విజ్ఞానాల పుట్ట భారతీయ సంస్కృతి


(ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీమద్భాగత ప్రవచన మహాయజ్ఞం ఆరవనాటి ప్రసంగం) భారతీయ సంస్కృతి విజ్ఞానాల పుట్ట అని, పురాణం ఇతిహాసాలతో కూడిన మన వేద వాఙ్మయం విశ్వ విజ్ఞాన రహస్యమని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మస్పష్టం చేసారు. పరిశీలనగా చూస్తే ప్రతి పురాణ కథలోనూ సైన్స్, వేదాంతం కనిపిస్తాయని తెలిపారు. సైన్స్ లో మళ్ళీ మెటీరియల్ సైన్స్ తో పాటు మోరల్ సైన్స్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. పురాణాలు కాలక్షేపం కోసం కాదన్నారు. వీటిలో మానసిక శాస్త్రం, జన్యు శాస్త్ర రహస్యాలు ఇమిడి ఉన్నాయని.. వాటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా రాజమహేంద్రవరం లోని విరించి వానప్రస్థ ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆరవ నాటి ప్రవచనం గావించారు. జయ విజయుల గాధ, హిరణ్యాక్ష వధ, వరాహావతార వైభవం, కృష్ణ, గోవింద నామాల ప్రాచీనత మరియు అంతరార్ధాలు, కర్దమ ప్రజాపతి- దేవహూతిల చరిత్ర, సేశ్వర సాంఖ్య వైశిష్ట్యం ఇత్యాది విశేషాలను భాగవతులకు పరవశం కలిగేలా వివరించారు. శ్రీ కృష్ణుడిని భాగవతం బ్రహ్మ తత్వంగా ప్రతిపాదించింది అని ఆయన చెప్పారు. ఒకనాడు సనకసనందనాదులు వైకుంఠానికి రాగా ద్వారపాలకులైన జయవిజయులు వారిని ఆపి ఆగ్రహానికి గురవుతారన్నారు. రజో తమో గుణాలు ప్రదర్శించిన మీరు విష్ణువుకి దూరమై పతనమవుతారని ఈ సందర్భంగా సనకాదులు శపించారన్నారు. అనంతరం మహావిష్ణువు జయవిజయులు ఊరడించి దయతో ఒక అవకాశం ఇచ్చాడన్నారు. భక్తులుగా చరిస్తూ ఏడు జన్మల్లో తిరిగి నన్నుచేరుకుంటారా.. శత్రుభావంతో వైరం పూని మూడు జన్మల తర్వాత వైకుంఠానికి వస్తారా అని అడిగితే.. శత్రువులుగా ఉన్నా సరే త్వరగా విష్ణు సన్నిధానానికి రావడానికే వారు మొగ్గు చూపారని వెల్లడించారు. అలా వారు హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తృలుగా మూడుసార్లు జన్మించి మహావిష్ణువుపై వైరభావంతో చరించి చివరికి ఆయన అవతారాలైన వరాహ, రామ, కృష్ణుల చేతిలో మరణించి తిరిగి వైకుంఠానికి చేరారన్నారు. విష్ణువుపై వైరం పట్టడం ద్వారా వారి భావం పతనమైనా లక్ష్యం భగవానుడే కావడం చేత వారు తరించారన్నారు. మహా విష్ణువు అవతార గాధలను చదివేటప్పుడు.. ప్రతి అవతారము తనను తరింపజేయడానికే వచ్చినదన్నట్టుగా భక్తుడు భావన చేసుకోవాలని.. తాదాత్మ్య భావనతో చదవాలని ఉపదేశించారు. శ్వేతా వరాహ కల్పంలోని ఈ కలియుగానికి సంబంధించి వరాహావతారం ప్రథమ అవతారమన్నారు. భూమిని సముద్ధరించిన ఈ అవతార వైభవము అనితరమని చెబుతూ ఆది వరాహమైన విష్ణువును ఆ రూపంలో స్మరించినా, ఈ అవతార గాధను చదివినా బహు యజ్ఞాల ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. సృష్టిని విస్తరింపజేయడానికి ఉద్యుక్తుడయిన బ్రహ్మ సనకసనందనాదులను, నారదుడిని, ప్రజాపతులను సృష్టించాడన్నారు. సనకాదులు, నారదుడు నివృత్తి మార్గంలోకి మరలిపోగా ప్రజాపతులతో జనోలోక సత్యలోక తపోలోకాలలో స్థిరులయ్యారు. ఇక భూమిపై సృష్టి కోసం బ్రహ్మ స్వాయంభువ మనువు, శతరూప లను సృష్టించాడని.. ఆ విధంగా ప్రథమ మిథునానికి తద్వారా సృష్టికి సంకల్పించి మనువును తపస్సుకి ఆదేశించాడన్నారు. తపస్సు తర్వాత వచ్చిన మనువుకి భూమి ఎక్కడుందో కానరాక బ్రహ్మను అడగ్గా ఆయనకీ భూమి జాడ తెలియక.. తరుణోపాయం కోసం విష్ణువుని ధ్యానించాడన్నారు. విష్ణువును తలచి బ్రహ్మ ధ్యానిస్తుండగా... ఆయన నాసిక నుంచి అంగుష్ఠమాత్రమైన ఒక వరాహ రూపం ఆవిర్భవించిందని.. అది బ్రహ్మ ద్వారా వచ్చినది తప్ప బ్రహ్మ వలన కాదని సామవేదం వెల్లడించారు. చూస్తుండగానే ఆ వరాహరూపం విస్తరించిందని.. అపుడు అనేక లోకాల్లోని దేవప్రముఖులు, సిద్ధులు, మహర్షులు సత్యలోక చేరుకొని ఆది వరాహాన్నిదర్శించి బ్రహ్మదేవునితో సహా స్తుతించి తరించారని తెలిపారు. అనంతరం ఆదివరాహం జలాంతర్భాగంలో హిరణ్యాక్షుడు కక్ష్య తప్పించి దాచి ఉంచిన భూమిని వెలికి తీసుకువచ్చి సరైన చోట నిలబెట్టాడని... ఘోర యుద్ధంలో హిరణ్యాక్షుని సంహరించాడని వివరించారు. విష్ణు సహస్రనామ స్తోత్రం, పృథ్వీ సూక్తం, పురుష సూక్తం, శ్రీమద్భాగవతం, భగవద్గీత ఇత్యాదుల ప్రతిపాదనలను, వర్ణనలను సమన్వయము చేస్తూ యజ్ఞ రూపమైన వరాహావతార విశేషాలను ఆయన వివరించిన తీరు సభాసదులను ముగ్ధులను గావించింది. భూమిని ఎత్తుకుపోవడం అంటే కక్ష్య తప్పించడం అనే వైజ్ఞానిక విషయాన్ని గ్రహించాలని.. అప్పటి దారి మళ్ళిన సైంటిస్ట్ గా హిరణ్యాక్షుడిని గుర్తించాలని తెలిపారు. విశ్వ నియామకుడైన మహావిష్ణువు తన నియమాన్ని పునరుద్ధరించేందుకు ఇక్కడ అవతారంగా వచ్చి భూమిని మళ్ళీ కక్ష్యలో నిలిపాడన్నారు. ఇలా దిగివచ్చిన వరాహావతారం మొత్తం యజ్ఞమయమని పేర్కొంటూ అందుకు సంబంధించిన ప్రమాణాలను, శ్లోకాలను ప్రస్తావించారు. విశ్వం మొత్తాన్ని వ్యాపించి ఉన్నా శక్తికి విష్ణు, వాసుదేవ నామాలు ఉన్నట్టే విశ్వాన్ని, అందలి గ్రహ నక్షత్రాదులను, మానవదేహాన్ని ఎక్కడికక్కడ అణువులను ఆకర్షించి పట్టి ఉంచుతున్న శక్తికి కృష్ణ అని పేరన్నారు. భూమిని గోవుగా వేదం చెప్పిందని.. అట్టి గోవుని కాపాడినవాడు కనుక వరాహావతారుడు గోవిందునిగా కీర్తించబడ్డాడని పేర్కొన్నారు. అందుచేత కృష్ణ, గోవింద నామాలు కేవలం కృష్ణావతరం నుంచే వచ్చాయని అనుకోరాదని ప్రవచించారు. భూమిని, గోవును కాపాడిన వరాహారాధన అన్నదాయకమన్నారు. భగవదనుభూతి కలగడమే జ్ఞానం అని.. వైరాగ్యం పొంది, పరమాత్మపై రక్తిని కలిగి ఉండి ఇంద్రియాలను జయించడమే సాధన అని భాగవతం చెబుతున్నదన్నారు. కర్మ కాండలో యజ్ఞ రూపంలో, జ్ఞానరూపంలో బ్రహ్మముగా భగవానుడే వ్యక్తం అవుతున్నాడన్నారు. యజ్ఞం యొక్క లక్ష్యం లోక క్షేమం అని సామవేదం తెలిపారు. యజ్ఞం మానేస్తే కృతఘ్నత దోషం చుట్టుకుంటుందని.. అసలు యజ్ఞాలను వ్యతిరేకించే వారినే అసురులు అంటారని స్పష్టం చేసారు. భారతీయ సంస్కృతి ధర్మ బద్ధమైన భోగాలను అనుభవించమని, కోరికలను భగవదనుగ్రహంతో, ఆయనే ఇచ్చాడనే స్పృహతో తీర్చుకోమని చెబుతుందన్నారు. ఎవరి కర్మ ధర్మ బద్ధం కాదో వాడు బతికి ఉన్నా చచ్చిన వానితో సమానమని భాగవతం చెప్పిందన్నారు. అలాగే ఎవని కర్మలు వైరాగ్యాన్ని కలిగించవో వాడు కూడా జీవన్మృతుడే అని తెలిపిందన్నారు. ధర్మబద్ధమైన కర్మలు చేసి, వైరాగ్యాన్ని పొందినప్పటికీ ఎవని