ఉద్యోగ విధానం(ఎన్‌ఈపీ)పై తాజా బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు