విడుదలకు పద్మావత్ సిద్ధం.. షాకిచ్చిన రాజస్థాన్

ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న 'పద్మావత్' సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపినా తాము మాత్రం అంగీకరించబోమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను తమ రాష్ట్రంలో ఈ విడుదల చేయనివ్వబోమని ప్రకటించింది. తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమా ఎట్టకేలకు పేరు మార్చుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు 'సీబీఎఫ్సీ' అనుమతి ఇచ్చింది. మేవాడ్ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తీసిన ఈ సినిమా పై కర్ణిసేన నేతృత్వంలోని రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడుదలకి అవాంతరాలు వచ్చాయి. రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో డిసెంబర్ నెలలో విడుదల కావలసిన ఈ చిత్రం తాత్కాలికంగా ఆగిపోయింది. సీబీఎఫ్సీ పలు మార్పులు సూచించింది. పలుచోట్ల కత్తెరలు వేసింది. ఇందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. సినిమా టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చేందుకు అంగీకరించింది. రాజ్‌పుత్‌లు ఇంకా 'పద్మావత్’ సినిమాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేవలం సినిమా పేరును మారిస్తే సరిపోదని, సినిమాలోని పాత్రధారుల పేర్లను కూడా మార్చాలని రాజ్‌పుత్ కర్ణిసేన డిమాండ్ చేసింది. ఈ సినిమాను నిషేధించాలనే తమ డిమాండ్ అన్నారు. సీబీఎఫ్సీ ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ సినిమా బాగా లేదని, చరిత్రని వక్రీకరించారని, కేవలం డబ్బుల కోసమే ఈ సినిమాను తీశారని నివేదించిందని అని కర్ణిసేన సభ్యుడు మణిపాల్ సింగ్ మకర్ణ మీడియాతో అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నామని, విషయాన్ని ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తానని అయన అన్నారు. లేదంటే సినిమా విడుదల తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సినిమా విడుదలైతే థియేటర్లను పెట్రోల్ పోసి తగులబెడతామని కర్ణిసేన సభ్యులు హెచ్చరిస్తున్నారు.