దృష్టి పరమాత్మపై లగ్నం కాదో అట్టి వాడు కూడా మరణించిన వానితోనే సమానమన్నది గమనించాలన్నారు. వైరాగ్యం భగవద్భక్తిగా మారలేదంటే వాడి కర్మలు ధర్మ బద్ధం కాదనే గ్రహించాలన్నారు. లౌకికమైన వెంపర్లాటను ఎక్కడ ఆపేసి పారమార్థిక కృషిని ప్రారంభించాలీ అనే విషయాన్ని ధర్మం నిర్దేశించాలని బ్రహ్మశ్రీ సామవేదం ఉపదేశించారు. ప్రవచనకారులు శాస్త్రంలో ఉన్నది మాత్రమే నిర్మొహమాటంగా, నిర్ద్వంద్వముగా చెప్పాలి తప్ప మెప్పు కోసం తప్పులు చెప్పరాదన్నారు. తోచింది, నచ్చింది చెప్పాలంటే ఋష్యత్వం ఉండాలన్నారు. మాట చమత్కారం పెద్దరికం కాదని, శాస్త్ర సంస్కారమే పెద్దరికం అని స్పష్టం చేసారు. సిద్ధ గణాలకు ప్రభువు, సాంఖ్యాచార్యులకు గౌరవనీయుడు అయిన కపిలుడు విష్ణువు మరో అవతారమని చెబుతూ.. ఆ మహనీయునికి జన్మ ఇచ్చిన కర్దముడు, దేవహూతి దంపతుల వైరాగ్య సంసిద్ధతే అందుకు అర్హతగా నిలిచిందన్నారు. తల్లిదండ్రుల సంస్కారాలు, మనఃప్రవృత్తి, సంయోగ విషయంలో దేశకాల నియమాదులు శిశువుల వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయనేది మన పురాణాలు చెబుతున్న గొప్ప విషయమని ప్రతిపాదించారు. జంతువులు కూడా ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయని.. కానీ మానవుడు అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తూ భగవంతుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. పశుప్రాయంగా మారి జీవన సంస్కారాలు మరచిన జాతిని శుద్ధి చేయడానికే వివాహ గర్భాదానాది సంస్కారాలు ఉద్దేశించబడ్డాయన్నారు. కపిలుని సాంఖ్యం వేద విరోధమని కొందరు పండితులు కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవగాహన రహితమని సామవేదం వారు ఖండించారు. వేదం అంగీకరించిన షడ్దర్శనాల్లో సాంఖ్యం ఒకటన్నారు. అయితే సాంఖ్యంలో నిరీశ్వర సాంఖ్యం తర్వాతి కాలంలో వచ్చి చేరిందని.. కపిల మహర్షి ప్రతిపాదించినది సేశ్వర సాంఖ్యం అని స్పష్టీకరించారు. ప్రకృతి, జీవుడు, పరమాత్మ మూడింటి సంబంధమైన విషయాలను వర్గీకరించి చెప్పే శాస్త్రము సాంఖ్యం అని ఆయన నిర్వచించారు. ప్రకృతిని స్వాధీన పరచుకున్న భగవానుడి తత్వం తెలియాలంటే సాధకుడు మొదట ప్రకృతి బంధాన్ని విడిపించుకోవాలని అంటూ అది జరగాలంటే అసలు ప్రకృతి బంధం ఎదో, తాను ఏమిటో తెలియాల్సి ఉందన్నారు. సాంఖ్యం, పాతంజలం, న్యాయం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషికం అనేవి షడ్దర్శనాలని చెబుతూ.. ఇందులోని యోగం (పాతంజలం) పరమాత్మ స్పృహ విడిచి, యోగా, ధ్యానం, ఆరోగ్యం దగ్గరే ఆగిపోయిందన్నారు. ఏ విజ్ఞానమైనా పరమాత్మ స్పృహ లేకుంటే దానికి తరింపజేసే యోగ్యత ఉండదన్నారు. భారతీయ ధర్మంలో అధ్యాత్మ విద్య మహోత్కృష్టమని.. విద్యల్లో అధ్యాత్మవిద్యను తానే అని గీతాచార్యుడు కూడా చెప్పాడని ఉదహరించారు. పరమాత్మ వినా మరొకటి లేదని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నారు. ప్రపంచ భావనలో బంధం ఉంటే... భగవద్భావనలో మోక్షం ఉందన్నారు. ఈ భగవద్భావన కలగడానికి సత్పురుష సాంగత్యం తొలి మెట్టు అని పేర్కొన్నారు. సత్సంగం వలన వికారాలు తొలగి మనో నైర్మల్యం సిద్దిస్తుందన్నారు.

ముఖ్యాంశాలు