అగ్రవర్ణ పేదలకు మోదీ రిజర్వేషన్


అగ్రవర్ణాలలోని పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించింది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ కోటా వర్తిస్తుంది. దీని రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నా నేపథ్యంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరిం చుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ వర్తింపజేయాలంటూ చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్నవారికి ఈ కోటా వర్తిస్తుందని ప్రాథమిక సమాచారం. పది శాతం రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సమావేశాలను ఒకరోజు పాటు అంటే జనవరి 9 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనం సృష్టించింది. లోక్‌సభలో మంగళవారంనాడు రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం, అదే ఊపులో పెద్దలసభ లోనూ ప్రవేశపెట్టాలని పట్టుదలతో ఉంది. పార్టీ ఎంపీలకు దీనిపై విప్ కూడా జారీచేసింది. ఉభయసభల్లోనూ బిల్లు పాస్ చేయించి శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే రాష్ట్రపతికి ఆమోదానికి పంపడం సర్కారు లక్ష్యం.

ముఖ్యాంశాలు